నిపుణులే కావాలి
► వ్యవసాయ కార్మికులకూ ఎర్రతివాచీ
► వలసలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: ప్రతిభాపాటవాలు, నైపుణ్యం ఆధారంగానే అమెరికాలోకి వలసలను అనుమతిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మికులకు కూడా వర్క్ వీసాలిచ్చే యోచన ఉందని తెలిపారు. బ్రిటిష్ వారపత్రిక ‘ది ఎకనమిస్ట్’కు గురువారం ఇచ్చిన ఇంటర్వూ్యలో ట్రంప్ అమెరికాలో వలసలపై మాట్లాడారు. అయితే, దేశంలోకి అక్రమ వలసలను తగ్గించే అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండా చట్టబద్ధంగా సాగే వలసలకు అనుకూలమని ఆయన తెలిపారు. ప్రతిభ, నైపుణ్యం ప్రాతిపదికన ఆస్ట్రేలియా, కెనడాల్లో జరిగే వలసల్లా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెండు దేశాల వలస విధానాలను ట్రంప్ ప్రశంసించారు.
ఆస్ట్రేలియా జనాభాలో 71 శాతం మంది మాత్రమే అక్కడ పుట్టగా మిగిలిన వారంతా వలస వచ్చిన వారే. వీరందరికీ దేశ అవసరాల రీత్యా వివిధ రకాల నైపుణ్యాలున్న వారికి మాత్రమే అక్కడకొచ్చి పనిచేయడానికి వీసాలు జారీచేస్తున్నారు. కెనడా కూడా అత్యున్నత స్థాయి ప్రతిభాపాటవాలు ఉంటేనే ‘స్కిల్డ్’ కేటగిరీలో వీసాలకు దరఖాస్తుచేసుకునే అవకాశం ఉంటుంది. ‘ప్రతిభావంతులే అమెరికాలోకి రావాలని కోరుతున్నాను. మన దేశాన్ని ప్రేమించేవారు, దేశాభివృద్ధికి పాటుపడేవారు ఇక్కడికొచ్చి పనిచేయాలంటున్నాను.
అమెరికాకు వలసొచ్చేవారు కనీసం ఐదేళ్లపాటు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి సాయం తీసుకోకుండా నిబంధనలు రూపొందిస్తున్నాం’ అని చెప్పారు. అమెరికా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడానికి బయటి నుంచి కార్మికులను ఆహ్వానిస్తున్నామన్నారు. ‘వ్యవసాయ కార్మికులకు వర్క్ వీసాలిచ్చే ఆలోచనలో ఉన్నాం. సరిహద్దులు దాటి మా పొలాల్లో పనిచేసి స్వదేశాలకుపోయే కార్మికులు ఇప్పుడూ ఉన్నారు. వీరిS సంఖ్య మరింత పెరగాలి’ అని ట్రంప్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలతో.. అమెరికా సర్కారు ప్రకటించే కొత్త వలసల విధానంతో భారత్ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత సాంకేతిక వృత్తినిపుణులకు ఇబ్బంది ఉండకపోవచ్చనే సూచనలు కనబడుతున్నాయి.