Foriegn students
-
విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులంటే గతంలో డిగ్రీ, పీజీ మాత్రమే. ఇక విదేశీ విద్య అంటే అది అందని ద్రాక్షగా ఉండేది. కేవలం సంపన్నులకు మాత్రమే విదేశాలకు వెళ్లి చదివే స్థోమత ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిభ ఉంటే చాలు సామాన్యులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఆ విధంగా అవకాశాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేశాయి. ఐటీ రంగం బాగా వ్యాప్తి చెందడంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఇది కూడా విదేశీ చదువులపై విద్యార్థులు మక్కువ చూపేందుకు కారణమైంది. చదువుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విదేశీ వర్సిటీల్లో సీటు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో అర్హత గల సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఈ పథకం విశేషంగా దోహదపడునున్నది. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు దరఖాస్తు కోసం ఏం చేయాలి విదేశీ విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ విద్యానిధి వెబ్సైట్లో చూడవచ్చు. ఇతర సామాజిక వర్గాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇంకో అవకాశం కల్పించనున్నారు. ఇవీ అర్హతలు ► విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ► వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ► తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ► డిగ్రీ, ఇంజనీరింగ్‌లలో 60 శాతం మార్కులు తప్పనిసరి. అర్హత సాధిస్తే రూ.20 లక్షలు మంజూరు విదేశీ విద్యానిధి పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత రూ.10 లక్షలు అక్కడి ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు చెల్లిస్తుంది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ కింద అదనంగా రూ.10 లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టిక్కెట్‌కు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జత చేయాల్సిన పత్రాలు ► పదో తరగతి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ధ్రువీకరణ పత్రాలు ►ఆదాయ, నివాస, కుల ధవీకరణ పత్రాలు ► పాస్‌పోర్ట్, వీసా ►యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్–1 కాపీ ► జీఆర్ఈ, జీమాట్, టోఫెల్, ఐఎఫ్ఎల్టీఎస్ వివరాలు ►బ్యాంకు ఖాతా సమాచారం వెలువడిన ప్రకటన విద్యానిధి పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఎస్సీ, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను ఇప్పటికే అన్ని కళాశాలల విద్యార్థులకు ఆయా శాఖల కమిషనర్లు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం పథకం వివరాలను అందజేశారు. దేశాలు.. కోర్సులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, జర్మని, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ పథకం కింద చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ చైర్మన్‌గా ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, ఎస్సీ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, విదేశీ విద్యలో ఒక అనుభవజ్ఞుడు ఉంటారు. -
‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ
న్యూయార్క్: ఆన్లైన్ క్లాస్‌లకు మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బుధవారం బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆన్లైన్ క్లాసెస్‌కు మారిన విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న ఆదేశాల వల్ల విద్యాసంస్థలు త్వరగా పునఃప్రారంభమయ్యే అవకాశముందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డెప్యూటీ సెక్రటరీ కుసినెలీ అన్నారు. ట్రంప్ ఆగ్రహం: ఫాల్ అకడమిక్ సెషన్‌కి విద్యా సంస్థలను పునఃప్రారంభినట్లయితే, వారికి ఫెడరల్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి సంబంధించి అరోగ్య విభాగం జారీ చేసిన మార్గదర్శకాలను ఆచరణ సాధ్యం కాదని మండిపడ్డారు. -
భారత్‌లో చదువుకోండి...స్కాలర్షిప్ అందుకోండి..
న్యూఢిల్లీ : విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్టడీ ఇన్ ఇండియా’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించడమే కాక, ప్రపంచ స్థాయి విశ్యవిద్యాలయాలకు దీటుగా భారత వర్సిటీలను నిలపాలని యోచిస్తోంది. ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, కెనడాలో అమలులో ఉన్న ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి మన దేశంలో కూడా అమలుపర్చనున్నారు. ప్రస్తుతం భారతీయ విశ్యవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్ధులకు కేటాయిస్తున్న సీట్లు కేవలం 10 నుంచి 15శాతం మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ప్రారంభించిన ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా విదేశీ విద్యార్థులకు కేటాయించే సీట్లను పెంచడమే కాక రెండు సంవత్సరాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి రూ.150 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 45వేల మంది విదేశీ విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. 2022నాటికి వీరి సంఖ్యను 1.50లక్షల నుంచి 2లక్షల వరకూ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 30 దేశాల విద్యార్థులను భారత్‌లో అభ్యసించేందుకు అనుమతిస్తుంది. వీటిలో ఆసియా, ఆఫ్రికా దేశాలతో పాటు నేపాల్, సౌదీ అరెబియా, నైజీరియా, థాయ్‌లాండ్, మలేషియా, ఈజిప్ట్, కువైట్, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాల విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.ప్రతిభ ఉన్న విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ప్రకటించింది. -
విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాలోకి మారడానికి యూకే నిబంధనలను మరింత సరళతరం చేసింది. సరళతరం చేసిన ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు జనవరి 11 నుంచి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ కోర్సును పూర్తిచేసుకునే లోపలే టైర్-2 వీసా(స్కిల్డ్ వర్క్ వీసా)లోకి మారిపోవచ్చు. అయితే ఇప్పటి వరకున్న నిబంధనల్లో టైర్-2 వీసాను విద్యార్థులు పొందాలంటే, కచ్చితంగా వారు డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిగ్రీ పట్టా పొందే దాకా ఆగాల్సి వస్తుండటంతో, అనంతరం విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడానికి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. దీంతో విద్యార్థులు ఉద్యోగం పొందడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సవరించిన నిబంధనల వల్ల కొన్ని నెలలు ముందుగానే విద్యార్థులు టైర్-2 వీసాను దరఖాస్తు చేసుకోవచ్చని ఈవై-యూకే పేర్కొంది. ప్రస్తుతం చదువుకోవడానికి యూకే వెళ్తున్న విద్యార్థులకు స్టూడెండ్ వీసా(టైర్-4 వీసా)ను కోర్సు కాల వ్యవధితో పాటు 4 నెలల కాలానికి కలిపి ఇస్తున్నారు. కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటం విదేశీ విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడాన్ని దెబ్బతీస్తోంది. ఈ లోపల వారు ఉద్యోగం పొందలేకపోతే, విద్యార్థులు తమ స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. అంతేకాక టైర్-4 వీసా నుంచి టైర్-2వీసాల్లోకి మారడం కూడా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఆ లోపల డిగ్రీ పొందలేకపోతే, స్టూడెంట్ వీసాకు కూడా కాలం చెల్లిపోతుంది. -
విదేశీ విద్యకు ప్రవేశ పరీక్షలెన్నో..
విదేశీ విద్య ఇప్పుడు ప్రతి ఒక్కరి కల. విదేశాలకు వెళ్లి తమకు నచ్చిన కోర్సులు అభ్యసించి.. భావి జీవితానికి బలమైన పునాదులు వేసుకోవాలని విద్యార్థులు ఆశిస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఇందులోనూ అందరూ మొదటి గమ్యంగా భావించే అమెరికాకు వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఫారిన్ చదువుల కోసం ఏ దేశ నగరాల నుంచి అమెరికాకు ఎక్కువమంది విద్యార్థులు వస్తున్నారో తెలుసుకోవడానికి ఇటీవల అమెరికాకు చెందిన బ్రూకింగ్ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 26,220 మంది విద్యార్థులతో ప్రపంచవ్యాప్తంగా ఐదోస్థానంలో, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో విదేశీ విద్యను అభ్యసించాలంటే రాయాల్సిన పరీక్షల గురించి తెలుసుకుందాం.. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ (టోఫెల్) ఇది ప్రాథమిక స్థాయి ఆంగ్ల పరీక్ష. అమెరికాలోని యూనివర్సిటీలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడా, బ్రిటన్, సింగపూర్ సహా 130 దేశాలు, దాదాపు 9000 పైగా కాలేజీలు, యూనివర్సిటీలు టోఫెల్ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్ష స్కోర్ కార్డ్ రెండేళ్లపాటు చెల్లుతుంది. టోఫెల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ఆయా దేశాలు వీసా, స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ కూడా ఇస్తున్నాయి. పరీక్ష వ్యవధి నాలుగున్నర గంటలు. లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై ప్రశ్నలడుగుతారు. ప్రతి సెక్షన్‌కు 30 పాయింట్ల చొప్పున మొత్తం పాయింట్లు 120. పరీక్ష ఫీజు: 170 యూఎస్ డాలర్లు. ఏడాదిలో ఎప్పుడైనా ఆన్లైన్, ఫోన్, ఈమెయిల్ లేదా టోఫెల్ ఐబీటీ రిసోర్స్ సెంటర్‌కు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.ets.org/toefl స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్) విదేశాల్లో.. ముఖ్యంగా యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో అండర్గ్రాడ్యుయేట్/బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ చదవాలనుకునేవారు రాయాల్సిన పరీక్ష స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్). ఈ స్కోర్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే వాటిలో కెనడా, ఆస్ట్రేలియా, యునెటైడ్ కింగ్డమ్ వంటి దేశాలున్నాయి. స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. శాట్‌ను యూఎస్ఏలోని కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 20 లక్షలమంది శాట్ రాస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలై జేషన్ చేయాలనుకునేవారు శాట్ సబ్జెక్ట్ టెస్టులు రాయాలి. 2016 నుంచి శాట్ పరీక్ష విధానంలో మార్పులు రానున్నాయి. సంవత్సరంలో ఆరుసార్లు (జనవరి, మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏడాదిలో రెండుసార్లకు మించి రాయడానికి అవకాశం లేదు. 12 ఏళ్ల ఎడ్యుకేషన్.. అంటే ఇంటర్మీడియెట్ (10+2) పూర్తిచేసినవారు శాట్‌కు అర్హులు. మూడు గంటల 45 నిమిషాల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్. వీటిల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలడుగుతారు. శాట్ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుం కింద 51 యూఎస్ డాలర్లు, ఇతర రుసుంల కింద 40 యూఎస్ డాలర్లు చెల్లించాలి. సబ్జెక్టు టెస్టులు రాసేవారు నిర్దేశిత ఫీజులు పే చేయాలి. వెబ్సైట్: http://sat.collegeboard.org/ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో ఎంబీఏ, ఇతర బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). దీన్ని యూఎస్‌లోని గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 యూనివర్సిటీలు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా కోర్సుల్లో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి జీమ్యాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పరీక్షా విధానం: మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో వెర్బల్ (41 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ (37 ప్రశ్నలు), ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ (12 ప్రశ్నలు)తోపాటు అనలిటికల్ రైటింగ్‌పైన ప్రశ్నలుంటాయి. పరీక్ష ఫీజు 250 డాలర్లు. మన దేశ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్‌లలోని ప్రముఖ కాలేజీలు/యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే గ్రాడ్యుయేట్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, బిట్స్ పిలానీ, ఐఎస్బీ-హైదరాబాద్, ఎక్స్ఎల్ఆర్ఐ-జంషెడ్పూర్, మైకా-అహ్మదాబాద్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రముఖ సంస్థలు జీమ్యాట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జీమ్యాట్ రాసేవారికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పరీక్ష తేదీ నాటికి కనీసం వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి పరీక్ష రాస్తే 31 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుంది. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. సాధారణంగా ఈ మొత్తం స్కోర్ 200 నుంచి 800 మధ్యలో ఉంటుంది. ప్రధాన బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి కనీస స్కోరు ప్రకటించనప్పటికీ 600-700 వరకు మంచి స్కోరుగా భావించొచ్చు. ఆన్లైన్, ఫోన్, పోస్టల్ మెయిల్ ద్వారా సంవత్సరమంతా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.mba.com/india అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ) అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ) స్కోర్‌ను యూఎస్ కాలేజీల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. యూఎస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరాలనుకునేవారు శాట్ లేదా ఏసీటీ రాసుకోవచ్చు. ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దాని ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల కోర్సులను అందించే అమెరికన్ యూనివర్సిటీలు, కళాశాలలన్నీ ఏసీటీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడాలోని కొన్ని విద్యా సంస్థలు కూడా ఏసీటీ ఆధారంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఏసీటీని ఏడాదికి ఆరుసార్లు నిర్వహిస్తారు. దాదాపు మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్ (75 ప్రశ్నలు), మ్యాథ్స్ (60 ప్రశ్నలు), రీడింగ్ (40 ప్రశ్నలు), సైన్స్( 40 ప్రశ్నలు), వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.actstudent.org ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్ వంటి దేశాల యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం 130 దేశాల్లో 900 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నెలకు నాలుగుసార్లు చొప్పున ఏడాదికి 48 సార్లు పరీక్ష ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 9000 సంస్థలు ఐఈఎల్టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వీటిలో వివిధ యూనివర్సిటీలు, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, ఇతర సంస్థలు ఉన్నాయి. అంతేకాకుండా పని కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండు గంటల 45 నిమిషాల వ్యవధిలో అభ్యర్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలను తెలుసుకునే విధంగా లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగంలో కనీసం 1-9 వరకు స్కోర్ సాధించాలి. అన్ని విభాగాల్లో సాధించిన స్కోర్ ఆధారంగా సగటు స్కోరును లెక్కిస్తారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలమంది ఈ పరీక్ష రాశారు. స్కోర్ రెండేళ్లపాటు చెల్లుతుంది. ఫీజు: రూ. 9,900. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.ielts.org ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ) ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ) రివైజ్డ్ జనరల్ టెస్ట్.. విదేశాల్లో ఉన్నత విద్యావకాశానికి మార్గం వేసే పరీక్ష. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, డాక్టోరల్ కోర్సులు చదవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. అమెరికాలోని గ్రాడ్యుయేట్ స్కూల్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 3,200 ఇన్స్టిట్యూట్లు జీఆర్ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ ఎంపికకు కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జీఆర్‌ఈని ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో..850 కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి మూడు వారాల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో ఐదుసార్లు జీఆర్ఈ రాయొచ్చు. ఒక్కో పరీక్ష మధ్య కనీసం 21 రోజుల వ్యవధి ఉండాలి. గతంలో రాసిన పరీక్షలో వచ్చిన స్కోర్‌ను మెరుగుపర్చుకొనేందుకు మళ్లీ టెస్టు రాయొచ్చు. కంప్యూటర్/పేపర్ ఆధారిత విధానాల్లో పరీక్ష ఉంటుంది. అనలిటికల్ రైటింగ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లపై ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి దాదాపు గంటన్నర. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేయాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా జీఆర్ఈ సబ్జెక్టు టెస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏడాదిలో మూడుసార్లు (సెప్టెంబర్, అక్టోబర్, ఏప్రిల్) రాసుకునే సదుపాయం ఉంది. జీఆర్ఈ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది. వివరాలకు: www.ets.org/gre -
ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ!
టాప్ స్టోరీ: ఉన్నత చదువులు, ఉత్తమ కొలువుల కోసం భారతీయులు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు పరుగులు తీస్తుంటే... మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం భారత్‌ను ఆశ్రయిస్తున్నారు. అనువైన కోర్సులను ఆఫర్ చేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందుతున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థుల ప్రవేశాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రతిఏటా నాలుగు వేల మంది విదేశీయులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. ఈ అకడమిక్ సంవత్సరానికి ప్రొవిజనల్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఫోకస్... ఉన్నత విద్యనభ్యసించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విచ్చేస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి నెల రోజులుగా జరుగుతున్న అడ్మిషన్ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. అండర్ గ్రాడ్యుయేషన్‌లో 90 నుంచి 95 శాతం, పీజీలో 60 శాతం మేరకు ప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో కలిపి 2457 ప్రొవిజినల్ అడ్మిషన్లను జారీచేశారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న మంచి పేరే అధిక సంఖ్యలో అడ్మిషన్లు నమోదు కావడానికి ప్రధాన కారణం. ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులు పూర్తిస్థాయి నైపుణ్యాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి క్లైమేట్, కాస్ట్ ఆఫ్ లివింగ్, కల్చర్... ఈ మూడు అంశాలు విద్యార్థులకు ఎంతో అనువుగా ఉండడంతో చాలామంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరడానికి మొగ్గుచూపుతున్నారు’ అని యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్స్ కార్యాలయం డెరైక్టర్ ప్రొ.సి.వేణుగోపాల్‌రావు తెలిపారు. ఏటా పెరుగుదలే! ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చేరేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఓయూలోని యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్ కార్యాలయం (యూఎఫ్‌ఆర్‌ఓ) లెక్కల ప్రకారం.. 2014-15 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటివరకు 1372 అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), 1085 పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కలిపి మొత్తం 2457 ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్స్ (పీఏఎల్)ను జారీ చేశారు. వీటిలో కొన్ని తగ్గే అవకాశం ఉన్నప్పటికీ గత విద్యా సంవత్సరంలో నమోదైన అడ్మిషన్లతో పోల్చితే చాలా ఎక్కువ. 2013-14లో యూజీ, పీజీ.. రెండింటిలో కలిపి 1742 ప్రవేశాలు నమోదయ్యాయి. ఇంజనీరింగ్ కోర్సుల విషయానికి వస్తే గతేడాది వరకు అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించినప్పటికీ ఈ ఏడాది నుంచి క్యాంపస్‌కే ప్రవేశాలను పరిమితం చేశారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థుల సంఖ్య 72. ఇంజనీరింగేతర పీజీ కోర్సుల్లో క్యాంపస్‌తోపాటు నిజాం కళాశాల, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, కోఠి ఉమెన్స కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీటికి అదనంగా ఎ.వి.కళాశాల, సెయింట్ మేరీస్, భారతీయ విద్యాభవన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ ఆన్స్ తదితర ప్రముఖ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పిస్తున్నారు. సుమారు 80 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. 15-20 దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ యూనివర్సిటీలో పొందిన 1085 పీజీ ప్రవేశాల్లో 356.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) ద్వారా వచ్చినవి. 729 అడ్మిషన్లు సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌కు చెందినవి. అలాగే 1372 యూజీ అడ్మిషన్లలో 549 ఐసీసీఆర్ స్పాన్సర్ చేసినవి కాగా 823 సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌కు సంబంధించినవి. విదేశీ విద్యార్థి మెచ్చిన కోర్సులు ఓయూలో ప్రవేశాల సందర్భంగా కొన్ని కోర్సులకు విదేశీ విద్యార్థుల నుంచి డిమాండ్ ఉంటోంది. యూజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సెన్సైస్(బీసీఏ) కోర్సులో అత్యధికంగా 240 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పీజీలో 126 విద్యార్థులతో ఎంబీఏ టాప్‌లో నిలిచింది. ఈ కోర్సును రెండు సెక్షన్లుగా విభజించి క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహిస్తారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్(బీకామ్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ), ఎంఏ ఇంగ్లిష్, ఎంఎస్సీ(ఇన్ఫ ర్మేషన్ సైన్స్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కామర్స్(ఎంకామ్)ల్లో కూడా విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఫారిన్ స్టూడెంట్స్ ఓయూలో ప్రత్యేకంగా విదేశీ విద్యార్థుల కోసం సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఫారిన్ స్టూడెంట్స్ అనే కోర్సు ఉంది. దీని కాలవ్యవధి పదినెలలు. ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాలను పెంచుకోవ డానికి ఈ కోర్సులో ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సును యూజీ, పీజీ కోర్సులు చదువుతూనే అభ్యసించే అవకాశం లేదు. కాబట్టి తర్వాత విద్యా సంవత్సరంలోనే ఇతర యూజీ/ పీజీ కోర్సును అభ్యసిం చాలి. విదేశాల్లో ఓయూ కోర్సులకు మంచి గుర్తింపు! ‘‘మహారాష్ట్రలోని యూనివర్సిటీ ఆఫ్ పుణె తర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్న విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ నిలుస్తోంది. కామర్స్, లా, ఇన్ఫర్మాటిక్స్ తదితర 13 ఫ్యాకల్టీ విభాగాలతో వివిధ కోర్సులను అందిస్తూ విద్యార్థుల ఆదరణను పొందుతోంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్‌తో ‘ఎ’ గ్రేడ్ పొందడమే కాకుండా దేశంలో ఇప్పటివరకు కేవలం 15 యూనివర్సిటీలు మాత్రమే పొందిన ‘యూనివర్సిటీస్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్‌లెన్స్’ (యూపీఈ) హోదాను కూడా ఓయూ సొంతం చేసుకుంది. త్వరలో 100 సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దేశమేైదె నా ఉన్నత విద్యకోసం ఇక్కడికి వచ్చిన విద్యార్థులంతా కలిసిమెలసి ఉంటారు. ఇక్కడ కోర్సులనభ్యసించిన విదేశీ విద్యార్థులకు వారి సొంత దేశాల్లో గుర్తింపు, మంచి అవకాశాలు లభిస్తున్నాయి’’ - ప్రొఫెసర్ సి.వేణుగోపాలరావు, డైరెక్టర్, యూఎఫ్‌ఆర్‌ఓ, ఉస్మానియా యూనివర్సిటీ