ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) : కష్టపడి పనిచేసి తాము సంపాదించిన సొమ్మును ఇంటికి çపంపాలని ఎంతో ఆశతో ఇరాక్ వెళ్లిన కార్మికులు.. పనులు లేక పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది కార్మికులు ఇరాక్‌లో తాము అనుభవిస్తున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాలుగు నెలల క్రితం కార్మికులు ఇరాక్ వెళ్లడానికి వీసాల కోసం నందిపేట్ మండలంలోని ఓ ఏజెంటును సంప్రదించారు. ఒక్కో కార్మికుని వద్ద రూ.1.80లక్షలు వసూలు చేసిన ఏజెంటు వర్క్ వీసాకు బదులు విజిట్ వీసా ఇచ్చి పంపించాడు. ఇప్పుడు విజిట్ వీసాపై వెళ్లాలని, ఇరాక్ వెళ్లిన తర్వాత తమ మరో ఏజెంటు వర్క్ వీసా ఇప్పిస్తాడని నమ్మించాడు. ఒక్కో కార్మికునికి నెలకు రూ.50వేల వరకు వేతనం ఉంటుందని చెప్పాడు. కానీ, స్వదేశంలోని ఏజెంటు చెప్పిన విధంగా ఇరాక్‌లో కార్మికులకు వర్క్ వీసా లభించలేదు. ఇరాక్‌లోనే ఉన్న జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన మరో ఏజెంటు కార్మికులను కలుసుకున్నా పని మాత్రం చూపలేదు. ఎర్‌బిల్‌లోని ఒక అద్దె ఇంటిలో కార్మికులను దింపి మాయమయ్యాడు. ఒక వారం పాటు రోజూ భోజనం సరఫరా చేసి.. ఆ తరువాత రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే భోజనం అందిస్తున్నాడని కార్మికులు తెలిపారు. ఎర్‌బిల్‌లోని ఇంటికి అద్దెను ఏజెంటు చెల్లించకపోవడంతో తామే అద్దె భారం మోసామని వెల్లడించారు. నాలుగు నెలల నుంచి కార్మికులు అద్దె ఇంట్లో గడుపుతున్నారు. ఇరాక్‌లో ఉన్న తమ వారు పడుతున్న కష్టాలను తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఒక్కో కార్మికునికి రూ.50వేల వరకు పంపించారు. ఇరాక్ వెళ్లడానికి చేసిన అప్పుకు మరింత అప్పు తోడై తమ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోతున్నారు.
రోజుకు 16 డాలర్ల చొప్పున జరిమానా..
ఇరాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం రోజుకు 16 డాలర్ల చొప్పున జరిమానా విధిస్తుంది. అంటే రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు జరిమానా భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఇంటికి రావడానికి అవసరమైన విమాన చార్జీలు సైతం సొంతంగా సమకూర్చుకోవాలి. ఇరాక్ నుంచి ఇంటికి రావాలంటే ఒక్కో కార్మికుడు దాదాపు రూ.లక్ష వరకు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇరాక్‌లో ఉన్న తమ వారిని ఇంటికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment