harvard university
-
'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates).. 1975లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినందుకు చాలా బాధపడినట్లు, ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాలేజీ రోజులు చాలా అద్భుతంగా గడిచాయని పేర్కొంటూ.. 'సోర్స్ కోడ్: మై బిగినింగ్' (Source Code: My Beginnings) అనే పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన తరగతులను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతగానో ఆస్వాదించాను. తెలివైన వ్యక్తులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. రాత్రి సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. 1975లో సాఫ్ట్వేర్ కంపెనీ మొదటి సీఈఓగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. యూనివర్సిటీలో చదువు మానేయాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నన్ను బాధించిందని బిల్ గేట్స్ అన్నారు. అయితే డిగ్రీ పూర్తి చేయడానికి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లాలనిపించినా.. అది సాధ్యం కాలేదు.బిల్ గేట్స్.. తన మిత్రుడు 'పాల్ అలెన్'తో కలిసి కంప్యూటర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించగలిగితే, ఆ రంగంలో ముందంజలో ఉండవచ్చని భావించి.. రెండేళ్లు కృషి చేశారు. ఆ సమయంలో చదువును బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. చదువు మానేయాల్సి వచ్చింది. అయితే టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగారు.ఇదీ చదవండి: ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్‌పై నెటిజన్లు ఫైర్!సోర్స్ కోడ్: మై బిగినింగ్ పుస్తకం విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ మొదటి భాగంలో బిల్ గేట్స్ చిన్న నాటి విషయాలు, యూనివర్సిటీలో చదువు, ప్రయోగాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన విషయాలతో పాటు.. మెలిందా గేట్స్‌తో వివాహం వంటి మరిన్ని విషయాలు.. ఆ తరువాత వచ్చే పుస్తకాల్లో ఉండే అవకాశం ఉంది.బిల్ గేట్స్ 2000లో పదవీవిరమణ చేసే వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థను ముందుకు నడియాపారు. ఆ సమయంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇదే బిల్ గేట్స్‌ను ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా నిలబడేలా చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.క్యాంపస్‌లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్‌లో చప్పట్లు మారుమోగిపోయాయి. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్‌లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది. కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది. -
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
విద్యకు సహకారం అందించండి
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్య క్రమాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకబృందం గురువారం సీఎం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జనవరి 7 నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్íÙప్ (పీఎస్‌ఐఎల్–24) కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ బృందం రాష్ట్రానికి వచి్చంది. ఈ బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లో 10–12 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థులతోపాటు 33 జిల్లాల ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాశ్, డాక్టర్ ఎండీ రైట్ పాల్గొన్నారు. -
మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ వర్సిటీ నుంచి ఆహ్వానం
మంత్రి కేటీఆర్‌కు బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో మాట్లాడేందుకు రావాలని పిలుపునిచ్చింది. ‘ఇండియా రైజింగ్-బిజినెస్, ఎకానమీ, కల్చర్’ అనే థీమ్‌పై ఫైర్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడనున్నారు. హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్ అనేది అమెరికాలోని విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. ఇందులో వెయ్యిమంది విద్యార్థులు, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పొల్గొననున్నారు. గతంలో ఎంతో మంది మేధావులు పాల్గొన్న ఈ సదస్సులో పాల్గొనాలనే హార్వర్డ్ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానాన్ని అందించింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందడంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. -
హార్వర్డ్ వర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బోస్టన్ యూనివర్సిటీలో వచ్చే సంవత్సరం జరిగే ఇండియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావుకు ఆహా్వనం అందింది. 2024 ఫిబ్రవరి 18న హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్‌లో ఫైర్‌సైడ్ చాట్‌లో మాట్లాడేందుకు కేటీఆర్‌ను ఆహ్వానించారు. ‘ఇండియా రైజింగ్: బిజినెస్, ఎకానమీ, కల్చర్’అనే అంశంపై ఈ కాన్ఫరెన్స్ సాగనుంది. ‘ఇటీవలి కాలంలో తెలంగాణ సాధించిన వృద్ధిలో చూపిన ప్రభావవంతమైన నాయకత్వం, పోషించిన పాత్ర, తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడం, మాకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’అని ఈ సందర్భంగా కేటీఆర్‌కు పంపిన ఆహా్వన లేఖలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, నాయకులు, విధాన నిపుణులతో సహా 1,000 మంది భారతీయ ప్రవాస సభ్యులు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. -
మనిషికి నిత్యం సంతోషాన్నిచ్చేది ఏంటి? హర్వర్డ్ స్టడీ ఏం చెబుతోంది!
-దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి మనిషి సంతోషదాయకమైన జీవితం గడిపేందుకు కారణమయ్యే అంశం ఏమై ఉంటుందనే మీమాంసకు సమాధానం వెదికేందుకు 1938లో హార్వర్డ్ యూనివర్సిటీ ‘హర్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’ పేరిట పరిశోధనా ప్రాజెక్టు మొదలుపెట్టింది. వందలాది మంది జీవితాలను దశాబ్దాలు పరిశీలిస్తూనే ఉంది. మనిషి జీవన విధానంపై ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం సాగిన ఈ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మనకు ఉన్న సంబంధాలే మన మానసిక ఆరోగ్యానికి, తద్వారా శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మనిషికి నిత్యంసంతోషాన్నిచ్చేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం తరతరాలుగా అన్వేషణ సాగుతూనే ఉంది. మనిషికి నిత్యం సంతోషాన్నిచ్చేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం తరతరాలుగా అన్వేషణ సాగుతూనే ఉంది. తత్వవేత్తల నుంచి యోగుల వరకూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. యోగం, భోగం నిరంతరంగా ఆనందాన్ని ఇవ్వలేవు. ధనం, పదవి, హోదా వంటివి కూడా ఎప్పటికీ మనిషిని ఆనందదాయకంగా ఉంచలేవనేది అందరూ అంగీకరించే విషయమే. మరి ఏ అంశం మనిషిని నిత్య సంతోషిగా మార్చగలదు? దీనికి సమాధానం కనుగొనేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ దశాబ్దాలుగా పరిశోధన చేస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం–గ్రేట్ డిప్రెషన్ కాలంలో మొదలై, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తర్వాతి కాలం దాకా కొనసాగిన ఈ పరిశోధన.. తమ చుట్టూ ఉన్నవారితో కొనసాగే ఆరోగ్యకరమైన సంబంధాలే మనిషి ఆనందకరమైన జీవితం సాగించడానికి దోహదపడుతుందని తేల్చింది. సత్సంబంధాలే కొలమానం ఒంటరితనం మనిషిని కుంగదీస్తుందని.. ఆరోగ్యకరమైన సంఘ జీవనం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న హార్వర్డ్ మెడికల్ స్కూల్ మానసిక శాస్త్రం ప్రొఫెసర్ రాబర్ట్ వాల్డింగర్ అంటున్నారు. మనిషి తన చుట్టూ అల్లుకున్న ఆరోగ్యకర బంధాల ఫలితంగా సంతోషకరమైన జీవితాన్ని నిరంతరంగా కొనసాగిస్తాడని పేర్కొన్నారు. తమ పరిశోధన ఫలితాలపై 2015లో వాల్టింగర్ చేసిన ‘టెడ్ టాక్’ ప్రసంగాన్ని ఇప్పటివరకు నాలుగున్నర కోట్ల మంది వీక్షించడం గమనార్హం. హార్వర్డ్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి సహా అనేక సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో కూడా మనిషికి తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఉన్న సత్సంబంధాలే మానసిక, శారీరక ఆరోగ్యానికి కొలమానాలు కాగలవని తేలింది. మనిషి తన 50వ ప్రాయంలో చుట్టూ ఉన్న అనుబంధాల పట్ల ఎంత సంతృప్తితో ఉన్నాడనేదే అతడి శారీరక ఆరోగ్యానికి కూడా కొలమానం కాగలదని, కొలెస్టాల్ స్థాయి కాదని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్ తదనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఇతరులపట్ల సహానుభూతి స్థాయి పెరగడం సంతోషకర పరిణామమని ఐక్యరాజ్యసమితి సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తాజా నివేదిక పేర్కొంది. ఇతరుల పట్ల సహానుభూతి, అపరిచితులపట్ల సానుభూతి స్థాయి ప్రపంచవ్యాప్తంగా 2021 నుంచీ పెరుగుతూ వస్తోందని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టుకు రూపకల్పన చేసినవారిలో ఒకరైన జాన్ హెల్లీవెల్ అన్నారు. చదవండి: చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు.. మిస్టర్ సంతోషి! ప్రపంచం మొత్తంలో అత్యంత సంతోషకర జీవితం గడుపుతున్న వ్యక్తి ఎవరనే విషయం తేల్చడానికి విస్కాన్సిన్ యూనివర్సిటీ 12 ఏళ్లపాటు పరిశోధించి మాథ్యూ రికార్ట్ అనే బౌద్ధ భిక్షువును ఎంపిక చేసింది. మాలిక్యులర్ జెనెటిక్స్‌లో పీహెచ్డీ చేసిన మాథ్యూ తదనంతరం బౌద్ధ భిక్షువుగా మారారు. వర్సిటీ శాస్త్రవేత్తలు మాథ్యూ రికార్ట్ తలకు 256 సెన్సర్లను తగిలించి వివిధ అంశాలపై పరిశోధన చేశారు. ఆయన మెదడు అధిక స్థాయిలో గామా తరంగాలను ఉత్పత్తి చేస్తోందని కనుగొన్నారు. మాథ్యూ మెదడు ఎటువంటి ప్రతికూల భావనలకు చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ సానుకూల ధోరణిలో ఉండేట్టు చేస్తోందని వెల్లడించారు. ‘‘ఎల్లప్పుడూ నేనే, నాదే అనే భావన.. ప్రపంచంలో ఇతర అంశాలన్నింటి పట్లా శత్రు భావనను రేకెత్తిస్తుంది. మనిషిని నిత్యం అలజడిలో ఉంచుతుంది. అదే ఇతరుల పట్ల సహానుభూతి పెంచుకుంటూ ఉంటే మానసిక ఆరోగ్యం తద్వారా శారీరక ఆరోగ్యం ఇనుమడిస్తుంది.’’ అని మాథ్యూ రికార్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనంద నిలయం ఫిన్లాండ్ ఫిన్లాండ్ ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా వరుసగా ఆరోసారి ఎంపికైంది. పౌరుల జీవన విధానం ఆధారంగా అమెరికాకు చెందిన గాలప్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఫిన్లాండ్ మొదటిస్థానంలో నిలవగా.. దాని పొరుగు దేశాలు డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నార్వే తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆరోగ్యకర జీవితం, సగటు ఆదాయం, సామాజిక భద్రత, అవినీతి రహితం, సహానుభూతి, తమ జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పౌరులకు ఉండటం వంటి అంశాలు/లక్షణాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇచ్చినట్టు గాలప్ సంస్థ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఏటా విడుదల చేసే హ్యపీనెస్ ఇండెక్స్ కూడా ఫిన్లాండ్ను అత్యంత సంతోషకర దేశంగా పేర్కొంది. ఫిన్లాండ్ పౌరుల మధ్య ఆర్థిక అసమానతలు అతి తక్కువ స్థాయిలో ఉండటం, ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉండటం కూడా ప్రజల మధ్య సయోధ్య ఎక్కువ స్థాయిలో ఉందని పేర్కొంది. చదవండి: టాపర్లంతా క్యాంపస్ కాలేజీలకే.. ఆనందాల హార్మోన్లు మనిషి ఆనందాన్ని మరింత ఇనుమడింపజేయడానికి శరీరం పలు రకాల హార్మోన్లను (రసాయనాలను) విడుదల చేస్తుంది. వాటిలో నాలుగు ముఖ్యమైన హారోన్ల గురించి తెలుసుకుందాం. డోపమైన్: మెదడులో ఉత్పత్తి అయి శరీరమంతా వ్యాపించే డోపమైన్ హార్మోన్ గుండె కొట్టుకోవడాన్ని, రక్తపోటును నియంత్రించడంతోపాటు మూత్రపిండాల పనితీరునూ మెరుగుపరుస్తుంది. మంచి భోజనం చేసిన తరువాత, ఏదైనా లక్ష్యాన్ని సాధించినప్పుడు, గమ్యాన్ని చేరుకున్నప్పుడు మనలో కలిగే ఆనందం, సంతృప్తికి ఈ డోపమైనే కారణం. సెరటోనిన్: శాస్త్రవేత్తలు ‘హ్యాపీనెస్ కెమికల్’గా పిలిచే ఈ హార్మోన్ మనిషి మెదడు, పేగులలో ఉత్పత్తి అవుతుంది. కేంద్ర నాడీ మండలమంతా వ్యాపిస్తుంది. సంఘజీవి అయిన మనిషి నలుగురి మధ్య సంతోషంగా సమయం గడుపుతున్న వేళ ఈ సెరటోనిన్ ఉత్పత్తి పెరిగి సంతోషకర అనుభూతిని మరింత పెంచుతుంది. దీని స్థాయి పెరిగే కొద్దీ మనిషిలో సంతృప్తి, ఆనందం, ఆత్మ నిర్భరత స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆక్సిటోసిన్: మనిషిలో ప్రశాంతతను, భద్రతను విశ్వాసాన్ని కలిగించడంలో ప్రేరకంగా పనిచేసే ఆక్సిటోసిన్.. ఆత్మీయత, అనుబంధాలనూ పెంపొందించేందుకు దోహదపడుతుంది. అయినవారిని ఆలింగనం చేసుకున్నప్పుడు, ఆత్మీయులతో అనుబంధాలు పంచుకునేప్పుడు విడుదలయ్యే ఈ ఆక్సిటోసిన్ దీర్ఘకాలంపాటు మనిషిని సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఎండార్ఫిన్: మత్తు మందులా పనిచేసే ఎండార్ఫిన్ శరీరంలోని నాడీ మండలం, పిట్యుటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది. ప్రధానంగా నొప్పి నుంచి ఉపశమనం కోసం తయారయ్యే ఈ హార్మోన్ సంతోషం, సంతృప్తికి కూడా కారణమవుతుంది. ఆహారం తీసుకున్నాక, వ్యాయామం చేశాక, ఇష్టమైన పానీయాలు తీసుకున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్.. మనిషిలో ఆత్మ నిర్భరతను పెంచడం, ఒత్తిడిని తగ్గించడం, బరువును తగ్గించడానికీ తోడ్పడుతుంది. ఎండారి్ఫన్ హార్మోన్ స్థాయి పెంచుకోవాలంటే.. ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేయడం, సుగంధాలను ఆస్వాదించడం, ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేయాలి. నవ్వుల క్వాకా.. టెడ్డీ బేర్ వంటి మొహంతో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉన్నట్టు కనిపించే క్వాకాకు ప్రపంచ పౌరులు అత్యంత సంతోషకర జీవిగా ముద్రవేశారు. సాధారణ పిల్లి పరిమాణంలో ఎలుకను పోలినట్టుగా ఉండే ఈ క్వాకా నిజానికి కంగారూల జాతికి చెందినది. ఆ్రస్టేలియా పశి్చమ తీరానికి దగ్గరగా ఉండే రెండు దీవులు రాట్‌నెస్ట్, బాల్ట్ ఐలాండ్లలో మాత్రమే ఈ క్వాకాలు జీవిస్తున్నాయి. మనుషులతో సన్నిహితంగా మెదిలే ఈ జీవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ప్రీతిపాత్రమైంది. క్వాకాతో సెల్ఫీ దిగేందుకు వేలాదిమంది పర్యాటకులు ఏటా ఈ దీవులను సందర్శిస్తుంటారు. ‘#సెల్ఫీ విత్ క్వాకా’ అనేది ట్రెండ్‌గా మారింది. క్వాకాల సంఖ్య పదివేలలోపే ఉండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్‌సోషల్‌లో పోస్ట్ చేశారాయన. -
‘ ఒంటరి’ ఉద్యోగుల అసంతృప్తి.. నౌకరీ నచ్చలే
టీమ్స్‌తో కాకుండా.. ఒంటరిగా పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువ అసంతృప్తితో ఉంటున్నారట. ‘అన్హ్యాపీయ్యెస్ట్ జాబ్స్’పై హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. విధి నిర్వహ ణలో సంతృప్తి పొందే విషయంలో మంచి జీతం, గౌరవం, విశ్వాసం, భద్రత, మంచి కెరీర్, ఇతర ప్రయోజ నాలు వంటివి కీలకపాత్ర పోషిస్తున్నట్టు గతంలోనే పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. అయితే దీనికి భిన్నంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి కలిగించే అంశా లేంటి, వాటికి కారణాలేంటి అనే దానిపై హార్వర్డ్ వర్సిటీ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం ఐదేళ్లు, పదేళ్లు కాకుండా ఏకంగా 1938 నుంచి జరిగిన అధ్యయనాలను ఆధార ంగా తీసుకుంది. దాదాపు 85 ఏళ్ల కాలవ్యవధి లో ఆయా దశల్లో ఉద్యోగుల మానసిక స్థితి, జీవి తం వంటి వాటిపై పరిశీలన జరిపింది. ముఖ్యంగా ఓవర్‌నైట్ షిఫ్ట్‌లు, ట్రక్ డ్రైవింగ్, నైట్ సెక్యూ రిటీతోపాటు టెక్ ఆధారిత పరిశ్రమలు, ప్యాకే జీ, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, ఆన్లైన్ రిటైల్ జాబ్స్ వంటి విధుల నిర్వహణలో ఉద్యోగులు ఒంటరి తనం ఫీలై అసంతృప్తికి గురవుతున్నట్టు తేలింది. మనుషులతో కానీ, చేస్తున్న పనులతోనూ అంతగా మమేకం కాకపోతే చేస్తున్న పనిలో, ఉద్యో గంలో సంతృప్తి ఉండదని ఉద్యోగులు చెప్పారు. – సాక్షి, హైదరాబాద్ ఏం చేయాలి? ♦ మిత్రులు, సహోద్యోగులతో తమకున్న ఆసక్తులు, అభిరుచులు పంచుకోవాలి. ♦ తోటి ఉద్యోగులు, టీం సభ్యులతో స్నేహసంబంధాలు పెంచుకుంటే అది ఉద్యోగుల్లో మనో బలం పెరిగేందుకు దోహదపడుతుంది. ఫలి తంగా మరింత చురుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ♦ ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవడం లేదా క్లబ్‌గా ఏర్పడటం, పుస్తకాలు చదవడం, గేమింగ్ కమ్యూ నిటీగా ఏర్పడటం వంటివి చేయాలి. ఇతరుల సహాయం కోరడంతోపాటు, వారికి సహాయపడేందుకూ సిద్ధంగా ఉండాలి. ♦ టీం సభ్యులతో పనికి సంబంధించిన అంశాలతోపాటు ఇతరత్రా అంశాలపైనా చర్చించాలి. ♦ పనిప్రదేశాల్లో సహోద్యోగులతో సానుకూల సంబంధాల వల్ల పని ఒత్తిడితో పాటు ఆందోళన, అయోమయం వంటివీ తగ్గుతాయి. ఇంకా ఈ నివేదికలో ఏముందంటే.. ♦ బిజీ జాబ్స్ చేస్తున్నా ఇతరులు, సాటి ఉద్యోగులతో సానుకూల ఇంటరాక్షన్లు లేకపోతే ఉద్యోగులు ఒంటరిగా ఉన్నామన్న భావనలో ఉంటున్నారు. ♦ సహోద్యోగులు, మనుషులను కలుసుకునే అవకాశం లేకపోతే అదొక పెద్ద వెలితిగా ఉంటుంది. వారితో కొంత సమయం గడిపితే పనిపట్ల సంతృప్తితోపాటు మెరుగ్గా విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ♦ కోవిడ్ కారణంగా ‘రిమోట్వర్క్’విధానంతో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి ♦ ముఖ్యంగా టెక్, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ రిటైల్ సర్విసెస్ తదితర రంగాల్లోని ఉద్యోగులు ఒంటరితనాన్ని అధికంగా ఫీల్ అవుతున్నారు. టీమ్ వర్క్ ముఖ్యం రోజువారీ పనులు, ఉద్యోగంలో సమతూకం సాధించడం వంటి వాటిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇదొకటి. ఉద్యోగం–జీవితంలో సంతృప్తి తదితరాలకు సంబంధించిన ఒక పాత రహస్యాన్ని కనుగొనేందుకు ఇది దోహదపడింది. ఉత్పాదకత కోసమే కాకుండా ఉద్యోగుల్లో మనోబలం పెంచేందుకు టీమ్ వర్క్ ముఖ్యమనే విషయం మరోసారి స్పష్టమైంది. –ప్రొ.రాబర్ట్ వాల్డింగర్, హార్వర్డ్ స్టడీ ఆఫ్ ఆడిట్ డెవలప్మెంట్ డైరెక్టర్ -
ఆహార సంక్షోభం ముంగిట్లో...
ప్రపంచ జనాభా ఏటేటా పెరుగుతోంది... 2050 కల్లా వెయ్యికోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నది శాస్త్రవేత్తల అంచనా. మరి అప్పటికి అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా? అదంత తేలిక కాదంటోంది కోపెన్‌హేగన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ద వరల్డ్ కౌంట్స్’. మనిషి ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలని సూచిస్తోంది. లేదంటే మరో పాతికేళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్రా అని అంగలార్చాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది... భూమ్మీద అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి అయితే మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటనైనా వేసుకోగల భూమి లభ్యత కాస్త అటూ ఇటుగా 140 కోట్ల హెక్టార్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 1,000 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది రెండు పూటలా కడుపు నిండా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమన్నది హార్వర్డ్ యూనివర్సిటీ సోషియో బయాలజిస్ట్ దివంగత ఎడ్వర్డ్ విల్సన్ అభిప్రాయం. మనుషులంతా శాకాహారులుగా మారినా, పాడి పశువుల పెంపకానికి వనరులు పెద్దగా వాడకపోయినా 2050 నాటికి 1,000 కోట్ల మందికి చాలినంత ఆహారం అందించడం కష్టమని తేల్చారాయన. పంటలు పండించేందుకు భూ జీవావరణానికున్న పరిమితులే ఇందుకు కారణమని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. మాంసాహారంతో నష్టమేమిటి? శాకాహారంతో పోలిస్తే మాంసాహార ఉత్పత్తికి ఖర్చయ్యే వనరులు చాలా ఎక్కువ. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం ఐదు కిలోల దాణా వాడితే గానీ కిలో మాంసం తయారు కాదు. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించేందుకు వెచ్చించే వనరుల కంటే ఏకంగా 75 రెట్లు ఎక్కువ శక్తిని మాంసం ఉత్పత్తికి ఖర్చు చేయాల్సి వస్తోంది. కేలరీల లెక్కలు చూసినా మాంసం ఉత్పత్తి ఖరీదైన వ్యవహారమే. రెండు, మూడు కేలరీల ఇంధనం ఖర్చు చేస్తే సోయాబీన్, గోధుమ వంటి వాటినుంచి ఒక కేలరీ ప్రొటీన్ సంపాదించుకోవచ్చు. అదే మాంసం విషయంలో ఏకంగా 54 కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా మాంసాహారాన్ని మానేందుకు చాలామంది అంగీకరించే పరిస్థితులు లేవు. ఇది ఆహార సమస్య మరింత జటిలం చేసేదే. ధరలు ఆకాశానికి... రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు ఇప్పటికే నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలల్లో ఏకంగా 55 దేశాలు ఆహార పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80 శాతం, బియ్యం ధర 30 శాతం పెరుగుతాయన్నది అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఎరువులు, కీటకనాశినులకూ డిమాండ్ పెరగనుంది. ప్రస్తుతం మనం ఏటా దాదాపు 9,000 కోట్ల టన్నుల ప్రకృతి వనరులను వినియోగిస్తున్నాం. 2050 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనా. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు, ఘర్షణలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆహారం కోసం కటకటలాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నది నిపుణుల హెచ్చరిక! క్రమక్షయంతో పెనుముప్పు పంటకు బలమిచ్చే నేల పై పొరలోని మట్టి పలు కారణాల వల్ల కోతకు (క్రమక్షయానికి) గురవుతుందన్నది తెలిసిందే. ఉపరితలం నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవావరణం అత్యధికంగా ఉంటాయి. గత 40 ఏళ్లలో ప్రపంచం మొత్తమ్మీద నేల పై పొరలో 40 శాతం కోతకు గురైందని అంచనా. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందివ్వాలంటే గత 8,000 ఏళ్లలో పండించినంత ఆహారాన్ని వచ్చే 40 ఏళ్లలో పండించాల్సి ఉంటుంది!’ అన్న ‘వరల్డ్ వాడి ఫండ్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ క్లే వ్యాఖ్యలు పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెబుతున్నాయి. ఏటా మన వృథా రూ. 92 వేల కోట్లు! ప్రపంచవ్యాప్తంగా భారీ పరిమాణంలో ఆహారం వృథా అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడిని చేరకుండానే పంటలో మూడో వంతు, చేరాక దాదాపు మరో సగం వృథా అవుతోందన్నది ఐరాస వంటి సంస్థల అంచనా. ‘ద వరల్డ్ కౌంట్స్’’ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ప్రపంచం మొత్తమ్మీద వృథా అయిన ఆహారం ఏకంగా 40.7 కోట్ల టన్నులు! పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్ల వల్ల కూడా ఆహార సంక్షోభం తీవ్రమవుతోందని నిపుణులంటున్నారు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారత్‌లోనూ ఆహార వృథా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఎక్కువగా ఉంది. దేశంలో ఏటా దాదాపు 92 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. గతేడాది ఫుడ్ వేస్టేజ్ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరూ రోజుకు 137 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆకాంక్ష నెరవేరకపోవడానికి కోతల తరువాత పంటలకు జరుగుతున్న నష్టాలు (పోస్ట్ హార్వెస్టింగ్ లాస్) కూడా ఒక కారణమేనని నీతి ఆయోగ్ సభ్యుడొకరు అన్నారు. నిల్వ, రవాణా సదుపాయాల లేమి వల్ల పాలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి త్వరగా పాడైపోయే ఆహారంలో 20 శాతం దాకా వృథా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 32 శాతం దాకా ఉందని అంచనా. (కంచర్ల యాదగిరిరెడ్డి) -
గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
Permanent Solution To The Problem Of Baldness: అద్దం ముంచు నిలబడి నున్నని బట్టతలను నిమురుకుంటూ.. ఫ్చ్.. దీనికి విరుగుడే లేదా (విగ్గుకాకుండా)? అని ఒక్కసారైనా అనుకోనివారుండరేమో..!అలాంటివారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్! మన శరీరంలో ఒక ప్రొటీన్ స్థాయిలను పెంచడం ద్వారా బట్టతల సమస్యకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిది సాధ్యమే అని చెబుతోంది కూడా. బట్టతలతో ఎన్నో సమస్యలు తలపై నిండుగా కనిపించే ఒత్తైన జుట్టు మగవాళ్లందరూ కోరుకుంటారు. కానీ నియంత్రణలేకుండా ఊడే జుట్టువారిలో ఇది తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. అందులోనూ వయసులో ఉన్నప్పుడే బట్టతల వస్తే జాబ్ ఇంటర్వ్యూలు, పెళ్లి సంబంధాల విషయాల్లో వీరికి ఇబ్బందులు మరీ ఎక్కువ. జుట్టురాలే సమస్యతోపాటు అనేక ఒత్తిడ్లవల్ల శరీరంలో కార్టిజాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుదలకు కారణమౌతుంది. ఫలితంగా తలలోని మాడు భాగానికి, వెంట్రుకల కుదుళ్లకు చెప్పలేని నష్టాన్ని కలిగిస్తుంది. మగవాళ్లలో మాత్రమేకాకుండా, స్త్రీలలో కూడా ఒత్తిడి హార్మోన్ బట్టతలకు కారణమౌతుంది. ఆందోళన, కోపం, యాంగ్జైటీ వంటి స్ట్రెస్ సంబంధిత ప్రతిచర్యలు బట్టతలకి కారణమౌతాయని పరిశోధకులు చెబుతున్నదే. ఈ ప్రొటీన్‌తో బట్టతలకు శాశ్వత పరిష్కారం ఐతే హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నేచర్ మ్యాగజైన్లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది. జుట్టు ఊడిన ప్రదేశంలో కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెబుతున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. ఆ హార్మోన్ వల్లనే జుట్టు రాలుతుంది.. ఎలుకల్లో అడ్రినల్ గ్రంథులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ద్వారా మూడు రెట్లు ఎక్కువగా వెంట్రుకలు పెరిగినట్లు వీరి పరిశోధనల్లో తేలింది. మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌కు సమానమైన కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ ఒత్తిడి హార్మోన్ ఎలుకల్లో పెరుగుదలను అణిచివేశాయని, ఈ హర్మోన్‌ను నియంత్రిస్తే హెయిర్ ఫోలిసిల్ స్టెమ్ సెల్ (హెచ్ఎఫ్సీ) యాక్టివేట్ అయ్యి కొత్త జుట్టు పెరగడానికి కారణమౌతుందని నివేదికలో తెల్పింది. దీంతో మొదటిసారిగా జుట్టు రాలడానికి గల కారణాలను శాస్త్రీయ ఆధారాలతో గుర్తించి, దానిని ఎలా తిప్పికొట్టాలో కూడా ఈ అధ్యయనాలు తెల్పాయి. మళ్లీ ఈ విధంగా జుట్టు పెరుగుతుంది బట్టతల వ్యక్తుల్లో స్థబ్దంగా విశ్రాంతి స్థితిలో ఉండే హెయిర్ ఫోలికల్ మూలకణాలను ప్రోత్సహించడానికి GAS6 ప్రొటీన్ ఉపయోగపడుతుంది. ఎలుకల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ మనుషుల్లో దీని పనితీరుపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిఉందని పరిశోధన బృంధం తెల్పింది. వీరి ప్రయోగాలు ఫలిస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బట్టతల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
పెద్దనోట్ల రద్దుపై హార్వర్డ్ కీలక వ్యాఖ్యలు, మరి ఆర్బీఐ ఏమందంటే..!
పెద్దనోట్ల రద్దు నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016 నవంబర్ 8న అప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.1000, రూ.500 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దు చేసిన ఆ రెండు పెద్దనోట్లను డిసెంబర్ 30వ తేదీలోపల ప్రజలు బ్యాంకుల్లో జమ చేసి రూ.2000,రూ.500కొత్త పెద్ద నోట్లను తీసుకోవచ్చని గడువు విధించారు. అయితే కేంద్రం ఈ నిర్ణయంపై తీసుకొని 5ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగిపోయాయి కేంద్రం తీసుకున్న డీమానిటైజేషన్ కారణంగా దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ముఖ్యంగా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్ లలో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు జరిగి గడించిన రెండేళ్లైనా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేశారే తప్పా నగదు చెల్లింపులు జరపలేదని పేర్కొంది. నవంబర్ 8, 2016న డీమానిటైజేషన్ ప్రభావంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగాయని, అదే సమయంలో సాంప్రదాయ ట్రాన్సాక్షన్లు తగ్గాయని,డిజిటల్ లావాదేవీలు 2017 నుండి స్థాయిలు, వృద్ధి రేటులో సాంప్రదాయ లావాదేవీలను స్థిరంగా అధిగమించినట్లు తేలింది. ఆర్బీఐ నివేదిక ఇక,ఆర్బీఐ నివేదిక ప్రకారం..నోట్ల రద్దు దేశాన్ని తక్కువ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చినట్లు తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 16.41 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2014-15 కంటే 14.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ రేటు ప్రకారం, 2020-21 చివరి నాటికి చెలామణిలో ఉన్న నోట్లు రూ.32.62 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే, 2021 చివరి నాటికి ఇది చాలా తక్కువగా రూ.28.26 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా! -
ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ గుడ్‌బై
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా వ్యవహరిస్తున్న గీతా గోపీనాథ్ (49) వచ్చే ఏడాది పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన గీతా గోపీనాథ్ .. ఐఎంఎఫ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్ యూనివర్సిటీ పొడిగించడంతో మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో కొనసాగారు. తాజాగా అదే వర్సిటీకి తిరిగి రానున్నారు. గీతా గోపీనాథ్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. ‘ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ అందించిన సేవలు అసమానమైనవి. ఫండ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు. గీతా గోపీనాథ్ మేధస్సు, అంతర్జాతీయ ఫైనాన్స్.. స్థూలఆరి్థకాంశాలపై ఆమెకున్న అపార అవగాహన, ఐఎంఎఫ్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రభావవంతమైన పనితీరుతో ఆమె అందరి అభిమానం, గౌరవం చూరగొన్నారు‘ అని జార్జియేవా పేర్కొన్నారు. తన విధుల నిర్వహణలో సహకరించినందుకు సహోద్యోగులకు గీతా గోపీనాథ్ ధన్యవాదాలు తెలిపారు. టీకాల ఊతంతో కోవిడ్–19 మహమ్మారిని అంతమొందించేందుకు తీసుకోతగిన చర్యలపై రూపొందించిన ’పాండెమిక్ పేపర్’కు ఆమె సహరచయితగా వ్యవహరించారు. ఇందులోని ప్రతిపాదనలకు అనుగుణంగా అల్పాదాయ దేశాలకు కూడా టీకాలను చేర్చేందుకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర ఏజెన్సీలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయని ఐఎంఎఫ్ పేర్కొంది. మైసూరు నుంచి అమెరికా వరకు... గీతా గోపీనాథ్ 1971లో మైసూరులో జన్మించారు. మలయాళీ కుటుంబ నేపథ్యం గల గీతా గోపీనాథ్ కోల్‌కతాలో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం, ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లోను, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మాస్టర్స్ చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీ వంటి దిగ్గజాల గైడెన్స్‌తో 2001లో ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన గీతా గోపీనాథ్ 2005లో హార్వర్డ్‌కు మారారు. 2010లో టెన్యూర్డ్ ప్రొఫెసర్ (దాదాపు పర్మనెంట్ స్థాయి) గా పదోన్నతి పొందారు. హార్వర్డ్ చరిత్రలో ఈ గౌరవం దక్కించుకున్న మూడో మహిళగాను, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తర్వాత తొలి భారతీయురాలిగాను ఆమె ఘనత సాధించారు. -
ఆదర్శ పాఠశాల టు అమెరికా
రణస్థలం: తన కుమారుడిని డాక్టరు చదివించాలన్న తండ్రి తపన అందుకు మార్గాలను అన్వేషించింది. తండ్రి చూపించిన బాటలో కష్టపడి చదివిన ఆ బాలుడు ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రీ మెడికల్ స్కూల్లో సీటు సాధించాడు. అమెరికా యూనివర్సిటీలో ఈ సీటు సాధించి తల్లిదండ్రులకు, ఊరికేగాక చదువుకున్న పాఠశాలకు, జిల్లాకు కూడా పేరుతీసుకొచ్చాడు.. గుడివాడ హేమకుమార్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామానికి చెందిన హేమకుమార్ రణస్థలం ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి సూర్యనారాయణ పైడిభీమవరంలోని అరబిందో పరిశ్రమలో పనిచేస్తుండగా తల్లి అరుణ గృహిణి. సూర్యనారాయణ తన కుమారుడిని డాక్టరు చదివించాలని వైద్య కళాశాలలు, ప్రవేశాల గురించి తెలుసుకునేవారు. స్నేహితుల ద్వారా అమెరికాలోని బోట్సన్ రాష్ట్రంలోగల హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రీ మెడికల్ స్కూల్ గురించి విన్న ఆయన హేమకుమార్తో ప్రవేశ పరీక్ష రాయించాలనుకున్నారు. అవసరమైన పుస్తకాలు సమకూర్చటమేగాక ఆన్లైన్లో శిక్షణ ఇప్పించారు. గత నెల 19న హేమకుమార్ ప్రవేశ పరీక్ష రాశాడు. అందులో 93 శాతం మార్కులు రావడంతో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సులో సీటు లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ నుంచి ఈ నెల 17న సమాచారం వచ్చింది. దీంతో హేమకుమార్ ఆదర్శ పాఠశాలకు వచ్చి మిఠాయిలు పంచిపెట్టాడు. ప్రిన్సిపాల్ పి.శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని అభినందించారు. ఆన్లైన్ క్లాసులు విన్నాను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు పైడిభీమవరంలోనే ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నా. 5వ తరగతి రణస్థలం ఆర్సీఎం స్కూల్లో, 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో చదువుకున్నా. డాక్టర్ కావాలనే లక్ష్యంతో రోజుకు 6 గంటలకు పైగా ఆన్లైన్ క్లాసులు విన్నాను. ఇంటరీ్మడియల్ బయాలజీ పుస్తకాలు చదివాను. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సులో.. ముందు 11, 11ప్లస్ రెండేళ్లు పూర్తిచేయాలి. తరువాత నాలుగేళ్లు ఎంబీబీఎస్ చదవాలి. జూన్‌లో క్లాస్‌లు ప్రారంభమవుతాయి. అక్కడకు వెళ్లిన తరువాత స్కాలర్షిప్ పరీక్ష రాయాల్సి ఉంది. నాన్న సూర్యనారాయణ ప్రోత్సాహంతోనే ఈ పరీక్ష రాశాను. కష్టపడి చదివి ఆయన కల నెరవేరుస్తాను. – హేమకుమార్, విద్యార్థి బాగా చదువుతాడు.. నా కుమారుడు మంచి డాక్టర్ అవ్వాలనేది నా కోరిక. కొందరిని సంప్రదిస్తే మెడికల్ విద్యకు హార్వర్డ్ యూనివర్సిటీ ది బెస్ట్ అని తెలిసింది. అందుకే ఆన్లైన్లో అప్లై చేయించాను. మంచిగా చదువుతాడు కాబట్టే సీటు వచ్చింది. సీటు రావడం సంతోషంగా ఉంది. ఎంత కష్టమైనా నా బిడ్డను చదివిస్తాను. – సూర్యనారాయణ, విద్యార్థి తండ్రి -
అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్–1, ఎం–1 వీసాలపై చదువుకుంటున్న భారతీయులు సహా విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం మసాచూసెట్స్‌లోని అమెరికా జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అంతకు ముందే ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని న్యాయమూర్తి అలిసన్ బరో న్యాయస్థానంలో వెల్లడించారు. విద్యాసంస్థల్లో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు దేశం విడిచి వెనక్కి వెళ్లిపోవాలంటూ ఈ నెల 6న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. కోవిడ్–19 అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ యూనివర్సిటీలు ఆన్లైన్ క్లాసులే నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్వదేశాలకు వెళితే వీసా స్టేటస్ కాపాడుకోవడం, రుణాల చెల్లింపు, వేర్వేరు టైమ్ జోన్లతో తరగతులకు ఎలా హాజరుకావాలని విద్యార్థులు సతమతమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. వెనకడుగు ఎందుకంటే.. ► హార్వర్డ్, ఎంఐటీలకు మద్దతుగా కాలిఫోర్నియా పబ్లిక్ కాలేజీలు, మరో 17 రాష్ట్రాలు ట్రంప్ సర్కార్‌ని కోర్టుకీ డ్చాయి. వారికి టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లు మద్దతు పలికాయి. వృత్తివిద్యా కోర్సుల్లో ఇచ్చే శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరమని, అంతిమంగా దేశంలో వాణిజ్య రంగాన్ని బలోపేతం చేస్తాయని టెక్కీ సంస్థలు తేల్చి చెప్పాయి. ► విద్యాసంస్థల్ని తెరవడం కోసం యూనివర్సిటీలపై ఒత్తిడి పెంచడానికే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంటూ రాజకీయంగానూ ఎదురుదాడి ప్రారంభమైంది. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. ► ఆన్లైన్ తరగతులపై పరిమితుల్ని ఎత్తివేస్తూనే, మరోవైపు దానికి పూర్తి విరుద్ధంగా ఇలాంటి ఉత్తర్వులు ఐసీఈ ఎలా ఇస్తుందని హార్వర్డ్, ఎంఐటీలు వాదించాయి. ► అమెరికాలో విదేశీ విద్యార్థులు 10 లక్షలకు పైగా ఉన్నారు. 2018–19లో విదేశీ విద్యార్థుల ద్వారా అగ్రరాజ్యానికి వచ్చిన ఆదాయం 447 కోట్ల డాలర్లుగా ఉంది. విద్యార్థుల్ని వెనక్కి పంపితే అగ్రరాజ్యానికి ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుంది. ► విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా దేశానికి చెందినవారు. దీంతో అంతర్జాతీయంగాను ట్రంప్ సర్కార్ ప్రతిష్ట దిగజారింది. -
‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ
న్యూయార్క్: ఆన్లైన్ క్లాస్‌లకు మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బుధవారం బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆన్లైన్ క్లాసెస్‌కు మారిన విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న ఆదేశాల వల్ల విద్యాసంస్థలు త్వరగా పునఃప్రారంభమయ్యే అవకాశముందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డెప్యూటీ సెక్రటరీ కుసినెలీ అన్నారు. ట్రంప్ ఆగ్రహం: ఫాల్ అకడమిక్ సెషన్‌కి విద్యా సంస్థలను పునఃప్రారంభినట్లయితే, వారికి ఫెడరల్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి సంబంధించి అరోగ్య విభాగం జారీ చేసిన మార్గదర్శకాలను ఆచరణ సాధ్యం కాదని మండిపడ్డారు. -
స్టార్ మినిస్టర్
ఆమెను అందరూ టోనీ అని పిలుస్తారు. తల్లులు తమ పిల్లల్ని పక్కన నిలబెట్టుకుని, ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు. హాకర్లు ఆమె చేతికి బ్రేస్లెట్స్ బహుమానంగా తొడుగుతారు. చిత్రకారులు ఆమెను తమ కుంచెలతో గీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆమే.. మారియా ఆంటోనియేటా ఆల్వా. పెరూ దేశపు 35 ఏళ్ల ఆర్థికమంత్రి. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్న ప్రస్తుత విపత్కర సమయంలో పెరూలో చిరు వ్యాపారులకు, సాధారణ పౌరులకు ఆర్థికంగా ఎంతో చేయూతనిచ్చారు ఆల్వా. కిందటి అక్టోబర్‌లో పెరూ ఆర్థికమంత్రి అయ్యారు ఆల్వా. ఆ తర్వాత కొద్ది నెలలకే మిగతా దేశాలతో పాటు పెరూ కూడా లాక్డౌన్ ప్రకటించవలసి వచ్చింది. దాంతో లక్షల మంది దుకాణదారులు, రైతులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఏ పూటకు ఆ పూట సంపాదిస్తేనే కానీ కడుపు నిండని కూలీలపై ఆ ప్రభావం పడింది. పెరూలోని ఆర్థికవేత్తలతో చర్చించిన ఆల్వా, ‘పేదలకు ఆర్థిక సహాయం చేయటం, సబ్సిడీలు ఇవ్వటం, బ్యాంకు లోన్లు మాఫీ చేయటం’ వంటివి వెంట వెంటనే ఆచరణలో పెట్టారు. పెరూ చరిత్రలో ఇటువంటి సంస్కరణలు ఇంతవరకూ ఎన్నడూ జరగలేదు. అయితే ఈ సంస్కరణల వల్ల ఆమె కుటుంబం ఆర్థికంగా లాభపడినట్లు సోషల్ మీడియాలో అనుమాన కథనాలు వచ్చాయి. అందుకు సమాధానంగా ఆల్వా, తన ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సమాజంలోని పేదరికం, అసమానత్వం ఆల్వాను కలచివేశాయి. ఒక చారిటీ సంస్థను ప్రారంభించి, పేద విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ఆర్థికంగా సహాయపడ్డారు. ఆల్వా 2014లో పెరూవియన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. హార్వర్డ్ నుంచి స్కాలర్‌షిప్‌తో భారతదేశం వచ్చి రెండు నెలల పాటు ఇక్కడ బాలికలకు విద్యావకాశాలు ఎలా ఉన్నాయో ఒక పరిశోధన చేశారు. పెరూ తిరిగి వచ్చాక, విద్యాశాఖలో పనిచేశారు. ప్లానింగ్, బడ్జెట్ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ క్రమంలోనే పెరూ ఆర్థికమంత్రి అయ్యారు. ‘‘నువ్వు ఎప్పటికైనా పెరూ అధ్యక్షురాలివి అవుతావు’’ అన్నారు ఆమె చదువుకున్న హార్వర్డ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్. అయితే ముందుగా ఆల్వా ఆర్థికమంత్రి అయ్యారు. -
చేయి చేయి కలిపితే విజయం
పని ప్రదేశాల్లో ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చోట మహిళలు ఒకరికొకరు నిజాయితీతో మనస్ఫూర్తిగా స్నేహితులుగా ఉండగలరా..? సాటి స్త్రీల పట్ల అసూయ, శత్రుత్వాలను అధిగమించి విజయాలను చేరుకోగలరా..? స్త్రీ స్నేహాలు నిస్సారంగా, సత్యానికి దూరంగా ఉంటాయా..? ఈ ప్రశ్నలతో పాటు సమాధానాలనూ హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించారు. ఈ రివ్యూలో ప్రచురించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన దీనికి కొన్ని రుజువులను చూపింది. రుజువులు ఇవి.. ►మహిళలు స్నేహితులుగా, సన్నిహిత ఆరోగ్యకరమైన బంధాలను పంచుకోవడమే కాదు వారి స్నేహితుల విజయాలకు కూడా కీలకపాత్ర పోషిస్తారు. ►బలమైన స్నేహాలు మహిళల వృత్తిని సానుకూలంగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ►విజయాలను సాధించిన మహిళా స్నేహితులను కలిగి ఉంటే వారి నుంచి మంచి కెరీర్ సలహాలను పొందవచ్చు. సమస్యను వారు అర్ధం చేసుకుని, తగిన సహాయాన్ని అందించగలరని నిర్ధారించుకోవచ్చు. సూచనలివి.. ►మీ స్నేహితులతో మీరే అధికంగా మాట్లాడుతూ ఉండటం కన్నా వినడం వల్ల ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ►నైపుణ్యాలను పెంచే సలహాలు ఇవ్వగల వ్యక్తిని కలిగి ఉండటమే కాదు.. ఆమె అడుగుజాడలను అనుసరించాలని భావించే స్నేహితులకు ఒక మద్ధతును లభిస్తుంది. ►ఇటీవల కాలంలో ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే పురుషులు కూడా లింగభేదాల పట్ల పట్టింపు లేదనే విషయాన్ని వెల్లడించినట్లు ఆ రివ్యూ స్పష్టం చేసింది. దీనికి కారణం ‘పురుషల ఆధిపత్య వృత్తులను స్త్రీలు సమర్ధవంతంగా నిర్వహిస్తుండమే. అధిగమించేందుకు నైపుణ్యాలు ►స్నేహితులతో ఉన్నప్పుడు మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు చర్చించడానికి వెనకడుగు వేయద్దు. పని చేసే చోట మీ అనుభవాలు, పోరాటాలు, సందేహాలను తీర్చడానికి అవి ఉపయోగపడతాయి. అంతేకాదు, మీరు కూడా సలహాలను కోరడానికి సిగ్గుపడకూడదు. ►రెజ్యూమ్‌ను తయారుచేయడానికి లేదా ఇంటర్వూ్యలో నెగ్గడానికి చిట్కాలు, పనిలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే నైపుణ్యాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. ►పని చేసేచోట పురుషులతో పాటు మహిళలను సమానంగా పరిగణించినట్లయితే ఈ సహాయక వ్యవస్థ అవసరం లేదు. కిందటేడాది బుకింగ్.కామ్ నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న 42 శాతం మంది మహిళలు కార్యాలయంలో పక్షపాతాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. సీనియర్ మేనేజ్మెంట్లో ఉన్న 52 శాతం మహిళలు, ఎగ్టిక్యూటివ్ బోర్డు సభ్యులుగా పనిచేస్తున్న 57 శాతం మహిళలు కార్యాలయంలో లింగ పక్షపాతాన్ని ఇప్పటికీ ఎదుర్కొంటున్న అంగీకరించారు. అయితే, ఈ పక్షపాతం మహిళ వృత్తిలో ఎదగడానికి నిచ్చెనలా సాయపడుతుంది అని వారు తెలియజేయడం విశేషం. పని చేసే చోట సమాజంలో లింగ విభజనను సృష్టించే వైఖరి క్రమంగా తగ్గుతోంది. పూర్తిగా కనుమరుగయ్యేవరకు మహిళలు ఒకరికొకరు వ్యక్తిగత, వృత్తిపరమైనా సహాయాన్ని అందించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. -
విష జ్వరాలపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్న విష జ్వరాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీలో సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తున్న లక్ష్మీ మిట్టల్ గ్రూపు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు విష జ్వరాలపై అధ్యయన ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు హామీ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన హార్వర్డ్ వర్సిటీలోని సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ బీ4 ప్రోగ్రాం మేనేజర్ సవితా జి అనంత్‌కు గిరిజనులకు ప్రబలే విషజ్వరాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదికను అందజేసింది. వాటిపై పరిశోధన చేసేందుకు సహకారం అందించాలని కోరగా, దానికి ఆమె సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో పరిశోధనలను పెంచేందుకు చర్యలు చేపడుతున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు విదేశీ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. అందులో భాగంగానే హార్వర్డ్ వర్సిటీకి వెళ్లిన మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ లక్ష్మీ మిట్టల్ గ్రూపు నిర్వíßస్తున్న సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అలాగే తలసేమియా వ్యాధికి సంబంధించిన పరిశోధనలకు కూడా సహకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డిసెంబర్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
ముగ్గురికి వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: వైద్య రంగంలో 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటిష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్(హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా(హాప్కిన్స్ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్క్లిఫ్(ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్)లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్ డాలర్లను సమంగా పంచుకుంటారు. శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయంపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్తాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ‘వేర్వేరు ఆక్సిజన్ స్థాయిలకు జన్యువులు ఎలా ప్రతిస్పందిస్తాయనే విషయంలో, అలాగే, కొత్త ఎర్ర రక్త కణాలు, రక్త నాళాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చే విషయాల్లో వీరు చేసిన పరిశోధనలు ఆ శాస్త్ర విస్తృతికి ఎంతో దోహదపడ్డాయి’ అని కమిటీ ప్రశంసించింది. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు. ఈ అవార్డ్ ద్వారా తనకొచ్చిన డబ్బును ఎలా వినియోగించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే, ఒక మంచి పనికే ఆ డబ్బును వాడుతానని డాక్టర్ కెలీన్ తెలిపారు. ‘ఉదయం 5 గంటల సమయంలో సగం నిద్రలో ఉండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ సమయంలో ఫోన్ వచ్చింది అంటే.. అది శుభవార్తే అయ్యుండొచ్చు అనుకున్నాను. నా గుండె వేగం పెరిగింది’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ పరిశోధన ప్రారంభించేముందు అవార్డుల గురించి ఆలోచించలేదు. కణాల్లో ఆక్సిజన్ స్థాయిలపై పరిశోధన అంత సులభం కాదు. పరిశోధన ఫలితాలపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు’ అని డాక్టర్ రాట్క్లిఫ్ స్పందించారు. 2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్ జేమ్స్ ఆలిసన్, జపాన్ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్ లభించింది. డైనమైట్ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. -
హౌ గురుకుల వర్క్స్?
సాక్షి, హైదరాబాద్ : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంక్షేమ గురుకుల పాఠశాలల ఖ్యాతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికి చాటింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క విద్యార్థికి నిర్బంధ ఉచిత విద్యను అందించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి యేటా వందల సంఖ్యలో గురుకులాలను తెరుస్తూ వచ్చింది. రాష్ట్రంలో 650కి పైగా గురుకుల పాఠశాలలు, మరో 250 రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీ లు ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తీరుపై అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మేరకు సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా రాష్ట్ర గురుకుల సొసైటీలకు పంపింది. గురుకుల విద్యా వ్యవస్థపై.. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాల అమలుపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం అధ్యయనం చేయనుంది. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గురుకులాల తీరును పరిశీలించనుంది. దీనిలో భాగంగా కొన్ని గురుకుల పాఠశాలలను ఎంపిక చేసుకుని అక్కడ క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించి పరిస్థితులను స్వయంగా వీక్షించనుంది. దేశీయ విద్యా వ్యవస్థలో పేద పిల్లలకు ఎలాంటి విద్యనందిస్తున్నారు? ఈ విద్యా కార్యక్రమాల అమలుకు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ఈ శతాబ్దానికి కావాల్సిన నైపుణ్యాలు, భవిష్యత్తరాలకు ఎలా ఉపయోగపడతాయి? వాటిని ఎలా మార్పులతో అందిస్తున్నారు? తదితర అంశాలను లోతుగా పరిశీలించనుంది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో అత్యంత పోషక విలువలున్న ఆహారాన్ని ప్రభు త్వం విద్యార్థులకు అందిస్తోంది. అదేవిధంగా వసతి కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోం ది. ఈ క్రమంలో హార్వర్డ్ వర్సిటీ విద్యావ్యవస్థతో పాటు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలతో పాటు విద్యేతర కార్యక్రమాలను కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ పరిశీలన బృందం రాష్ట్రానికి రానుంది. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెర్నాం డో రీమర్స్ గురుకుల సొసైటీకి లేఖ రాశారు. -
ఉపవాసంతో వ్యర్థానికి మోక్షం!
లంఖణం పరమౌషధం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేసింది కూడా. హార్వార్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు కూడా నిరాహారంగా ఉండటం, తరచూ వ్యాయామం చేయడం శరీరంలోని కణ వ్యవస్థను పూర్తిగా చైతన్యవంతం చేస్తుందని గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా పాడైపోయిన ప్రొటీన్లను బయటకు పంపేందుకు శరీరానికి మరింత శక్తి లభిస్తుందని పరిశోధన పూర్వకంగా తెలుసుకున్నారు. శరీరాన్ని తనను తాను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వయంగా కొన్ని పనులు చేసుకుంటుంది. చెడిపోయిన ప్రొటీన్లు, కణాలను వదిలించుకోవడం ఇందులో భాగం. అయితే కొన్నిసార్లు ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేయక వ్యాధులు వస్తూంటాయి. ప్రొటీన్‌ను ఒక నిర్దిష్ట పద్ధతిలో మడతపెట్టడం ద్వారా అవి బయటకు పోకుండా పోగుబడుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నియంత్రించే మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యాయామం, ఉపవాసం వంటి చర్యల వల్ల శరీరంలో జరిగే హార్మోన్ మార్పులు కణాలపై ప్రభావం చూపుతున్నాయని... పాడైన ప్రొటీన్లను బయటకు పంపే వ్యవస్థను చైతన్యవంతం చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెట్ప్లాంక్ తెలిపారు. సైక్లింగ్ వ్యాయామం చేసే కొందరిపై పరీక్షలు జరిపినప్పుడు పాడైన ప్రొటీన్లు వేగంగా నశించిపోతున్నట్లు గుర్తించారు. -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌కు వర్సిటీ ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సదస్సుకు పలు దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపై 2 రోజులపాటు సమావేశంలో చర్చిం చనున్నారు. సుమారు 1000 మంది విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు. ‘ఇండియా ఎట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్’ అనే థీమ్ ఆధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను సదస్సు నిర్వాహకులు కోరారు. ఆ సంఘాలకు గుర్తింపు లేదు: కేటీఆర్ తన పేరు మీద ఏర్పాటు చేస్తున్న సంఘాలు, యువసేనలు, అభిమాన సంఘాలకు తన వైపు నుంచి ఎలాంటి మద్దతు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ, తనపై అభిమానం ఉంటే టీఆర్ఎస్, దాని అనుబంధ సంఘాలతో కలసి పనిచేయాలని సూచించారు. -
శస్త్రచికిత్సలు చేసే రోబో స్పైడర్లు
బోస్టన్: అనుభవజ్ఞులైన వైద్యులు సైతం చేయలేని కొన్ని శస్త్రచికిత్సలను త్వరలో రోబో స్పైడర్లు చేయనున్నాయి. మృదువుగా, సౌకర్యంగా నాణెం పరిమాణంలో ఉండే ఈ రోబో సాలెపురుగు శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి శస్త్రచికిత్సను నిర్వహించనుంది. వైద్యులకు సహాయకారిగా ఉంటూ.. వారు చెప్పిన పనులను పూర్తి చేయనుంది. దీనిని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు తయారుచేశారు. మిల్లీమీటర్ సైజులో ఉండే ఆస్ట్రేలియాలోని పీకాక్ స్పైడర్‌ను ఆదర్శంగా తీసుకుని దీన్ని అభివృద్ధిచేశారు. 3 రకాల టెక్నాలజీల సాయం తీసుకొని మరో సరికొత్త టెక్నాలజీతో దీన్ని తయారుచేశారు. దీని తయారీలో సిలికాన్ రబ్బర్‌ను మాత్రమే వాడినట్లు పోస్ట్డాక్టరోల్ ఫెలో రుస్సో తెలిపారు. -
హరన్ కుమార్ మిస్సింగ్.. విషాదాంతం
మిస్సోరీ: భారత సంతతి విద్యార్థి హరన్ కుమార్(17) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. హరన్ మృతి చెందినట్లు ముస్సోరీ పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ‘హరన్ చనిపోయాడని ప్రకటిస్తున్నందుకు చింతిస్తున్నాం. అతని కుటుంబం కోసం మీరంతా ప్రార్థించాలని కోరుతున్నాం’ అంటూ చెస్టర్‌ఫీల్డ్ పోలీస్ విభాగం అధికారికంగా ఓ ట్వీట్ చేసింది. సెయింట్ లూయిస్‌లో హరన్ కుటుంబం నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి తన వాహనంలో వెళ్లిన హరన్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న చెస్టర్‌ఫీల్డ్ పోలీసులు గాలింపు చేపట్టారు. అతను తరచూ వెళ్లే పార్క్, ప్రదేశాల్లో వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. బహుశా అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తొలుత ప్రకటించారు. హర్వర్డ్ వెళ్లాల్సిన విద్యార్థి... 17 ఏళ్ల హరన్ కుమార్ పార్క్‌వే వెస్ట్ హైస్కూల్లో ఇటీవలె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం హర్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లాల్సి ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ హిస్టరీ విభాగాన్ని అతను ఎంచుకున్నాడు. ఇంతలోనే ఇలా విగతజీవిగా మారాడు. హరన్ తరచూ డిప్రెషన్‌కి గురయ్యే వాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. అయితే హరన్ మృతికి గల కారణంపై పోలీసులు ఇంతదాకా స్పష్టత ఇవ్వలేదు. ***MISSING/ SUICIDAL PERSON*** We are attempting to locate Haran Kumar,17 yrs old.He was wearing black or gray shorts, tie dye shirt.He is 5’6” tall,110 lbs, and short black hair. Kumar was last seen at 1:20pm driving his silver Toyota Avalon msl AD6T7X Please call 6365373000 pic.twitter.com/xtUU6uvzij — Chesterfield Police (@ChesterfieldPD) 15 June 2018 In reference to the missing person from yesterday, we are very sad to announce Haran has been found deceased. We ask that you keep his family in your thoughts and in your prayers. Thank you to everyone who helped in the search.*** — Chesterfield Police (@ChesterfieldPD) 16 June 2018 -
అక్కడ చదివితే జాబ్ పక్కా..!
ఈ విద్యాసంస్థల్లో చదివితే జాబ్ పక్కా.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని అంటోంది టైమ్స్ సర్వే.. ఈ మేరకు ఉద్యోగ కల్పనలో ముందున్న టాప్ టెన్ యూనివర్సిటీలకు ‘టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ ర్యాంకింగ్స్’ను ప్రకంటించింది. ఈ ర్యాంకుల్లో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 2017 సంవత్సరంలో ప్రపంచంలోని ఏ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని సర్వే చేస్తే అమెరికాలోని కాలేజీలే అగ్ర స్థానాలలో నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తేలింది. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్-టెన్ విద్యాసంస్థల్లో అమెరికా కాలేజీలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మొదటి స్థానంలో కాలిఫోర్నియా ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ విద్యాబోధన సాగడమే ఇందుకు కారణం అని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ, మూడో స్థానంలో కొలంబియా యూనివర్సిటీ నిలిచాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఐదో స్ధానంలో, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఎనిమిదో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ.. టాప్‌టెన్ ర్యాంకులివే.. -
గుర్తించని సూక్ష్మజీవులు వేల రకాలు
మన శరీరంలో ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉందో మీకు తెలుసా? కొంచెం కష్టమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాల బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొందరు ఇతర విశ్వవిద్యాలయాలతో కలసి తాజాగా కొన్ని వేల రకాల కొత్త బ్యాక్టీరియాను గుర్తించారు. హ్యూమన్ మైక్రో బయోమ్ ప్రాజెక్టులో భాగంగా జరిగిన ఈ పరిశోధనలో కడుపు, చర్మం, నోరు, జననేం ద్రియాల్లో ఉండే బ్యాక్టీరి యాను గుర్తించారు. వీటితోపాటు కొన్ని రకాల వైరస్, శిలీంధ్రాలు కూడా ఇప్పటివరకూ మన దృష్టికి రాలేదని తెలిసింది. శరీరంలోని సూక్ష్మజీవుల కు.. మనకు వచ్చే వ్యాధులకూ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 265 మంది నుంచి సేకరించిన 1,631 నమూనాలను పరిశీలించడంతో పాటు కాలంతో పాటు వీటిలో వస్తున్న మార్పులనూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నం జరిగింది. మానవ జన్యుక్రమం గురించి తెలిసినా.. అది ఇప్పటివరకూ కొత్త మందుల తయారీకి, చికిత్సకుగానీ పెద్దగా ఉపయోగపడింది లేదని.. శరీరంలోని సూక్ష్మజీవావ రణం గురించి అర్థం చేసుకోగలిగితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కుర్టిస్ హుట్టన్హోవర్ అంటున్నారు. కేన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ మందులను కొన్ని బ్యాక్టీరియా జీర్ణం చేసుకుంటున్నట్లు.. ఫలితంగా కీమోథెరపీ ద్వారా వచ్చే ప్రయోజనం తగ్గుతున్నట్లు ఇటీవలే కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు. -
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్‌కు అగ్రస్థానం
షాంఘై: షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ విడుదలచేసిన ‘అకడమిక్ ర్యాంకింగ్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’లో అమెరికా వర్సిటీల హవా కొనసాగింది. ఈ ర్యాంకింగ్స్‌లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒకటో ర్యాంకు సాధించింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రెండో ర్యాంకు, మసాచుసెట్స్ టెక్నాలజీ వర్సిటీ మూడో ర్యాంకు, కాలిఫోర్నియా వర్సిటీ నాల్గో ర్యాంకు సాధించాయి. ప్రిన్స్టన్, ఆక్స్ఫర్డ్, కొలంబియా, కాలిఫోర్నియా టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, షికాగో వర్సిటీలు తొలి 10 జాబితాలో స్థానం పొందాయి. చైనాలోని ప్రతిష్టాత్మకమైన సింగువా వర్సిటీ తొలిసారిగా టాప్50లో చోటు దక్కించుకుంది. ఆసియా నుంచి మెరుగైన ర్యాంకు పొందిన వాటిలో టోక్యో యూనివర్సిటీ(24) ఉంది. యూరప్ నుంచి స్విస్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఉత్తమ ర్యాంకు పొందింది. 2003 నుంచి షాంఘై సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమమైన తొలి 500 విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటిస్తోంది. -
అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్ల రగడ
హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అడ్మిషన్లలో శ్వేతజాతేతరులకు సగానికి పైగా సీట్లు కేటాయించడం అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్లపై చర్చకు తెరలేపింది. అమెరికా వర్సిటీల్లో మైనార్టీలకు అనధికారికంగా అమలవుతున్న రిజర్వేషన్ విధానం రద్దుకు ట్రంప్ సర్కారు సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో వర్సిటీల్లో సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని రెండేళ్ల క్రితం ఆసియన్ అమెరికన్లు చేసిన ఫిర్యాదులపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తునకు ఆదేశించడంతో.. ట్రంప్ సర్కారు, మైనార్టీలకు మధ్య ఘర్షణకు తెరలేచింది. నిజానికి భారత్‌లోమాదిరి అమెరికాలో చట్టబద్ధ రిజర్వేషన్లు లేవు. జనాభాలో 12.2 శాతం ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లు, 16.3 శాతమున్న లాటిన్ లేదా హిస్పానిక్ ప్రజలు.. శ్వేతజాతి అమెరికన్ల కన్నా వెనుకంజలో ఉండేవారు. దీంతో వారికి కొన్ని ప్రత్యేక కేటాయింపులతో సామాజిక న్యాయం అందేలా ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు వంటి చోట్ల అన్ని జాతుల, రంగుల ప్రజలు కనిపించాలనే దేశ సామాజిక న్యాయానికి అనుగుణంగా.. రిజర్వేషన్లకు బదులు అఫర్మేటివ్ యాక్షన్(నిశ్చయాత్మక చర్య), పాజిటివ్ డిస్క్రిమినేషన్(సానుకూల వివక్ష) పేర్లతో వర్సిటీల్లో కొన్ని సీట్లను మైనార్టీలకు కేటాయిస్తున్నారు. మిగతావారి కన్నా కొన్ని మార్కులు తక్కువ వచ్చినా.. ఆ వర్గాలకు సీట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. హార్వర్డ్ వర్సిటీలో ఈ ఏడాది మొత్తం 2,056 మంది విద్యార్థులకు ప్రవేశం లభించగా, వారిలో 50.8 శాతం శ్వేతజాతేతరులు. గతేడాది ఈ సంఖ్య 47.3 శాతమే. ఇప్పుడది సగానికి మించడం తెల్లజాతివారికి గుబులు పుట్టిస్తోంది. అడ్మిషన్లలో ఆఫ్రికన్ అమెరికన్లకు 22.2, ఆసియన్ అమెరికన్లకు 14.6, లాటినోలకు 11.6 శాతం సీట్లు దక్కాయి. దీంతో వర్సిటీల్లో కోటా ఎత్తివేతపై ట్రంప్ సర్కారు దృష్టిపెట్టినట్లు సమాచారం. ఒబామా హయాంలో.. హార్వర్డ్ వర్సిటీలో దక్షిణాసియా విద్యార్థులకు మంచి మార్కులు వచ్చినా తక్కువ ప్రతిభ ఉన్న ఇతర మైనార్టీలకు సీట్లు ఇచ్చారంటూ 2015లో దక్షిణాసియా, భారత సంఘాల సమాఖ్య నాటి ఒబామా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. ఒబామా సర్కారు వీటిపై స్పందించలేదు. ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలతో శ్వేతజాతీయులు నష్టపోయారన్న ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ ఫిర్యాదులపై స్పందించారు. అందుకే దక్షిణాసియా సంఘాల రెండేళ్లనాటి ఫిర్యాదులను పరిశీలించాలని లాయర్లను కోరామని అమెరికా న్యాయశాఖ తెలిపింది. నల్లజాతివారికి, లాటినోలకు కల్పిస్తున్న సౌకర్యాలను తెల్లజాతివారు నేరుగా సవాలు చేయకుండా భారతీయులు కీలకంగా వ్యవహరించే దక్షిణాసియా లాబీని ఈ పనికి వాడుకుంటున్నట్లు భావిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉద్దానంపై లోతుగా అధ్యయనం
-
ఉద్దానంపై లోతుగా అధ్యయనం
- హార్వర్డ్ వర్సిటీ వైద్య నిపుణుల రాక - త్వరలో రానున్న150 మంది వైద్యుల బృందం పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఉద్దానం కిడ్నీ వ్యాధుల నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు శనివారం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ వైద్య నిపుణులు విశాఖకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ నెఫ్రాలజీ విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ జోసెఫ్ బాస్‌వెంట్రీ, తెలుగు వ్యక్తి డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి వచ్చారు. గతంలో ఉద్దానం సమస్యపై పరిశోధనలు చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి, కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ టి.రవిరాజ్‌తో ఆంధ్ర వైద్య కళాశాలలో సమావేశమై ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డాక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ... ఉద్దానం ప్రాంతంలో ప్రజలు తాగే నీరు, తినే ఆహారం, జీవన విధానం, వాతావరణం, అధిక మోతాదులో ఉండే ఖనిజాల వివరాలను సేకరించి, అధ్యయనం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. 150 మంది వైద్యుల బృందం ఉద్దానంలో పర్యటించి కిడ్నీ వ్యాధులకు మూలాలను కనిపెట్టి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి చెప్పారు. -
‘హార్వర్డ్’కు గురుకుల విద్యార్థి
ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన మాశగల్ల ఆనంద్ సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి మాశగల్ల ఆనంద్ ఎంపికయ్యాడు. అకడమిక్ ప్రొఫైల్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో శిక్షణకు ఎంపిక చేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఆసియా నుంచి దాదాపు 2,500 మంది విద్యార్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 40 మంది ఎంపికయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమం త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కానుంది. అనంతరం ఆయా విద్యార్థులు వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసేందుకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేస్తోందని, వారికి కల్పిస్తున్న వసతులతో విద్యార్థులు అద్భుతాలు సాధిస్తున్నారని అన్నారు. గురుకులాలకు ప్రత్యేక నిధులిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి.. మాశగల్ల ఆనంద్ సొంతూరు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం. అమ్మ రత్నమ్మ, నాన్న కాశయ్య ఇద్దరూ వ్యవసాయ కూలీలు. ఆనంద్ నాలుగో తరగతి వరకు స్థానికంగానే చదువుకున్నాడు. చదివించే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు.. ఐదో తరగతిలో చిల్కురు గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పదో తరగతి పూర్తి చేసిన ఆనంద్.. ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో 2016–17 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. తాజాగా హార్వర్డ్ వర్సిటీ నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కావడంతో వచ్చే నెల రెండో వారంలో దుబాయ్ వెళ్లనున్నాడు. శిక్షణ పూర్తి చేస్తే హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలో ప్రవేశానికి 50 శాతం వెయిటేజీ ఇస్తారు. ‘గురుకుల’ప్రవేశంతో జీవితమే మారిపోయింది.. గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందడంతో నా జీవితమే మారిపోయింది. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చా. ఉన్నత చదువును విజయవంతంగా పూర్తి చేసి పెద్ద పరిశ్రమను స్థాపించాలనేది నా కోరిక. అందులో ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉపాధి కల్పించాలనేది భవిష్యత్తు లక్ష్యం. – ‘సాక్షి’తో ఆనంద్ -
సయాటికా! నీకు సెలవిక!!
యోగా ఏకపాదరాజ కపోతాసన అధోముఖ శ్వాసాసనం లేదా పర్వతాసనంలో ఉండి (సూర్య నమస్కారంలో 8వ భంగిమ. రెండు అరచేతులు రెండు అరిపాదాలు భూమి మీద ఉంచి నడుమును పైకి లేపి, భూమికి త్రికోణంలా ఉండాలి) శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని మడిచి మోకాలిని ముందుకు, ఎడమ మడమను జననేంద్రియాలకు దగ్గరగా, కుడికాలిని వెనుకకు స్ట్రెయిట్‌గా స్ట్రెచ్ చేయాలి. రెండు అరచేతులు నడుముకు పక్కన నేల మీద ఉంచి సపోర్ట్ తీసుకుంటూ ఛాతిని ముందుకు ప్రొజెక్ట్ చేస్తూ మెడని తలను వీలైనంత వెనుకకు వంచి నెమ్మదిగా కుడికాలిని మడిచి కుడిచేత్తో కుడికాలి మడమను పట్టుకుని, శరీరానికి వెనుక వీపునకు దగ్గరగా కుడిపాదాన్ని లాగుతూ ఎడమ చేతిని పైనుంచి తీసుకుని రెండు చేతులతో కుడి కాలివేళ్లను లేదా పాదం ముందు భాగాన్ని పట్టుకుని వీలైతే తల మూడు భాగాలను కుడి అరిపాదానికి ఆనించే ప్రయత్నం చేయవచ్చు. శ్వాస వదులుతూ మళ్లీ వెనుకకు పర్వతాసనంలోకి వచ్చి తిరిగి రెండో వైపు చేయాలి. దీనికి ముందు భుజంగాసనాన్ని సాధన చేస్తే శరీరం తేలికగా వంగుతుంది. ఫొటోలో చూపిన విధంగా చేయలేకపోతే ఏదైనా ఒక టవల్ లేదా తాడును కుడి కాలి మడమ చుట్టూ పోనిచ్చి తాడు ఆధారంగా చేయవచ్చు. జాగ్రత్తలు: మోకాళ్లు బలహీనంగా ఉన్నా, మోకాలు, మడమ, కాలి ఎముకలకు ప్రాక్చర్స్ అయినా ఈ ఆసనం చేయరాదు. మోకాళ్ల కింద సపోర్ట్‌గా టవల్ లేదా పలచని దిండు వాడవచ్చు. పరివృత్తపార్శ్వ కోణాసన సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి ఎడమ కాలు వెనుకకి (కాళ్ళ మధ్యలో 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడి మోకాలు ముందుకు వంచి ఎడమ కాలుని వెనుకకు బాగా స్ట్రెచ్ చేయాలి, నడుమును ట్విస్ట్ చేస్తూ ఛాతీని కుడివైపుకి తిప్పి, ఛాతీని తొడభాగానికి నొక్కుతూ ఎడమ ఆర్మ్పిట్ (చంకభాగం) కుడి మోకాలు మీదకు సపోర్టుగా ఉంచి వెనుకకు చూస్తూ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఎడమ మడమను పైకి లేపి పాదాన్ని, కాలి వేళ్ళను ముందు వైపుకి తిప్పవచ్చు. 3 లేదా 5 శ్వాసలు తరువాత తిరిగి వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. నమస్కార ముద్రలో చేతులు ఉంచలేని వాళ్లు ఎడమ అరచేతిని పూర్తిగా నేలమీద ఉంచి కుడిచేతిని కుడి చెవికి ఆనించి ముందుకు స్ట్రెచ్ చేస్తూ కుడి అరచేతిని చూసే ప్రయత్నం చేయవచ్చు. అలా కూడా చేయడం సాధ్యం కానప్పుడు చేతులు లేని కుర్చీలో కుడి తొడ వెనుక భాగం సపోర్టుగా ఉంచి కూర్చుని, ఎడమకాలుని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ కుర్చి బ్యాక్ రెస్ట్‌ని రెండు చేతులతో పట్టుకుని నడమును కుడివైపుకి బాగా తిప్పుతూ కుడి భుజం మీదుగా వెనుకకు చూడాలి. ఉత్తిత హస్త పాదాం గుష్టాసనం ఇది చేయాలంటే ముందుగా సమస్థితిలో నిలబడండి. ఇప్పుడు ఎడమకాలి మీద నిలబడి కుడికాలును ముందు నుంచి తీసుకొని బొటనవేలును లేదా పాదాన్ని కుడిచేతితో పట్టుకుని శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేస్తూ పైకి లేపాలి. మోకాలు నిటారుగా ఉండేటట్లుగా భూమికి సమాంతరంగా వచ్చేటట్లుగా ప్రయత్నించాలి. ఎడమచేతిని నడముకు పక్కన సపోర్ట్‌గా పెట్టుకుని కాలిని ఇంకొంచెం పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయవచ్చు. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడికాలి పాదాన్ని కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండో కాలిమీద నిలబడి చేయాలి. సపోర్ట్ కావాలనుకుంటే కుర్చీ లేదా డైనింగ్ టేబుల్ ఇంకా బాగా చేయాలంటే కిటికీ గ్రిల్ సపోర్ట్ తీసుకుంటూ కాలుని అంచెలంచెలుగా పైకి తీసుకువెళ్లవచ్చు. శరీరం వెనుక భాగంలో లంబార్ ప్రాంతం వెన్నెముక దగ్గర నుండి బయల్దేరి పిరుదుల భాగం, కాలి వెనుక భాగం నుండి కింది కాలి చివరి వరకు పయనించే నరం సయాటిక్ నరం. ఈ నరం ఒత్తిడికి గురవ్వడం వల్ల...నడుం కింద నుండి తుంటిభాగంలో, తొడ వెనుక, కాలు మొత్తం లాగడం, గుంజడం, విపరీతమైన నొప్పి, మంటలు, తిమ్మిర్లు ఉండడం, సమస్య తీవ్రత పెరిగితే కుంటుతూ నడిచే పరిస్థితి, మరీ ఎక్కువ అయితే కాలు చచ్చుపడిపోవడం కూడా జరుగుతుంది. కారణాలివి... డిస్క్‌హెర్నియేషన్, డిస్క్ డిజనరేషన్ లేదా డిస్క్‌బల్జ్ లేదా స్టిఫ్డ్ డిస్క్ వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడటం గాని లేదా స్పైనల్ కార్డ్ సన్నగా మారి సయాటిక నరం మూల భాగంలో ఒత్తిడికి గాని దారి తీయవచ్చు. ప్యాంటు వెనుక జేబులో లావు పర్సు పెట్టుకోవడం, గంటల తరబడి కూర్చోవడం కూడా పిరిఫార్మిస్ సిండ్రోమ్కి దారి తీయవచ్చు. నొప్పి చెబుతుంది... ఈ సమస్య సరైన కారణాన్ని సి.టి స్కాన్, ఎం.ఆర్.ఐ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. సమస్యను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువులు ఎత్తేటప్పుడు నేల మీద ఉన్న బరువులను లిఫ్ట్ చేసేటప్పుడు మోకాళ్లు ముందుకు ఫోల్డ్ చే సి వాటిని పైకి లేపినట్లయితే లంబార్ ప్రాంతం సేఫ్‌గా ఉంటుంది. సమస్య పరిష్కారానికి ఉన్న వివిధ పద్ధతులలో ఫిజియోథెరపీ, ఓస్టియో, కైరోప్రాక్టీసు వంటివి ఉన్నాయి. అయితే ఈ సమస్యకు యోగా అద్భుతమైన పరిష్కారం అనేది నిస్సందేహం. దీనిని హార్వర్డ్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలు ధ్రువీకరించాయి కూడా. సయాటికాకు పరిష్కారంగా ఉపకరించే కొన్ని ఆసనాలివి. సమన్వయం ఎస్. సత్యబాబు సాక్షి ప్రతినిధి -
హార్వర్డ్ లో నా బెస్ట్ మెమరీ అదే: జుకర్ బర్గ్
-
అరుదైన వీడియో పోస్ట్ చేసిన జుకర్‌బర్గ్
-
అరుదైన వీడియో పోస్ట్ చేసిన జుకర్‌బర్గ్
న్యూయార్క్: ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అరుదైన వీడియోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో విపరీతంగా దూసుకుపోతోంది. ఆ వీడియో ఏమిటంటే ఆయన హార్వార్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న సందర్భంలోనిది.. మరో ఐదు రోజుల్లో ఆయన హార్వార్డ్‌లో ప్రసంగించి డిగ్రీని అందుకోనున్న నేపథ్యంలో ఆ వీడియో అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది. అందులో ఏముందంటే.. హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరీక్ష రాసి దరఖాస్తు చేసుకున్న జుకర్.. తనకు సీటు వచ్చిందో లేదో అని ఉత్కంఠగా తన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చుని సెర్చింగ్ చేస్తుంటాడు. ఆ సమయంలో తన తండ్రి వీడియో తీస్తుండగా కాస్తంతా కంగారుతో కంప్యూటర్లో తన రిజల్ట్ వెతికిన జుకర్ సీటు పొందడాన్ని చూసి యాహూ.. తాను సాదించానంటూ ఉక్కిరిబిక్కరి అవుతుంటాడు. ‘నేను హార్వార్డ్‌కు ఎంపికయినప్పుడు మానాన్న తీసింది ఈ వీడియో. వచ్చే వారం నేను నా డిగ్రీ తీసుకునేందుకు అదే వర్సిటీకి వెళుతున్నాను’ అని రాస్తూ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 2006లో హార్వార్డ్ విద్యార్థి అయిన జూకర్ మధ్యలోనే చదువు మానేసి ఫేస్బుక్ వ్యవస్థాపకుడిగా మారి ప్రపంచమొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
శాంతిపావురాలు!
చరిత్రలో చూసినా మహిళలు ఎల్లప్పుడూ శాంతికారక శక్తిగానే ఉన్నారు. సంప్రదాయ యుద్ధం అనేది పురుషుల క్రీడ. ఆదిమ సమాజంలో సైతం పొరుగూరిపై దాడి చేయడానికి మహిళలు సంఘటితమై వెళ్లిన ఉదంతాలు లేవు. మహిళలు తల్లులుగా... తమ పిల్లలు ఎదగడానికి వీలైన శాంతియుత పరిస్థితులు నెలకొనడానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే... అధికారం ఎక్కువగా లేకపోవడం వల్లే మహిళలు హింసకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, మార్గరెట్థాచర్, ఇందిరాగాంధీ వంటి మహిళలు అధికారంలోకి వచ్చిన తర్వాత... అప్పటి పరిస్థితులను బట్టి దేశాన్ని యుద్ధాల్లోకే నడిపించారని విమర్శించే వాళ్లూ ఉన్నారు. కానీ, వారు ‘పురుషాధిక్య ప్రపంచం’లోని రాజకీయ నియమాలను పాటించడం ద్వారానే వచ్చారని... అందుకే ఆ రాజకీయాలకు అనుగుణంగా నడుచుకున్నారని... మహిళలకు అధికారంలో సరైన దామాషాలో (సగం) వాటా ఉంటే అధికారంలో ఉన్నా వారు భిన్నంగా స్పందించి ఉండొచ్చునని హార్వర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ స్టీవెన్ పింకర్ విశ్లేషిస్తున్నారు. ఆకాశంలో సగం.. మరి అధికారంలో? (లెక్క..శాతాలలో) ►1 పపంచ దేశాలన్నిటిలో 20వ శతాబ్దంలో పురుష పాలకుల భార్యలు లేదా కూతుళ్లుగా కాకుండా తమంత తాముగా పాలకులుగా ఎదిగిన మహిళలు. (ఒక్క శాతం కన్నా తక్కువే.) ►22.8 ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జాతీయ స్థాయి చట్టసభల్లో మహిళల సగటు ప్రాతినిధ్యం. ►61.3 రువాండా దిగువసభలో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో ఇదే అత్యధికం. ►53.1 బొలీవియా పార్లమెంటులో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో రెండో స్థానం. ►48.9 క్యూబా పార్లమెంటు లో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో మూడో స్థానం. ►19.1 అమెరికా ప్రతినిధుల సభలో మహిళా ప్రజాప్రతినిధుల శాతం. ప్రపంచంలో 104వ స్థానం. ►38 పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న దేశాలు. ►16 ప్రస్తుతం ప్రపంచంలో మహిళలు దేశాధ్యక్షులుగా లేదా ప్రధానమంత్రులుగా ఉన్న దేశాలు. ►4 పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యమే లేని దేశాలు. ►11.8 భారత లోక్‌సభలో మహిళా ప్రజాప్రతినిధులు. ప్రపంచంలో 148వ స్థానం. ► 9 భారతదేశంలోని రాష్ట్రాల శాసనసభల్లో మహిళల సగటు ప్రాతినిధ్యం. -
హార్వర్డ్ కంటే హార్డ్‌వర్కే గొప్పది
ఆర్థిక వేత్తలను ఎద్దేవా చేసిన ప్రధాని మహరాజ్‌గంజ్ (యూపీ) హార్వర్డ్ కంటే హార్డ్‌వర్కే శక్తిమంతమైనదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థికవేత్తలను ఎద్దేవాచేశారు. ‘నోట్ల రద్దు ప్రభావం ఎంతమాత్రం పడలేదనే విషయాన్ని జీడీపీ గణాం కాలు సూచిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అంకెలు మెరుగుపడ్డాయి’ అని అన్నారు. నోట్ల రద్దు తొందరపాటుతో కూడిన చర్య అని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందంటూ నోబెల్ బహుమతి విజేత, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇటీవల కాలంలో రెండుమూడు పర్యాయాలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో బుధవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. స్వేదం చిందించడంద్వారా పేదవాడు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాడన్నారు. ఇక కాంగ్రెస్. సమాజ్‌వాదీ పార్టీల పొత్తు విషయమై మాట్లాడుతూ ఇందులో ఒక పార్టీ దేశాన్ని, మరొక పార్టీకి రాష్ట్రాన్ని నాశనం చేయగలిగిన కళ ఉందంటూ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి కాంగ్రెస్ పార్టీకి దేశానికి ఏమిచేసిందంటూ నిలదీశారు. కొబ్బరిచెట్లు కేరళలో పెరుగుతాయి కొబ్బరినీళ్లపై వ్యాఖ్యల విషయమై స్పందిస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మోదీ చురకలంటించారు. ‘ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. ఆయన కలకాలం జీవించాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఓ ఎన్నికల సభలో ప్రసంగించేందుకు ఆయన ఇటీవల మణిపూర్ వెళ్లారు. కొబ్బరికాయల నుంచి నీళ్లుతీసి లండన్‌కు ఎగుమతి చేస్తామని ఆయన అక్కడి రైతులకు చెప్పారు. వాస్తవానికి కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి. అవి కేరళలో పెరుగుతాయి. ఇది ఎలా ఉందంటే పొటాటో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నట్టుంది.’అని అన్నారు. తమకు అధికారమిస్తే యూపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. -
హార్వడ్ యూనివర్శిటీలో పవన్ ప్రసంగం
ఐదు రోజుల పర్యటన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమెరికా చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన బోస్టన్ చేరుకున్నట్లు పార్టీ మీడియా హెడ్ తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ నెల 11వ తేదీన హార్వడ్ విశ్వవిద్యాలయంలో 'బికమింగ్ జనసేనాని' అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. పర్యటనలో చివరి రోజైన 12వ తేదీన కూడా హార్వడ్ యూనివర్శిటీలో కీ నోట్‌ను ప్రసంగిస్తారని తెలిపారు. -
పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశం!
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషపడే వార్త ఇది. ‘ఇండియన్ కాన్ఫరెన్స్ 2017’ తన అభిప్రాయాలను పంచుకునేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందిందట. ఫిబ్రవరి లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. బోస్టన్ లోని హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే 'ఇండియా కాన్ఫరెన్స్ 2017'లో పవన్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 11 నుంచి రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పవన్ ప్రసంగించనున్నారు. దీంతో తమ అభిమాన హీరోకు లభించిన ఈ అరుదైన అవకాశం వార్తలతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో పవన్ కు అభినందనల వెల్లువ సాగుతోంది. కాగా ప్రస్తుతం 'కాటమరాయుడు' చిత్రం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో గబ్బర్ సింగ్ బిజీగా ఉన్నాడు. సమ్మర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. #PawanKalyan will be speaking at Harvard University, Boston in February as part of #IndiaConference2017 — Haricharan Pudipeddi (@pudiharicharan) January 16, 2017 -
హార్వర్డ్ యూనివర్సిటీ @ 380 ఏళ్లు
ప్రపంచంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ.. హార్వర్డ్ యూనివర్సిటీ. అమెరికాలో విద్యనభ్యసించాలని ఆశించే ప్రతి విద్యార్థి ప్రాధాన్య జాబితాలో మొదటి స్థానం హార్వర్డ్ యూనివర్సిటీదే అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోని అత్యున్నత విద్యా సంస్థలకు వివిధ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్స్‌లోనూ టాప్-5లో నిలుస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీ సెప్టెంబర్ 8, 1636లో ఏర్పడి ఇప్పటికి 380 ఏళ్లు పూర్తై నేపథ్యంలో యూనివర్సిటీ ప్రత్యేకతలు.. 1636లోనే.. అమెరికాలో 1636లో కేంబ్రిడ్జ్ (మసాచుసెట్స్, యూఎస్)లో హార్వర్డ్ యూనివర్సిటీ ఏర్పడింది. ఉన్నత విద్యను అందించే యూనివర్సిటీల్లో అమెరికాలోనే ప్రాచీన యూ నివర్సిటీగా పేరు పొందింది. పుర్టియన్ మినిస్టర్.. జాన్ హార్వర్డ్.. యూనివర్సిటీ కోసం తన పుస్తకాలను, ఎస్టేట్‌లో సగ భాగాన్ని దానం చేశారు. ఆయన కృషికి గుర్తుగా హార్వర్డ్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు. 20 వేలకు పైగా విద్యార్థులు హార్వర్డ్ కాలేజీలో ప్రస్తుతం 6700 మంది వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరు కాకుండా గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య 14,500. వివిధ విభాగాల్లో.. 2,400 మంది ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. కోర్సులెన్నో హార్వర్డ్ యూనివర్సిటీలో 11 ప్రిన్సిపల్ అకడమిక్ యూనిట్స్, పది ఫ్యాకల్టీలు, రాడ్‌క్లిఫ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఉన్నాయి. పది ఫ్యాకల్టీల పరిధిలో ఓవర్సీస్ స్కూల్స్, డివిజన్స్ ఉన్నాయి. ఇవి యూజీ, పీజీ, డాక్టోరల్ స్టడీస్ కోర్సులను అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ.. హార్వర్డ్ యూనివర్సిటీ గ్రంథాలయం.. ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ 2 కోట్లకు పైగా వ్యాల్యూమ్స్, 400 మిలియన్ల మ్యానుస్క్రిప్ట్స్, 10 మిలియన్ల ఫొటోగ్రాఫ్స్, 124 మిలియన్ల ఆర్కైవ్స్ వెబ్ పేజీలు, 5.4 టెరా బైట్స్.. డిజిటల్ ఆర్కైవ్స్ ఉన్నాయి. అందుకే హార్వర్డ్ విజ్ఞాన భాండాగారంగా విరాజిల్లుతోంది. లైబ్రరీ పర్యవేక్షణకే 800 మంది సిబ్బంది పనిచేస్తుండటం విశేషం. విద్యనభ్యసించిన ప్రముఖులెందరో.. ప్రపంచంలో 201 దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించారు. ఇక్కడ చదువుకున్నవాళ్లలో 47 మంది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులు పొందారు. 32 మంది వివిధ దేశాలకు ప్రధానమంత్రులుగా, అధ్యక్షులుగా పనిచేశారు. 48 మంది పులిట్జర్ బహుమతులు అందుకున్నారు. ర్యాంకుల్లోనూ హవా.. క్వాకరెల్లీ సైమండ్స్- 2016- 17 ర్యాంకుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో హార్వర్డ నిలిచింది. 2015-16కు సంబంధించి ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్‌కు ఆరో స్థానం లభించింది. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2016కు మొదటి స్థానంలో నిలిచింది. అకడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకుల్లోనూ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వెబ్సైట్: www.harvard.edu -
మిత్రులు లేకుంటే.. పొగ తాగినట్లే!
బోస్టన్: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో కవి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తిలేదు. మంచి మిత్రుడు తోడుంటే ఆ ధైర్యమే వేరు. జీవితంలో మిత్రులు లేకున్నా.. ధూమపానం చేసినా.. శరీరానికి ఒకే రకమైన హాని కలుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరిగి రక్తంలో ఫైబ్రోనోజిన్ ప్రోటీన్ స్థాయి పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రోటీన్ రక్తంలో కొవ్వు పేరుకునేలా చేసి రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండెపోటుతో పాటు తదితర వ్యాధులు వస్తాయి. కుటుంబంలోని వ్యక్తులు, వారికున్న స్నేహితులను బట్టి వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయిలకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐదుగురు స్నేహితులు ఉన్న వారి రక్తంలో ఫైబ్రోజన్ స్థాయి 10 మంది స్నేహితులు ఉండే వారిలో కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఐదుగురి కన్నా తక్కువ మంది స్నేహితులు ఉన్నవారిలో ధూమపానం చేస్తే పెరిగే స్థాయిలో రక్తంలో ఫైబ్రోజన్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. సమాజంతో మనకున్న సంబంధాలు రక్తంలో ఫైబ్రోజన్ స్థాయి పెరుగుదలకు మధ్య సంబంధాలు ఉంటాయిని పరిశోధకులు తెలిపారు. హార్వార్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ఫలితాలను విడుదల చేశారు. -
హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు సౌందర్య
హన్మకొండ : అమెరికా బోస్టన్లోని ప్రపంచ ప్ర ఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న అకమిడక్ సదస్సులో హన్మకొండ వడ్డెపల్లిలోని పింగిళి ప్ర భుత్వ మహిళా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌం దర్య జోసఫ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘జెండర్ డిస్కోర్స్ ఇన్ ది నావెల్స్ ఆఫ్ మార్గరెట్ లారెన్స్ అండ్ అలైక్ మన్రో’ అంశంపై పరిశోధన పత్రం సమర్పిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆమె అమెరికా వెళ్లారు. -
'సూపర్-30'కి సూపర్ అవకాశం!
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ పరీక్షలకు శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన సూపర్-30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ను ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం 'ఎడ్ఎక్స్' గణితశాస్త్రం బోధించాలని ఆహ్వానించింది. ఈ వెబ్ సైట్ ను మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మేరకు ఎమ్ఐటీ ప్రొఫెసర్ అనంత అగర్వాల్.. ఆనంద్ కు లేఖ రాశారు. 'ఎడ్ఎక్స్' కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తోందని, ఎడ్ఎక్స్, సూపర్-30 కలిసి పనిచేయడం వల్ల ప్రపంచంలో ఎక్కువమంది విద్యార్థులు లాభపడతారని ఆయన లేఖలో చెప్పారు. లేఖపై స్పందించిన ఆనంద్ కుమార్ ఎమ్ఐటీ, హార్వర్డ్ లాంటి విద్యాసంస్థలు సూపర్-30ని తమతో కలుపుకుపోవాలని అనుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎడ్ఎక్స్ లాంటి సంస్థలు పేదల కోసం విద్యను అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. కచ్చితంగా ఎడ్ఎక్స్ తో కలిసి నడుస్తానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఏ మేరకు సాయం చేయగలనో ముందు ముందు చూడాలని అన్నారు. ఆనంద్ కుమార్ కు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సీటు దొరికినా ఆర్ధిక కారణాల వల్ల అక్కడకు వెళ్లలేకపోయారు. 2002లో సూపర్-30ని ప్రారంభించిన ఆనంద్ ఐఐటీలో చేరేందుకు ఆసక్తి కలిగిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే. -
కోతులకూ కుర్రాళ్ల ప్రవర్తన..
వాషింగ్టన్: మనుషుల్లానే కోతులు కూడా తమ జీవితకాలం పాటు ఇతరుల చూపులను అర్థం చేసుకుంటాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హార్వర్డ్ వర్సిటీ, పెనోస్లోవియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 481 రైసిస్ కోతుల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. శిశువులతో పోలిస్తే కాస్త ముందుగానే బాల్య దశలో ఉన్న కోతులు శాస్త్రవేత్తల చూపులకు చురుగ్గా స్పందించాయని, పైకి చూడగానే ఇవి కూడా చూపును పైకి మరల్చాయని వివరించారు. ఇక కుర్రాళ్లలా యవ్వనంలో ఉన్న మగ కోతులు ఆడ కోతుల వైపు అధికంగా చూసేవని తెలిపారు. వృద్ధాప్యంలో సైతం మనుషుల్లానే తమ చూపులను తిప్పాయన్నారు. చూసి నేర్చుకోవడం అనేది భాష, సామాజిక అవగాహన, జ్ఞానాన్ని పెంచుకునేందుకు పునాదని, ఇది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని వాల్ యూనివర్సిటీ చెందిన లారీ సాన్టోస్ తెలిపారు. -
క్యాన్సర్ కొరుకుతానంటోంది!
వేటమాంసం, ప్రాసెస్డ్ మాంసాలు అతిగా తినడం వల్ల గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయనీ, స్థూలకాయం వస్తుందనీ చాలాకాలంగా వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వాటివల్ల రకరకాల క్యాన్సర్లు కూడా వస్తాయని ఇటీవల తేలింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్నదేమిటంటే, పాశ్చాత్య దేశాల్లో 30 శాతం క్యాన్సర్లు రావడానికీ, అక్కడి ఆహారపుటలవాట్లకూ సంబంధం ఉందట! ఇక, మన భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో కూడా 20 శాతం క్యాన్సర్లకూ, మనం తినే ఆహారానికీ లింకు ఉందని తేల్చారు. మాంసం తినడం మానేసినవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గినట్లు కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరు నెలల క్రితమే డబ్ల్యూహెచ్ఓ ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. అందులో ఒక జాబితాను సిద్ధం చేశారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాల పేర్లతో కూడిన ‘గ్రూప్1’లో ప్రాసెస్డ్ మాంసాన్ని చేర్చారు. ఇక, క్యాన్సర్ తెచ్చే అవకాశమున్న ఆహారపదార్థాల పేర్లతో కూడిన ‘గ్రూప్ 2ఏ’లో రెడ్ మీట్ (వేట మాంసం)ను పేర్కొన్నారు. గొడ్డు మాంసం, పెయ్యదూడ మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివన్నీ ‘రెడ్ మీట్’ కిందకు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 34 వేల మంది ప్రాసెస్డ్ మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణిస్తున్నారని తాజా అంచనా. అలాగే, దాదాపు 50 వేల మంది రెడ్ మీట్ అతిగా తినడం వల్ల ఏటా క్యాన్సర్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతిరోజూ తింటే... పెద్ద పేగు క్యాన్సర్ ‘అతి సర్వత్ర వర్జయేత్’ - దేనిలోనైనా అతి పనికి రాదు అని పెద్దల మాట. మాంసం తినే విషయంలోనూ ఇది పాటించాల్సిన సూత్రమే. ఎందుకంటే, అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తేల్చాయి. దీనికి కారణాలు అన్వేషిస్తే - మాంసంలో పీచు పదార్థం కానీ, సంరక్షించే ఇతర పోషకాలు కానీ ఉండవు. పెపైచ్చు, మాంసంలో యానిమల్ ప్రోటీన్, శ్యాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. మాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, హెచ్చు ఉష్ణోగ్రతల్లో వండుతున్నప్పుడు క్యాన్సర్ కారకాలైన హెటెరో సైక్లిక్ ఎమైన్స్ (హెచ్‌సీఏ), పాలీ సైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్) ఏర్పడతాయి. అవి క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. ప్రాసెస్డ్ మాంసంలోని అతి కొవ్వు, ఇతర జంతు ఉత్పత్తుల వల్ల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దాని వల్ల వక్షోజ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి క్యాన్సర్లు కూడా ... గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివి అతిగా తిన్నా, ప్రాసె్స్డ్ మాంసాన్ని అతిగా తిన్నా అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమం (ప్యాంక్రియాస్), పొట్ట, గర్భాశయం లోపలి పొర, ప్రొస్టేట్ గ్రంథులకు క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుందని ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్’ వెల్లడించింది. ప్రాసెస్డ్ మాంసంతో పురీషనాళ క్యాన్సర్ ఇటీవలి కాలంలో పురీషనాళ క్యాన్సర్ (కోలో రెక్టల్ క్యాన్సర్) ఎక్కువవుతోంది. ప్రాసెస్డ్ మాంసం అతిగా తీసుకొన్నా, అతిగా ఉడికించిన మాంసాన్ని భుజించినా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ప్రాసెస్డ్ మాంసంతో ఎందుకు ముప్పంటే, మాంసం పాడవకుండా ఉండడానికి సహజంగా కానీ, కృత్రిమంగా కానీ నైట్రైట్లు, నైట్రేట్ల లాంటి లవణాలను చేరుస్తారు. అవి మాంసంలోని పదార్థాలతో రియాక్ట్ అయి క్యాన్సర్ కారక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మన డీఎన్ఏను దెబ్బ తీస్తాయి. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్డ్ మాంసం తినడం వల్ల పురీష నాళ క్యాన్సర్ వచ్చే రిస్క్ 18 శాతం పెరుగుతుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. గ్రిల్డ్ మాంసంతోనూ చిక్కే! నేరుగా నిప్పుల మీద మాంసాన్ని వేయించడం (గ్రిల్డ్ మాంసం), కాల్చడం వల్ల కొవ్వు ఆ వేడి నిప్పుల మీదకు చేరుతుంది. దాంతో, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్)తో నిండిన మంటలు వస్తాయి. సదరు పీఏహెచ్‌లు ఆహారం తాలూకు ఉపరితలానికి అంటుకుంటాయి. వేడి పెరిగిన కొద్దీ మరిన్ని పీఏహెచ్‌లు వస్తాయి. దాంతో, ఉదర సంబంధమైన క్యాన్సర్లు వచ్చే రిస్కు పెరుగుతుంది. అతి కొవ్వుతో రొమ్ము క్యాన్సర్ కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు, వేపుడు ఆహారపదార్థాలు తినడం వల్ల స్త్రీలలో మరింతగా ఈస్ట్రోజెన్స్ ఉత్పత్తి అవుతాయి. వక్షోజాలలో, స్త్రీల సెక్స్ హార్మోన్లకు స్పందించే ఇతర అవయవాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించాలంటే- మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా అధిక కొవ్వు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. అయితే మాంసాహారం తక్కువ కావడం వల్ల విటమిన్ బి-12, విటమిన్-డి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించి మితం హితం అన్న జాగ్రత్త తీసుకోవాలి. అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువ - హార్వర్డ్ వర్శిటీ -
నిన్నొదల మానవాళీ
తింటే తంటా రోగాలు మందులు మింగుతున్నాయి. మింగే ముద్ద బుస కొడుతోంది. పాత జబ్బుల రోత పెరిగింది. కొత్త జబ్బుల మోత మొదలైంది. ‘అన్నం మందు కావాలి... మందు అన్నం కాకూడదు’ అన్న నానుడికి తింటే తంటా అన్న చీడ పట్టింది. మాంసం ఫ్రై చేసి... మసాలా కొట్టి... తందూరు పెట్టి తిందామంటే క్యాన్సర్ కొరుకుతానంటోంది. ప్రసాదం దగ్గర్నుంచి చాక్లెట్ దాకా ఏ పండగా చేసుకోనివ్వని చక్కెర... పానకంలో పుడక అయ్యింది. చిత్రవిచిత్రమైన వ్యాధులు కుల మత వర్ణ వర్గాల అంతరాలు లేకుండా ‘వదల మానవాళీ’ అని ఊళ వేస్తున్నాయి. అన్నీ బ్రేకింగ్ న్యూస్లే! మానవాళికి ‘బ్రెత్ టేకింగ్’ ఫ్యాక్టులే!! డిప్రెషన్ ఎగరగొట్టడానికి కన్ఫ్యూజన్ పారదోలడానికి ఈ కథనాలు! నిజానికి ఏ ఆహారమైనా ఎలర్జీ కలిగించవచ్చు. ఎక్కువగా పిల్లల్లోనే ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిలో ప్రధానంగా ఎనిమిది రకాల ఆహార పదార్థాలు ఎలర్జీలు కలిగిస్తాయి. అవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్లచేపలు. ఆహారం వల్ల ఎలర్జీ లక్షణాలు కొందరిలో తక్కువగా ఉంటే, ఇంకొందరిలో ప్రాణాంతకమైన స్థాయిలో ఉంటాయి. సరిపడని ఆహారం తీసుకున్నప్పుడు నిమిషాల వ్యవధిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఫుడ్ ఎలర్జీలో జరిగే ప్రక్రియ ఏమిటి? ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక ప్రక్రియ చాలా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. అందువల్లనే సరిపడని ఆహార పానీయాలు తీసుకున్న వెంటనే అది తీవ్రంగా ప్రతిఘటించడం మొదలుపెడుతుంది. మనకు సరిపడని ఆహారం లేదా వస్తువును ఎలర్జెన్స్ అంటారు. ఎలర్జెన్స్ లోపలికి ప్రవేశించగానే వాటితో పోరాడేందుకు వ్యాధినిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను వెలువరిస్తుంది. ఈ పోరాటక్రమంలో యాంటీబాడీస్ వెలువరించే రసాయనాల వల్ల మన శరీరంలో ఎలర్జీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫుడ్ ఎలర్జీలు... ఎవరెవరిలో ఎంతెంత? చిన్నారులందరిలోనూ 3 నుంచి 8 శాతం మందిలో ఏదో ఒక రకం ఆహారం కారణంగా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. కొందరిలో ఈ ఎలర్జీలు కాలక్రమంలో తగ్గిపోవచ్చు కూడా. ఇక పెద్దల విషయానికి వస్తే 1 నుంచి 2 శాతం మందిలో ఏదో ఒక ఆహారం పట్ల ఎలర్జీ రావడం చాలా సాధారణం. అయితే గతంలో మనకు బాగా సరిపడే ఆహారాలే... ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా సరిపడకపోవడం కూడా జరుగుతుండవచ్చు. ఇలా ఏ సమయంలోనైనా, ఏ ఆహారం పట్లనైనా ఎలర్జీ కలగవచ్చు. లక్షణాలు ఎలా ఉంటాయి? * ఎలర్జీ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. తీవ్రత సైతం ఒకేలా ఉండదు. వాటి లక్షణాల ప్రభావం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు శారీరక వ్యవస్థలపై ఉండవచ్చు. * ఆహారం మొదట వెళ్లేది జీర్ణవ్యవస్థలోకి కాబట్టి కొందరిలో అది లోపలికి ప్రవేశించగానే నోటిలోని లోపలి మ్యూకస్ పొరల వాపు, పెదవులపై దురదలు, గొంతు బొంగురుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. * ఇంకొందరిలో ఆహారం కడుపులోకి ప్రవేశించగానే వికారం, కడుపు పట్టేసినట్లుగా బిగుతుగా కావడం, మలబద్ధకం, కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాల లాంటివి ఎదురుకావచ్చు. * చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాల వంటివి ఎలర్జీకి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కొందరిలో చర్మంపైనా, ఊపిరితిత్తులపైనా కనిపించే చాలా తీవ్రమైన రియాక్షన్‌ను ‘అనాఫిలాక్సిస్’ అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఫుడ్ ఎలర్జీ నుంచి నివారణ ఎలా...? దూరంగా ఉండండి: మీకు సరిపడని ఆహారం నుంచి దూరంగా ఉండండి. లేబుల్ చదవండి: మీరు ఏదైనా వంటకం లేదా ప్రిపరేషన్‌ను తీసుకోదలచినప్పుడు దానిలో ఉండే పదార్థాల జాబితాను చదవండి. మీరే వండుకోండి: మీకు ఫుడ్ ఎలర్జీలు ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తీసుకోండి. బయటకు వెళ్లాల్సి వస్తే, స్వయంగా వంట చేసుకునే అవకాశం ఉన్నచోట వసతి పొందండి. హోటళ్ళలో తినాల్సి వస్తే, అలవాటైన ఆహారాన్నే ఆర్డర్ చేయండి. నూనెలతో జాగ్రత్త: కొన్ని రకాల నూనెలు ఎలర్జీ కలిగించే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు వేరుశనగ నూనెకు ఈ గుణం ఎక్కువ. పిల్లల విషయంలో: బయట దొరికే కృత్రిమ ఫార్ములాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలిమెంటల్ ఫార్ములాలు లేదా అల్టర్డ్ ప్రోటీన్లు ఫుడ్ ఎలర్జీలను తక్కువగా కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను పాటించండి. అలాగే పిల్లల ఆహారంపై ‘హైపో ఎలర్జెనిక్’ అని రాసి ఉందంటే అది చాలా వరకు సురక్షితం. అయితే, అరుదుగా ఇవి కూడా ఎలర్జీ కలిగించే అవకాశాలు లేకపోలేదు. అందుకే కొద్ది మోతాదుల్లో పరీక్షించాకే వాటిని నమ్మకంగా వాడండి. చికిత్స: ఏదైనా ఆహారం వల్ల ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రతించాలి. ఎలర్జీ తీవ్రత ఎక్కువగా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలర్జిక్ లక్షణాలు కనిపించగానే డాక్టర్లు ఎపినెఫ్రిన్ మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ హిస్టమైన్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ ఇవ్వాల్సి రావచ్చు. ఎక్కువ మందిలో ప్రధానంగా అలర్జీ కలిగించేవి... పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, వేరుశనగలు, ట్రీ-నట్స్, చేపలు, గుల్ల చేపలు. అలర్జీ లక్షణాలు వేరువేరుగానే ఉన్నా చాలా మందిలో దురదలు, గొంతు బొంగురుగా మారడం కనిపించవచ్చు గ్లూటెన్ అంటే...? పిండి... దానితో చేసే ముద్ద గురించి తెలుసుకునే ముందుగా మనం ‘గ్లూటెన్’ గురించి తెలుసుకుందాం. మనం పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోస్తాం. కాసేపటి తర్వాత పొడి పిండి కాస్తా... పిండిముద్దగా మారుతుంది. