
యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాలోకి మారడానికి యూకే నిబంధనలను మరింత సరళతరం చేసింది. సరళతరం చేసిన ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు జనవరి 11 నుంచి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ కోర్సును పూర్తిచేసుకునే లోపలే టైర్-2 వీసా(స్కిల్డ్ వర్క్ వీసా)లోకి మారిపోవచ్చు.
అయితే ఇప్పటి వరకున్న నిబంధనల్లో టైర్-2 వీసాను విద్యార్థులు పొందాలంటే, కచ్చితంగా వారు డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిగ్రీ పట్టా పొందే దాకా ఆగాల్సి వస్తుండటంతో, అనంతరం విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడానికి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. దీంతో విద్యార్థులు ఉద్యోగం పొందడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సవరించిన నిబంధనల వల్ల కొన్ని నెలలు ముందుగానే విద్యార్థులు టైర్-2 వీసాను దరఖాస్తు చేసుకోవచ్చని ఈవై-యూకే పేర్కొంది.
ప్రస్తుతం చదువుకోవడానికి యూకే వెళ్తున్న విద్యార్థులకు స్టూడెండ్ వీసా(టైర్-4 వీసా)ను కోర్సు కాల వ్యవధితో పాటు 4 నెలల కాలానికి కలిపి ఇస్తున్నారు. కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటం విదేశీ విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడాన్ని దెబ్బతీస్తోంది. ఈ లోపల వారు ఉద్యోగం పొందలేకపోతే, విద్యార్థులు తమ స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. అంతేకాక టైర్-4 వీసా నుంచి టైర్-2వీసాల్లోకి మారడం కూడా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఆ లోపల డిగ్రీ పొందలేకపోతే, స్టూడెంట్ వీసాకు కూడా కాలం చెల్లిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment