Report says China Registering A Million Cases And 5000 Deaths A Day - Sakshi
Sakshi News home page

చైనాలో కరోనా బీభత్సం .. రోజుకి 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు !

Published Fri, Dec 23 2022 5:05 AM | Last Updated on Fri, Dec 23 2022 9:39 AM

China registering a million cases and 5000 deaths a day says report - Sakshi

బీజింగ్‌: చైనాలో జీరో కోవిడ్‌ విధానం అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడంతో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ బీఎఫ్‌.7 విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో ప్రస్తుతం ప్రతి రోజూ 10 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయని, 5 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లండన్‌కి చెందిన సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ అంచనా వేసింది. ఈ సంఖ్య రానురాను మరింతగా పెరిగిపోతుందని జనవరిలో రోజువారీ కేసులు 37 లక్షలకు చేరుకుంటాయని, మార్చి నాటికి కరోనా మరింతగా కోరలు చాచి ప్రతీ రోజూ 42 లక్షల కేసులు నమోదవుతాయని ఎయిర్‌ఫినిటీ సంస్థ తాజా నివేదికలో హెచ్చరించింది.

చైనాలో వివిధ  ప్రావిన్స్‌ల నుంచి వస్తున్న కేసుల వివరాలకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలకు పొంతన లేదని ఎయిర్‌ఫినిటీ సంస్థ విమర్శించింది. జిన్‌పింగ్‌ ప్రభుత్వం కరోనా కేసుల్ని బాగా తక్కువ చేసి చూపిస్తోందని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో అమెరికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో రోజుకి 14 లక్షల కేసులు నమోదయ్యాయని, అలాంటప్పుడు చైనాలో రోజుకి 30 లక్షలు కేసులు నమోదు కావడం సాధారణమేనని ఆ నివేదిక గుర్తు చేసింది.

చైనా ప్రభుత్వం లెక్కల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3 వేల కేసులు నమోదైతే, ఒక్కరు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోలేదు. మరోవైపు చైనాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయని, కరోనా పరీక్షలు చేయడం కూడా సాధ్యం కాక ప్రభుత్వం చేతులెత్తేసిందని బ్లూమ్‌బర్గ్‌ వంటి మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరేవారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉంటున్నారు. వైద్య సిబ్బంది కరోనాతో బాధపడుతూనే తమ విధుల్ని నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

డబ్ల్యూహెచ్‌ఒ ఆందోళన  
­చైనాలో కరోనా పరిస్థితిపై జిన్‌పింగ్‌ ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ జ్వరం మందులకి కూడా కొరత ఏర్పడిందని తెలిపింది. చైనా ఇప్పటికైనా కచ్చితమైన డేటా వెల్లడించి కరోనా కట్టడికి పరిష్కార మార్గాలు చూడాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయేసస్‌ హితవు పలికారు. కరోనా రోగులకు మందులు కూడా దొరకకపోవడంతో వారంతా సహజసిద్ధమైన చికిత్స విధానాలపై మళ్లుతున్నారని, నిమ్మకాయలు, విటమిన్‌ సి అధికంగా ఉన్న పళ్లు తింటూ ఇమ్యూనిటీని పెంచుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement