
లండన్: వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను మరో 6 నెలలు పొడిగించాలని బ్రిటన్ భావిస్తోంది. కరోనా రెండో దశకు చేరకుండా అడ్డుకోవాలంటే సెప్టెంబర్ వరకు లాక్‌డౌన్ ఉంచాల్సిన అవసరం ఉందని బ్రిటన్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ జెన్నీ హారిస్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ వ్యాప్తిని సమర్థవంతంగా నివారించాలంటే కొన్ని కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తి చెయిన్‌కు చెక్ పెట్టినట్టు అవుతుందన్నారు. (సెల్ఫ్ ఐసోలేషన్‌లో లేను: నారాయణమూర్తి అల్లుడు)
లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని ‘బీబీసీ’తో జెన్నీ హారిస్ చెప్పారు. ‘ఇప్పడే లాక్‌డౌన్ ఎత్తివేయాలని మేము అనుకోవడం లేదు. ఒక్కసారిగా నిర్బంధం తొలగిస్తే మా ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. మొత్తం పరిస్థితులను బట్టి చూస్తే మరో ఆరు నెలలకు పైగా లాక్‌డౌన్ కొనసాగించాల్సిన అవసరం రావొచ్చు. అయితే ఇంత పెద్ద స్థాయిలో లాక్‌డౌన్ చేయాల్సిన ఆగత్యం ఏర్పడకపోవచ్చు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని చర్యలను కంట్రోల్డ్ మేనర్‌లో మరింత ఎక్కువగా అమలు చేస్తామ’ని ఆమె వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు ఇంటికి పరిమితమైతే మున్ముందు వైరస్ ప్రభావం తగ్గుతుందని తెలిపారు.
బ్రిటన్‌లో గత వారం కొత్తగా 6,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వారం ఆరంభంలో ఇప్పటివరకు 2,710 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లండన్‌లో వచ్చే రెండు మూడు వారాల్లో గడ్డుకాలం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, యువరాజు చార్లెస్‌తో పాటు ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్ ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)
Comments
Please login to add a commentAdd a comment