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే పదార్థం తోడ్పడుతుంది. నిజానికి గ్లూటెన్ అన్నది ఒక రకం ప్రోటీన్. అయితే, కొందరికి మాత్రం ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ సరిపడదు. దాంతో వాళ్లకు పిండితో చేసిన ఏదైనా వంటకం తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాల లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే... ఆ యా పిండులతో గ్లూటెన్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు. డిప్రెషన్ కన్ఫ్యూజన్ ఇన్ని వ్యాధులు మన చుట్టూ భ్రమిస్తూ ఉంటే మానసికంగా కూడా కుంగిపోయేవారు ఎంతోమంది! కొందరు వ్యక్తులు తమకు ఏదో సమస్య ఉన్నట్లుగా భావిస్తుంటారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ను ఒకటికి పదిసార్లు కలుస్తారు. వారు చెప్పింది నమ్మరు. తమకు ఏదో వ్యాధి ఉందంటూ ఈఎన్టీ, న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, డెంటిస్ట్, గ్యాస్ట్రో-ఎంటరాలజిస్ట్... ఇలా అన్నిరకాల స్పెషలిస్టులను సంప్రతిస్తుంటారు. కలిసినప్పుడల్లా సదరు డాక్టర్లకు కొన్ని కొత్త సమస్యలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన లక్షణాలను బట్టి ఆయా డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు చేయిస్తుంటారు. అయినా ఏమీ తేలదు. అలాంటి వారిని ఇక చివరగా మానసిక వైద్యుల వద్దకు పంపిస్తారు. ఇలాంటి చాలామందిలో తమకు ఏదో జబ్బు ఉందని అనుమానించే వారిలో ‘హైపో-కాండ్రియాసిస్’ అనే రుగ్మత ఉండవచ్చు. ఇక కొందరికి తీవ్రమైన డిప్రెషన్ ఉంటుంది. ఇది చాలా పెద్ద మానసిక రుగ్మత. కానీ డిప్రెషన్ రోగులు దాన్ని మానసిక రుగ్మతగా అనుమానించడానికి ముందు అనేక శారీరకమైన లక్షణాలను వ్యక్తపరుస్తుంటారు. ఆ శారీరక లక్షణాలకే చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తీవ్రమైన నీరసం, నిస్సత్తువతో కొందరు బాధపడుతుంటారు. అది శారీరకంగా వచ్చిన బలహీనత వల్ల అని అనుకుంటుంటారు. ఆకలి లేకపోవడం కూడా డిప్రెషన్ వల్ల కనిపిస్తుంది. ఇక కొందరిలో తలనొప్పి ఉంటుంది. నిజానికి డిప్రెషన్ వల్ల కలిగే ఈ తలనొప్పిని నరాలకు సంబంధించిన ఏదైనా వ్యాధి కారణంగా వస్తున్న తలనొప్పిగా రోగులు పొరపడుతుంటారు. ఇక, కండరాలు పట్టేయడం డిప్రెషన్లో కనిపించే మరో లక్షణం. కానీ ఒంట్లో నీళ్లు, లవణాలు తగ్గడం వల్ల ఇలా కండరాలు పట్టేస్తున్నాయని అపోహపడే అవకాశం ఉంది. ఇక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన చాలా రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మలబద్ధకం కానీ, నీళ్ల విరేచనాల వంటివి కానీ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని డాక్టర్లు ముందుగా గ్యాస్ట్రో- ఇంటెస్టినల్ సమస్యగా పరిగణించవచ్చు. కానీ నిజానికి ఇవన్నీ డిప్రెషన్ వల్ల కలగవచ్చు. పైన పేర్కొన్న అనేక సందర్భాల్లో కొన్ని రకాల మానసిక రుగ్మతలు శారీరక లక్షణాలతో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ చికిత్స కోసం డాక్టర్లు కొంత వ్యవధి తీసుకొని అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే జాగ్రత్తపడాలి. మానసిక వ్యాధుల్ని అనుమానించాలి. అరుదైన వ్యాధులు ప్రొగేరియా వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది. జనాభాలో 0.1 శాతం కంటే తక్కువ మందిలో కనిపించే వ్యాధులను అరుదైన వ్యాధులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది. దాదాపు ఏడువేల వ్యాధులను ప్రపంచ ఆరోగ్య సంస్థ అరుదైన వ్యాధులుగా గుర్తించింది. ఇవి సర్వసాధారణమైన వ్యాధులు కావు గనుక వీటిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వైద్యుల సంఖ్య కూడా తక్కువే. అందువల్ల కొన్ని అత్యంత అరుదైన వ్యాధులను వైద్యపరీక్షల ద్వారా గుర్తించడానికే ఒక్కోసారి చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. ఈలోగా అలాంటి వ్యాధులతో బాధపడే రోగులకు జరగాల్సిన అనర్థం కాస్తా జరిగిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాధులకు గురైన వారిలో మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటోందని ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా (ఓఆర్డీఐ) వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ విజయ్ చంద్రు చెబుతున్నారు. మన దేశంలో సుమారు ఏడు కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు అత్యంత అరుదైన వ్యాధుల గురించి... ప్రొగేరియా జన్యులోపం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. దాదాపు 80 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి బాల్యంలోనే ముసలితనం ముంచుకొస్తుంది. ముసలితనం వల్ల వచ్చే అన్ని సమస్యలూ వీరిని చిన్న వయసులోనే చుట్టుముడతాయి. ఫలితంగా వారు త్వరగా మరణానికి చేరువవుతారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్సా పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులో లేవు. వాటర్ ఎలర్జీ హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వల్ల తలెత్తే అత్యంత అరుదైన వ్యాధి ఇది. ప్రపంచవ్యాప్తంగా వాటర్ ఎలర్జీతో బాధపడే రోగులను ఇప్పటి వరకు 31 మందిని మాత్రమే గుర్తించారు. నీరు ప్రాణాధారం. అలాంటి నీరే కొందరికి సరిపడదు. స్నానం చేయడానికి ఒంటి మీద నీళ్లు పోసుకుంటే చాలు ఎలర్జీ మొదలవుతుంది. ఒంటి మీద నీళ్లు పడిన నిమిషాల వ్యవధిలోనే ఒంటిపై దద్దుర్లు వచ్చేస్తాయి. డిస్టిల్ చేయని నీటిలోని అయాన్లు కొందరిలో ఎలర్జీ కలిగిస్తాయి. ఆల్స్ట్రామ్ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలలో ఈ వ్యాధితో బాధపడే 502 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. జన్యువుల్లో తలెత్తే అసహజమైన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది సోకిన వారు బాల్యంలోనే స్థూలకాయులవుతారు. అంతేకాక రెటీనా దెబ్బతిని క్రమంగా అంధులవుతారు. చిన్న వయసులోనే టైప్2 డయాబెటిస్ సోకడంతో పాటు లివర్, కిడ్నీ లాంటి అవయవాలు విఫలమై మరణానికి చేరువవుతారు. మైక్రోసెఫాలీ ఇది అత్యంత అరుదైన నాడీసంబంధ వ్యాధి. ఈ వ్యాధిలో గర్భస్థ స్థితిలో ఉండగానే శిశువు మెదడు అసాధారణంగా ఎదుగుతుంది. పుట్టిన తర్వాత మెదడు ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఈ వ్యాధి సోకిన వారి తల చాలా చిన్నగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని నయం చేసే చికిత్స ఏదీ ఇప్పటికీ అందుబాటులో లేదు. అపెండిక్స్ కేన్సర్ పేగుల చివరుండే వృథా భాగం అపెండిక్స్. అరుదుగా దీనికి కేన్సర్ సోకుతుంది. వైద్యపరిభాషలో దీనిని ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అపెండిక్స్‌లో మొదలైన కేన్సర్ క్రమంగా కడుపులోని ఇతర భాగాలకీ విస్తరిస్తుంది. దీన్ని సీటీ స్కానింగ్‌తో గుర్తించవచ్చు. అయితే, దీని లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి నిర్ధారణలో జాప్యం వల్ల అపెండిక్స్ కేన్సర్ రోగుల్లో చాలామంది మృత్యువాత పడుతుంటారు. ‘పా’ అనే హిందీ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రొగేరియా వ్యాధిగ్రస్తుడుగా నటించారు పానకంలో పుడక చక్కెర రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ‘‘వేడి వేడి అన్నంలోకి ఇంత ముద్దపప్పు... ఆవకాయ, చారెడు నెయ్యి పోసుకుని’’ తింటే ఉంటుందీ... ‘ఆహా ఏమి రుచి’ అంటూ మైమరచిపోవాల్సిందే! కానీ ఈ కాలంలో చాలామంది ‘మొదటి రెండింటికీ ఓకే గానీ... మరీ చారెడు నెయ్యి..? కొలెస్ట్రాల్ పెరిగిపోదూ..’ అంటూ తల విదిలించేస్తారు! ఒక్క నెయ్యి అనేమిటి? కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, గుండెజబ్బులకు కారణమవుతుందని మనం చాలా రుచులను పోగొట్టుకున్నాం. పాలు మొదలుకొని అన్ని రకాల పదార్థాల్లో కొవ్వులు తక్కువగా ఉండేలా చేసుకుంటున్నాం. ఆరోగ్యం కోసం ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం తప్పు కాదు. మరి... గుండెజబ్బులు తగ్గాయా? ఊహూ... చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించిన వారిని, మంచాన పడ్డవారిని మనం చూస్తూనే ఉన్నాం! మరి... సమస్య ఎక్కడుంది? కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... చిక్కంతా చక్కెరలోనే ఉంది! అది 1972. అప్పట్లో బ్రిటిష్ న్యూట్రిషనిస్ట్ జాన్ యడ్కిన్స్ తన పరిశోధనల ఆధారంగా ‘ప్యూర్... డెడ్లీ అండ్ వైట్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ‘చక్కెర (ఫ్రక్టోస్) శరీరంపై చూపే ప్రభావం గురించి ఏ కొంచెం ప్రపంచానికి చెప్పినా... వెంటనే దానిపై నిషేధం ఖాయం’ అని అంటారు యడ్కిన్. అయితే యడ్కిన్ అనుకున్నట్లు ఫ్రక్టోస్‌ను నిషేధించకపోగా యడ్కిన్స్పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఆహార పరిశ్రమ వర్గాలు ఈయన పరిశోధనలన్నీ బోగస్ అని విమర్శించాయి. ఈ అవమానాల మధ్య చివరకు యడ్కిన్ ఓ అనామకుడిలా 1995లో మరణించారు. ఈ మధ్యలో అమెరికా, బ్రిటన్లు ఆహారంలో కొవ్వును తగ్గించుకోవాలనీ, గుండెజబ్బులకు, మధుమేహానికి దూరంగా ఉండేందుకు అదే మేలైన మార్గమనీ ప్రచారం చేశాయి. ఇంకేముంది అందరూ కొవ్వు తక్కువగా ఉండే ‘లో-ఫ్యాట్ డైట్’ వ్యాపార వ్యూహానికి బోల్తా పడిపోయారు. చక్కెర చేదే! అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ లస్టిగ్ అని ఓ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఎండోక్రైనాలజిస్ట్. పిల్లల్లో ఊబకాయం నివారణపై పరిశోధనలు చేస్తూంటారు. ఏడేళ్ల క్రితం ఆయన ‘చక్కెర... ఓ చేదు నిజం’ పేరుతో ఓ ఉపన్యాసమిచ్చారు. యూ-ట్యూబ్‌లో దీన్ని ఇప్పటివరకూ దాదాపు 60 లక్షల మంది చూశారు. యడ్కిన్స్ చెప్పిన విషయాలనే ఈయనా తన ఉపన్యాసంలో చెప్పినప్పటికీ లస్టిగ్ తన వాదనలన్నింటికీ శాస్త్ర, పరిశోధన ఫలితాలను ఆధారంగా చూపారు. ఆహారం నుంచి కొవ్వు తీసేస్తే దాని రుచి మొత్తం పోతుంది కాబట్టి... దాని స్థానంలో చక్కెర మోతాదును ఎక్కువ చేయడం వల్లనే ప్రస్తుతం అమెరికాతోపాటు చాలా దేశాల్లో ఊబకాయం సమస్య పెరిగిపోతోందని, ఇది గుండెజబ్బులకు, ఇతర వ్యాధులకు దారితీస్తోందని ఆయన సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇంతకీ చక్కెర ఏం చేస్తుంది? జంక్‌ఫుడ్ కేటగిరీలోకి వచ్చే చాలావరకూ ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో సుక్రోజ్, హై-ఫ్రక్టోస్ కార్న్ సిరప్లు అధిక మోతాదుల్లో ఉంటాయి. ఈ రెండు తీపి పదార్థాల్లోనూ గ్లూకోజ్, ఫ్రక్టోస్ అనే రెండు రకాల చక్కెరలుంటాయి. బంగాళ దుంపలతోపాటు అనేక రకాల కాయగూరలు, పండ్ల ద్వారా గ్లూకోజ్ లభిస్తుంది. జీవక్రియలకు అవసరమైన శక్తిని కణాలు గ్లూకోజ్ రూపంలోనే తయారు చేసుకుంటాయి. శరీరంలో లివర్ ఒక్కటే అధిక మోతాదులో ఫ్రక్టోస్‌ను జీర్ణం చేయగలదు. ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు లివర్ దాన్ని కొవ్వుగా మారుస్తుంది. ఈ కొవ్వు వెరీ లో-డెన్సిటీ లిపిడ్ కొలెస్ట్రాల్‌గా శరీరంలోకి చేరుతుంది. ఫలితంగా రక్తంలోని కొలెస్ట్రాళ్ల సమతౌల్యం దెబ్బతింటుంది. అంతేకాదు... యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ఫ్రక్టోస్ ప్రేరేపించి రక్తపోటు అధికమయ్యేలా చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతూ ఊబకాయం, మధుమేహ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతుంది. కొవ్వులు తింటే లావెక్కుతారా? ఆహారం ద్వారా మనం తీసుకునే కొలెస్ట్రాల్‌కూ, రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ మోతాదుకూ ఏ మాత్రం సంబంధం లేదని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. రోజుకు ఒకటి నుంచి పాతిక వరకూ కోడిగుడ్లు తినేవాళ్ల బ్లడ్ కొలెస్ట్రాల్ మోతాదుల్లో పెద్దగా మార్పుల్లేనట్లు గుర్తించారు. అదే సమయంలో చక్కెర దుష్ర్పభావాలపై గత దశాబ్ద కాలంలో ఎన్నెన్నో అధ్యయనాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయ విభాగం 2008లో అన్ని రకాల లో-ఫ్యాట్ డైట్లపై విశ్లేషణ జరిపింది. ఆహారం ద్వారా తీసుకునే కొవ్వుల ద్వారా గుండెజబ్బులు, కేన్సర్ వస్తాయనేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొవ్వులు తింటే లావెక్కుతారనే వాదనలో పసలేదని పలు తాజా అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. వెన్న, నెయ్యి, గుడ్లు లాంటివి తినడం వల్ల ఒంట్లో కొవ్వు పెరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఈ అధ్యయనాలు నిగ్గు తేల్చాయి. నిజానికి రోగనిరోధక శక్తి మెరుగుపడడానికి ‘ఏ, డీ, ఈ, కే’ వంటి విటమిన్లు అందడానికి ఈ కొవ్వులే దోహదపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. విషయం ఏంటంటే మితంగా తింటే ఏ గొడవా ఉండదు. - డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి వైస్ ఛైర్మన్ అండ్ సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్‌కు వచ్చిన వాళ్లకు కొద్దిగా ఫ్యాట్, అప్పుడప్పుడూ కొద్దిగా ఎగ్ ఎల్లో తీసుకోవచ్చు అని చెబితే... అన్నీ గుర్తుంచుకుంటారు కానీ... ఆ ‘కొద్దిగా’ అన్నమాట మరచిపోతుంటారు. ఆరోగ్యానికి జీవనశైలిలో బాలెన్స్ ముఖ్యమైనది. ఆ సమతౌల్యతను ‘మితం’ తోనే సాధించగలరు. రోజూ రీసెర్చ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అయితే ఆ సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా, విచక్షణతో వాడుకుంటేనే ఆరోగ్యం మహా భాగ్యంగా ఉంటుంది. కొత్త మోత పాత రోత ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూస్తున్న 40 కొత్త వ్యాధులు ఆస్పత్రుల్లో ఉండే అనేక రకాల రోగకారక క్రిముల వల్ల వచ్చే వ్యాధులైన ‘నోటోకోమియల్ ఇన్ఫెక్షన్స్’ పెచ్చుమీరుతున్నాయి. అంటే జబ్బు తగ్గడానికి హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ సరిగా లేకపోతే, ఆ ప్రాంతమే మళ్లీ ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందన్నమాట! ఐదేళ్లలో పపంచంలో 1100 చోట్ల ఉత్పాత స్థాయిలో (ఎపిడమిక్స్ రూపంలో) వ్యాధుల విజృంభణ కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి. అంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరగని ‘జికా’ వంటివి వస్తున్నాయి. మరో కొత్త వ్యాధి ‘ఎబోలా’ ప్రపంచాన్ని గడగడ వణికించేసింది. గతంలోనూ అంతే... ఆంథ్రాక్స్ అనీ, సార్స్ అనీ, మ్యాడ్ కౌ అనీ, చికన్‌గున్యా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ అనీ... ఒక్కో సీజన్‌కు ఒక్కో వ్యాధి విజృంభించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్ల్లుగా... ఈ కొత్త వ్యాధులకు మరికొన్ని పాత వ్యాధులే కొత్త రూపాలను ధరించి వచ్చేశాయి. ఉదాహరణకు రెసిస్టెంట్ వెరైటీ టీబీ, బర్డ్ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ వంటివి తమ జన్యు స్వరూపాలూ మార్చుకొని విరుచుకుపడుతున్నాయి. సప్తసముద్రాలు దాటేస్తున్నాయి! గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ వ్యాధి అయినా, ప్రపంచంలో ఎక్కడ మొదలైనా అది ఒక మహమ్మారిలా వ్యాపించి, ఉత్పాతం సృష్టిస్తోంది. జికా వైరస్‌కి సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్లో నమోదయింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. అది మహమ్మారిలా విస్తరిస్తుండడంతో ప్రపంచదేశాలు ఉలిక్కి పడ్డాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ వైద్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచంలోని ఏదో ఒక చోట వ్యాపించే ఒక కొత్త వ్యాధి మిగతా ప్రాంతాల నుంచి ‘కొన్ని గంటల దూరంలోనే’ ఉంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ డెరైక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమె పేర్కొన్నదాని ప్రకారం ఒక తరం కిందటి వారు ఏ మాత్రం ఎరగని 40 రకాల కొత్త జబ్బులను ఆ తర్వాతి తరం వారు చవిచూశారు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచం 1100 చోట్ల జబ్బుల వ్యాప్తి ఉత్పాతాలను (ఎపిడమిక్స్... అంటే జబ్బు మనుషులను తుడిచిపెట్టినట్లుగా ఒక ప్రదేశంలో వ్యాపించడాన్ని) చవి చూసింది. ఇప్పుడు బ్యాక్టీరియా జీవులు మరింత బలం పుంజుకోవడం వల్ల ఒక రకం నిమోనియాను కలిగించే క్లెబిసియెల్లా నిమోనియా కార్బపేనిమేజ్, సూడోమొనాస్ అనే ప్రజాతి (జీనస్)కి చెందిన సూక్ష్మజీవుల వల్ల వ్యాపించే వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వాలూ జాగ్రత్తలు తీసుకోవాలి! విస్తరించే వ్యాధులు సాధారణంగా వాటంతట అవే కొంత సమయం తర్వాత కట్టుబడుతుంటాయి. అయితే ఇలా అవి స్వాభావికంగా కట్టుబడకుండా ఉండడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు సురక్షితమైన మంచి నీరు లేకపోవడం, రోజురోజుకూ పెరిగే కాలుష్యాల వల్ల పరిసరాలు అనారోగ్యకరంగా మారుతుండడం, సంపద అందరికీ అందకపోవడం వల్ల పేదలలో జీవన ప్రమాణాలు దిగజారుతుండడం వంటి అంశాలు పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. దీనికి తోడు మారిపోతున్న వాతావరణం, అనారోగ్యకరమైన ఆహారాలు, పాశ్చాత్య జీవనశైలి వంటివి ఈ వ్యాధులకు ఊతమిస్తున్నాయి. పట్టణీకరణలో భాగంగా పెరుగుతున్న మురుగునీటి పెరుగుదల, నీళ్లు కలుషితం కావడం వంటివి కొత్త వ్యాధులు మరింత వేగంగా విస్తరించేలా చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఈ అంశాలను పర్యవేక్షించడానికీ, కొత్త వ్యాధుల విస్తరణలపై నిఘా పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఎపిడమిక్ అండ్ ప్యాండమిక్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు అప్పగించింది డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అంశాలను తెలుసుకోడానికి ఒక ఉదాహరణ. ప్రపంచంలోని 25 శాతం జనాభా ఫ్లూ వ్యాధికి గురవుతోంది. ఫ్లూను కలిగించే వైరస్లలో కలిగే ఉత్పరివర్తనాల వల్ల మందులకు లొంగని మ్యూటెంట్ వెరైటీ ఇన్ఫ్లుయెంజాలు ఏర్పడితే అది ముప్పుగా పరిణమించవచ్చు. ఇదే జరిగితే ఆ దేశం కునారిల్లే లోపే ఆ పెనుముప్పు ఎపిడమిక్ రూపంలో ప్రపంచంలోని అన్ని దేశాలనూ చుట్టుముడుతుంది. అది సమస్త మానవాళినీ తుడిచిపెట్టే అవకాశమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. డబ్ల్యూహెచ్ఓ వార్షిక నివేదిక చెబుతున్నదిదే... * 20వ శతాబ్దంలోనే కనిపించకుండా పోయాయనుకున్న కలరా, ఎల్లో ఫీవర్, ఎపిడమిక్ మెనింగోకోకల్ వ్యాధులు (బ్రెయిన్ ఫీవర్ / మెదడువాపు) మళ్లీ వెలుగు చూస్తున్నాయి. * వైరస్ ద్వారా సంక్రమించే ఎబోలా, మార్బర్గ్ హెమరేజిక్ ఫీవర్, నిఫా వైరస్ లాంటివి ఇప్పుడు మానవాళి అంతు చూసేందుకు సిద్ధంగా ఉన్నాయి. - డాక్టర్ మార్గరెట్ చాన్ డబ్ల్యూ.హెచ్.ఓ డైరెక్టర్ జనరల్ -
ఏ విషయాన్నీ ‘సహించొద్దు’: కమల్ హాసన్
బోస్టన్: అసహన వివాదంపై చర్చలో భాగమయ్యేందుకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిరాకరించారు. సహనం అనే పదానికి వ్యతిరేకినని చెప్పుకొచ్చారు. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీలో ఆదివారం విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసహన వివాదంపై మాట్లాడుతూ.. భారత్‌ను చేతుల్లేని స్వెటర్గా అభివర్ణిస్తూ ‘‘అది (భారత్) ఆకుపచ్చ సహా ఇతర రంగులతో కలిపి అల్లిన స్వెటర్. అందులోంచి ఆకుపచ్చ దారాన్ని లాగలేం. అలా చేస్తే స్వెటర్ మిగలదు. బంగ్లా, పాక్‌ల రూపంలో చేతులను కోల్పోయింది. మిగిలింది చేతుల్లేని స్వెటరే.’’ అని వ్యాఖ్యానించారు. -
హార్వర్డ్ యూనివర్శిటీ ఆవిర్భావం
ఆ నేడు 28 అక్టోబర్, 1636 ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరొందిన హార్వర్డ్ యూనివర్శిటీ 1636 అక్టోబర్ 28న ఆవిర్భవించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నత విద్య కోసం మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో కొలోనియల్ మాసాచుసెట్స్ శాసనసభ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. మొదట్లో దీనిని న్యూ కాలేజ్ లేదా ది కాలేజ్ ఎట్ న్యూ టౌన్ అని పిలిచేవారు. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకుంది. ప్రస్తుతం ఈ యూనివర్శిటీ పది వేర్వేరు అకాడమిక్ యూనిట్లను కలుపుతోంది. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని విద్యాలయాల కన్నా అత్యధిక ఆర్థిక ధర్మనిధిని కలిగి ఉన్నదిగా పేరొందింది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రపంచంలోని ఒక అగ్రవిద్యాసంస్థగా ర్యాంకింగ్ ఉంది. అందుకే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారిని ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యావంతులుగా గుర్తిస్తారు. -
మంచి నిద్ర పట్టాలంటే... అలా మాత్రం చదవకండి!
కొత్త పరిశోధన చాలామంది నిద్రపోయే ముందు ఏదైనా పుస్తకం చదువుతూ పడుకుంటారు. అయితే ఇటీవల పుస్తకాల స్థానాన్ని ఎలక్ట్రానిక్ రీడింగ్ డివెసైస్ ఆక్రమిస్తున్న విషయం తెలిసిందే. సంప్రదాయ పుస్తకాల స్థానంలో కంప్యూటర్లలో ఈ-బుక్స్, చదవడం కోసమే తయారైన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో నిద్రకు ముందు చదవడం అంత మేలు కాదంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. దీనివల్ల నిద్రపోయే ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్నది వారి పరిశోధనల్లో తేలిన విషయం. ఎలక్ట్రానిక్ ఉపకరణం లేదా కంప్యూటర్ నుంచి వెలువడే వెలుగు వల్ల... నిద్ర దెబ్బతింటుందని వారు పేర్కొంటున్నారు. పైగా మామూలు పుస్తకాలకు బదులు ఎలక్ట్రానిక్ ఉపకరణంలో పుస్తకం చదివేవారికి... నిద్రపట్టడానికి పట్టే వ్యవధి పెరుగుతుందట. ఇలా నిద్రపోయిన వారు ఆ మర్నాడు సాయంత్రం పూట మత్తుగా జోగుతూ ఉంటారనీ, చురుగ్గా ఉండలేరనీ హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ చదివే ఉపకరణంతో వచ్చే వెలుగు వల్ల సర్కాడియన్ రిథమ్ దెబ్బతిని మెదడులో స్రవించాల్సిన మెలటోనిన్ పాళ్లలో మార్పులు వస్తాయి. దాంతో జీవనశైలి కూడా దెబ్బతి అది రొమ్ముక్యాన్సర్, పెద్దపేగు-మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి పెద్ద సమస్యలకూ దారితీసే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు ఈ పరిశోధ కులు. అందుకే రాత్రిపూట నిద్ర పట్టడానికి పుస్తకాన్ని చదివేవారు సంప్రదాయ పుస్తకాలను చదవడమే మేలని వారు సలహా ఇస్తున్నారు. -
మనవద్దకు హార్వర్డ్ వర్సిటీ
న్యూయార్క్: ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ త్వరలో భారత్‌లో కూడా తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ముంబై, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తన అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు హార్వార్డ్ వర్సీటీకి చెందిన పత్రికలో పేర్కొంటూ వ్యాసాన్ని ప్రచురించింది. ఈ మూడు దేశాల్లోని కార్యాలయాలను తన పరిశోధనకు, అకడమిక్‌కు అవసరాలకు వినియోగించుకోనుంది. ఇప్పటికే భారత్‌తో ఈ విషయంలో చర్చలు జరుపుతున్నామని, ఈ వేసవిలో అనుమతి వచ్చేఅవకాశం ఉందని హార్వర్డ్ వర్సిటీ ప్రకటించింది. 2015 చివరిలోగా కేప్ టౌన్ నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని, 2016 తొలి రోజుల్లో బీజింగ్‌లో అంతర్జాతీయ కార్యలయాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. వీటి ఏర్పాటు పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కార్యాలయాల సంఖ్య16కు చేరుకుంటుంది. -
అమెరికా వెళ్లేందుకు విద్యార్థికి ప్రభుత్వం చేయూత
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించిన వరంగల్ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వరంగల్‌లోని వడ్డెపల్లికు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ఈ.నవీన్‌కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌యూసీ)లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నాడు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 2015 జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న ప్రపంచ సదస్సులో దేశం తరుఫున పేపర్ ప్రజెంటేషన్ కోసం ఆహ్వానం లభించింది. అమెరికా వెళ్లేందుకు నవీన్‌కుమార్‌కు తగిన ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి ఖర్చులను ప్రభుత్వం తరుఫున ఇచ్చేందుకు హమీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. రెండు లక్షలను మంజూరు చేసి, విడుదల చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం విద్యార్థి నవీన్‌కు చెక్కును అందజేసినట్లు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్‌భాస్కర్ తెలిపారు. -
విద్యార్థులకు బెదిరింపు ఈ మెయిల్!
న్యూయార్క్:నగరంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయుం విద్యార్థులకు అందిన బెదరింపు ఈ -మెయిల్ కలకలం రేపుతోంది. 'స్వయంగా యూనివర్సిటీకి వచ్చి, మీలో ఒక్కొక్కరినీ కాల్చి చంపేస్తాను' అంటూ బెదిరిస్తూ ఓ వ్యక్తి పంపించిన ఈ మెయిల్, ఈ వారాంతంలో వందలాది మంది విద్యార్థులకు అందింది. జాతివివక్షతో కూడిన పదజాలం ఉన్న ఈ మెయిల్ పై అమెరికన్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తునకు దిగారు. బెదిరింపు ఇ-మెయిల్ నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆవరణలో బలగాలను పెంచాలని హార్వర్డ్ పోలీసు యంత్రాంగం భావిస్తోంది. అమెరికా దర్యాప్తు సంస్ధ ఎఫ్‌బీఐకి, న్యూయార్క్ స్థానిక పోలీసు యంత్రాంగానికి ఈ ఇ-మెయిల్ గురించి తెలియజేశారు. తమ పేర్లకు ముందు ఆసియా ప్రాంతపు ఇంటిపేర్లు ఉన్నవారికే ఎక్కువగా ఈ సందేశాలు అందినట్టు కనిపిస్తోంది. -
అమెరికాలో టాప్-20 కాలేజీలివే
-
రొయ్య పొలుసుల నుంచి గ్రీన్ ప్లాస్టిక్!
ప్లాస్టిక్.. ఎన్నో రకాలుగా ఉపయోగపడే, అతి చవ కైన పదార్థం. ఇది ఎంత ఉపయోగకరమైనదో, పర్యావరణానికి అంత హానికరమైనది కూడా. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా భూమిలో సులభంగా కరిగిపోయే పర్యావరణ హిత ప్లాస్టిక్ తయారీ కోసం రకరకాల పద్ధతులు కనిపెడుతున్నారు. హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన విస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు కూడా తాజాగా రొయ్య పొలుసుల్లో ఉండే ఖీటోసన్ పదార్థంతో బయోప్లాస్టిక్‌ను తయారు చేశారు. ఖీటోసన్ లక్షణాలు మారిపోకుండానే దాని నుంచి ప్లాస్టిక్ లాంటి ‘ష్రిల్క్’ను తయారు చేసే పద్ధతిని వీరు ఆవిష్కరించారు. దీనితో ప్లాస్టిక్ మాదిరిగానే క్యారీబ్యాగులు, బొమ్మలు, వివిధ వస్తువులు తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రొయ్య, ఇతర క్రస్టేషియన్ జీవుల్లో, సీతాకోక చిలుక, ఇతర కీటకాల రెక్కల్లో ఖైటిన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి.. ఈ ప్లాస్టిక్ తయారీకి ముడిసరుకు కొరత ఉండదంటున్నారు. అలాగే వాడి పారేసిన కొన్ని వారాలకే ఇది ఎరువుగా మారి మొక్కల పెరుగుదలకూ తోడ్పడుతుందని చెబుతున్నారు. -
‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ ప్రయోగాత్మక విధానం
ముంబై: అమెరికా అనుసరిస్తున్న సహాయక ప్యాకేజీ (క్వాంటిటేటివ్ ఈజింగ్) విధానం చాలా ప్రయోగాత్మకమైనదని ఆర్థిక వేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కెనెత్ రాగాఫ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో (ఆర్థిక సంక్షోభం వంటివి) తాము అనుసరించే విధానాలు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో.. ఫలితాలు వచ్చే దాకా విధానకర్తలకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఎల్కే ఝా 14వ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కెనెత్ ఈ విషయాలు తెలిపారు. 2008 నాటి సంక్షోభ ప్రభావాల నుంచి అమెరికా ఎకానమీని బైటపడేసేందుకు అనుసరిస్తున్న క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానంలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ ప్రతి నెలా 85 బిలియన్ డాలర్ల మేర బాండ్ల కొనుగోలు చేస్తూ వ్యవస్థలోకి నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఇంటర్నెట్ ద్వారా మనిషి మెదడుపై నియంత్రణ
వాషింగ్టన్: ఇంటర్నెట్ ద్వారా మనిషి మెదడుపై శాస్త్రవేత్తలు విజయవంతంగా నియంత్రణ సాధించారు. ఒక మనిషి మెదడు ఇంటర్నెట్ ద్వారా మరో మనిషి మెదడుపై నియంత్రణ సాధించిన ఈ ప్రయోగంలో భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు కీలక పాత్ర పోషించారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ రాజేష్ రావు ఇంటర్నెట్ ద్వారా తన మెదడులోని సంకేతాన్ని తన సహ శాస్త్రవేత్త ఆండ్రియా స్టోకోకు పంపారు. సంకేతాన్ని అందుకున్న స్టోకో వేళ్లు దానికి అనుగుణంగా కంప్యూటర్ కీబోర్డుపై కదిలాయి. కాగా, ఇదివరకు డ్యూక్ వర్సిటీ శాస్త్రవేత్తలు రెండు ఎలుకల మెదళ్ల నడుమ సమాచార ప్రసారాన్ని విజయవంతంగా సాధించారు. హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఒక మనిషి మెదడు నుంచి ఒక ఎలుక మెదడుకు సంకేతాలను పంపగలిగారు. అయితే, మనిషి మెదడులోని సంకేతాలను మరో మనిషికి ఇంటర్నెట్ ద్వారా విజయవంతంగా పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం.