
మలేషియా : మలేషియాలో ఏజెంట్ల చేతిలో మోసపోయిన నిజామాబాద్ జిల్లా కార్మికునికి మలేషియా తెలంగాణా అసోసియేషన్ అండగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా జాక్రాల్లి మండలం కొలిప్యాక గ్రామానికి చెందిన బాల మహేష్ ఏజెంట్ల చేతిలో మోసపోయారు. ఏజెంట్ దుబాయ్ పంపిస్తానని మాయమాటలు చెప్పి మలేషియా పంపించాడని బాలమహేష్ తెలిపారు. మలేషియా వచ్చిన తరువాత కూడా అక్కడి ఏజెంట్ తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని, జీతం తక్కువగా ఇస్తూ చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధలు తట్టుకోలేక ఇండియా రావడానికి వేరే ఏజెంట్‌ని సంప్రదిస్తే అతను కూడా డబ్బులు తీసుకొని మోసం చేశాడని వాపోయారు.
చివరకు మహేష్ మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను సంప్రదించడంతో వారు అతనికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసి ఇండియన్ హై కమిషన్ సహాయంతో తిరిగి అతన్ని ఇంటికి పంపడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. బీద కుటుంబానికి చెందిన తాను రూ.1,80,000 అప్పు చేసి ఏజెంట్ల చేతిలో మోసపోయానని బాల మహేష్ కన్నీటిపర్యాంతమయ్యారు. తన తల్లి ఆరోగ్యపరిస్థితి కూడా బాగాలేదని, తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు.