న్యూయార్క్: ఆన్‌లైన్ క్లాస్‌లకు మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బుధవారం బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాయి.
ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆన్‌లైన్ క్లాసెస్‌కు మారిన విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న ఆదేశాల వల్ల విద్యాసంస్థలు త్వరగా పునఃప్రారంభమయ్యే అవకాశముందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డెప్యూటీ సెక్రటరీ కుసినెలీ అన్నారు.
ట్రంప్ ఆగ్రహం: ఫాల్ అకడమిక్ సెషన్‌కి విద్యా సంస్థలను పునఃప్రారంభినట్లయితే, వారికి ఫెడరల్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి సంబంధించి అరోగ్య విభాగం జారీ చేసిన మార్గదర్శకాలను ఆచరణ సాధ్యం కాదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment