కరోనా: వర్క్‌ వీసా కాలపరిమితి పొడిగింపు! | UK Extends Work Visas For Foreign Doctors Amid Corona Virus Outbreak | Sakshi
Sakshi News home page

వారికి ఏడాదిపాటు వీసా పరిమితి పొడిగింపు!

Published Wed, Apr 1 2020 4:23 PM | Last Updated on Wed, Apr 1 2020 4:32 PM

UK Extends Work Visas For Foreign Doctors Amid Corona Virus Outbreak - Sakshi

లండన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రబలుతున్న వేళ యునైటెడ్‌ కింగ్‌డం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటువ్యాధిని అరికట్టే చర్యల్లో భాగంగా.. తమ దేశంలో సేవలు అందిస్తున్న విదేశీ వైద్యులు, నర్సుల వీసా కాల పరిమితిని ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మహమ్మారిపై పోరులో భాగస్వామ్యమైనందుకు గానూ వారికి ఈ వెసలుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా దాదాపు 2800 మంది వలసజీవులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో భారత్‌ సహా ఇతర దేశాల నుంచి వచ్చి యూకేలో నివాసం ఉంటున్న వైద్య సిబ్బందికి ఊరట లభించింది. అక్టోబరులో వీసా గడువు ముగిసే వైద్యులకు మరో ఏడాది పాటు అక్కడే ఉండే అవకాశం లభించింది. (ట్రంప్‌కు హెచ్‌-1బీ వీసా ఉద్యోగుల అభ్యర్థన?)

ఈ విషయాన్ని యూకే హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌ మంగళవారం ధ్రువీకరించారు. ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి జాతీయ ఆరోగ్య సేవలో నిమగ్నమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది వీసా కాలపరిమితిని పొడిగిస్తున్నాం. కరోనాతో పోరాడుతూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వారి పట్ల కృతజ్ఞతాభావం చాటుకునే సమయం ఇది. వీసా ప్రక్రియ కారణంగా వారి దృష్టి మరలడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆటోమేటిక్‌గా ఏడాదిపాటు వీసాను మేమే పొడిగించాం. కాబట్టి ఎవరూ వీసా కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకు సంబంధించిన ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తిస్తుంది’’అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నర్సుల పనివేళల నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా బ్రిటన్‌లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో అక్కడ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.(‘యుద్ధం లేదు.. కానీ 5 వేల మంది చనిపోతే ఎలా?’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement