ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ! | Osmania University gets record foreign students this year | Sakshi
Sakshi News home page

ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ!

Published Wed, Jul 30 2014 12:34 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ! - Sakshi

ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ!

టాప్ స్టోరీ: ఉన్నత చదువులు, ఉత్తమ కొలువుల కోసం భారతీయులు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు పరుగులు తీస్తుంటే... మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం భారత్‌ను ఆశ్రయిస్తున్నారు. అనువైన కోర్సులను ఆఫర్ చేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందుతున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థుల ప్రవేశాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రతిఏటా నాలుగు వేల మంది విదేశీయులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. ఈ అకడమిక్ సంవత్సరానికి ప్రొవిజనల్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఫోకస్...
 
 ఉన్నత విద్యనభ్యసించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విచ్చేస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి నెల రోజులుగా జరుగుతున్న అడ్మిషన్ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. అండర్ గ్రాడ్యుయేషన్‌లో 90 నుంచి 95 శాతం, పీజీలో 60 శాతం మేరకు ప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో కలిపి 2457 ప్రొవిజినల్ అడ్మిషన్లను జారీచేశారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న మంచి పేరే అధిక సంఖ్యలో అడ్మిషన్లు నమోదు కావడానికి ప్రధాన కారణం. ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులు పూర్తిస్థాయి నైపుణ్యాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి క్లైమేట్, కాస్ట్ ఆఫ్ లివింగ్, కల్చర్... ఈ మూడు అంశాలు విద్యార్థులకు ఎంతో అనువుగా ఉండడంతో చాలామంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరడానికి మొగ్గుచూపుతున్నారు’ అని యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్స్ కార్యాలయం డెరైక్టర్ ప్రొ.సి.వేణుగోపాల్‌రావు తెలిపారు.
 
 ఏటా పెరుగుదలే!
 ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చేరేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఓయూలోని యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్ కార్యాలయం (యూఎఫ్‌ఆర్‌ఓ) లెక్కల ప్రకారం.. 2014-15 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటివరకు 1372 అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), 1085 పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కలిపి మొత్తం 2457 ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్స్ (పీఏఎల్)ను జారీ చేశారు. వీటిలో కొన్ని తగ్గే అవకాశం ఉన్నప్పటికీ గత విద్యా సంవత్సరంలో నమోదైన అడ్మిషన్లతో పోల్చితే చాలా ఎక్కువ. 2013-14లో యూజీ, పీజీ.. రెండింటిలో కలిపి 1742 ప్రవేశాలు నమోదయ్యాయి.
 
 ఇంజనీరింగ్ కోర్సుల విషయానికి వస్తే గతేడాది వరకు అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించినప్పటికీ ఈ ఏడాది నుంచి క్యాంపస్‌కే ప్రవేశాలను పరిమితం చేశారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థుల సంఖ్య 72. ఇంజనీరింగేతర పీజీ కోర్సుల్లో క్యాంపస్‌తోపాటు నిజాం కళాశాల, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, కోఠి ఉమెన్‌‌స కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీటికి అదనంగా ఎ.వి.కళాశాల, సెయింట్ మేరీస్, భారతీయ విద్యాభవన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ ఆన్స్ తదితర ప్రముఖ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పిస్తున్నారు. సుమారు 80 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. 15-20 దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారు.
 
 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్
 యూనివర్సిటీలో పొందిన 1085 పీజీ ప్రవేశాల్లో 356.. ఇండియన్  కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) ద్వారా వచ్చినవి.
 729 అడ్మిషన్లు సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌కు చెందినవి. అలాగే 1372 యూజీ అడ్మిషన్లలో 549 ఐసీసీఆర్ స్పాన్సర్ చేసినవి కాగా 823 సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌కు సంబంధించినవి.
 
విదేశీ విద్యార్థి మెచ్చిన కోర్సులు
 ఓయూలో ప్రవేశాల సందర్భంగా కొన్ని కోర్సులకు విదేశీ విద్యార్థుల నుంచి డిమాండ్  ఉంటోంది. యూజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సెన్సైస్(బీసీఏ) కోర్సులో అత్యధికంగా 240 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పీజీలో 126 విద్యార్థులతో ఎంబీఏ టాప్‌లో నిలిచింది. ఈ కోర్సును రెండు సెక్షన్లుగా విభజించి క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహిస్తారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్(బీకామ్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ), ఎంఏ ఇంగ్లిష్, ఎంఎస్సీ(ఇన్ఫ ర్మేషన్ సైన్స్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కామర్స్(ఎంకామ్)ల్లో కూడా విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు.  
 
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఫారిన్ స్టూడెంట్స్
 ఓయూలో ప్రత్యేకంగా విదేశీ విద్యార్థుల కోసం సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఫారిన్ స్టూడెంట్స్ అనే కోర్సు ఉంది. దీని కాలవ్యవధి పదినెలలు. ఇంగ్లిష్ భాషలో  నైపుణ్యాలను పెంచుకోవ డానికి ఈ కోర్సులో ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సును యూజీ, పీజీ కోర్సులు చదువుతూనే అభ్యసించే అవకాశం లేదు. కాబట్టి తర్వాత విద్యా సంవత్సరంలోనే ఇతర యూజీ/ పీజీ కోర్సును అభ్యసిం చాలి.
 
 విదేశాల్లో ఓయూ కోర్సులకు మంచి గుర్తింపు!
 ‘‘మహారాష్ట్రలోని యూనివర్సిటీ ఆఫ్ పుణె తర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్న విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ నిలుస్తోంది. కామర్స్, లా, ఇన్ఫర్మాటిక్స్ తదితర 13 ఫ్యాకల్టీ విభాగాలతో వివిధ కోర్సులను అందిస్తూ విద్యార్థుల ఆదరణను పొందుతోంది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్‌తో ‘ఎ’ గ్రేడ్ పొందడమే కాకుండా దేశంలో ఇప్పటివరకు కేవలం 15 యూనివర్సిటీలు మాత్రమే పొందిన ‘యూనివర్సిటీస్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్‌లెన్స్’ (యూపీఈ) హోదాను కూడా ఓయూ సొంతం చేసుకుంది. త్వరలో 100 సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దేశమేైదె నా ఉన్నత విద్యకోసం ఇక్కడికి వచ్చిన విద్యార్థులంతా కలిసిమెలసి ఉంటారు. ఇక్కడ కోర్సులనభ్యసించిన విదేశీ విద్యార్థులకు వారి సొంత దేశాల్లో గుర్తింపు, మంచి అవకాశాలు లభిస్తున్నాయి’’    
- ప్రొఫెసర్ సి.వేణుగోపాలరావు,
డైరెక్టర్, యూఎఫ్‌ఆర్‌ఓ,
 ఉస్మానియా యూనివర్సిటీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement