ఖతర్‌లో మరణించిన వలస కార్మికులకు నివాళులు అర్పిస్తున్న బాధితులు, జేఏసీ ప్రతినిధులు
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఖతర్ అన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది. గత నెల 20న ప్రారంభమైన ఫుట్‌బాల్ పోటీలు ఈనెల 18తో ముగియనున్నాయి. ఫిఫా క్రీడా సంగ్రామంతో దాదాపు రూ.1.40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఖతర్.. తన గుర్తింపు కోసం రక్తం చిందించిన వివిధ దేశాల వలస కార్మికులను మాత్రం మరచిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫిఫా కోసం చేపట్టిన వివిధ నిర్మాణాల్లో భాగస్వాములైన వలస కార్మికులు ప్రమాదాల వల్ల, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు ఉన్నాయి. మరణించిన వలస కార్మికుల్లో తెలంగాణకు చెందిన వాళ్లే సుమారు వంద మంది వరకు ఉంటారని గల్ఫ్ జేఏసీ అంచనాల్లో తేలింది.
‘చనిపోయిన వారిని స్మరించుకుందాం–బతికి ఉన్నవారి కోసం పోరాడుదాం’ అనే నినాదంతో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఖతర్ ఫిఫా అమరులను స్మరిస్తూ నిజామాబాద్‌లో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఖతర్‌లో ఫిఫా పనులు చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఖతర్ సర్కార్‌కు బాధితుల గోడును వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డి, న్యాయవాది బాస రాజేశ్వర్‌లు బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నిరాశపరిచిన విదేశాంగ శాఖ..
పార్లమెంట్ సమావేశాల్లో ఖతర్ మృతుల ఆంశంపై ఎంపీలు వెంకటేశ్ నేత బొర్లకుంట, డాక్టర్ రంజిత్‌రెడ్డి, మాలోవత్ కవిత ప్రస్తావించారు. ఇందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇస్తూ ఖతర్ కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందుతుందని తెలిపారు. కానీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. కనీసం ఎంత మందికి పరిహారం అందించారనే విషయంలోనూ స్పష్టత లేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సమాధానం అస్పష్టంగా ఉండటం బాధిత కుటుంబాలను నిరాశపరిచిందనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. (క్లిక్ చేయండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment