రొయ్య పొలుసుల నుంచి గ్రీన్ ప్లాస్టిక్!
ప్లాస్టిక్.. ఎన్నో రకాలుగా ఉపయోగపడే, అతి చవ కైన పదార్థం. ఇది ఎంత ఉపయోగకరమైనదో, పర్యావరణానికి అంత హానికరమైనది కూడా. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా భూమిలో సులభంగా కరిగిపోయే పర్యావరణ హిత ప్లాస్టిక్ తయారీ కోసం రకరకాల పద్ధతులు కనిపెడుతున్నారు.
హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన విస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్లీ ఇన్‌స్పైర్డ్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు కూడా తాజాగా రొయ్య పొలుసుల్లో ఉండే ఖీటోసన్ పదార్థంతో బయోప్లాస్టిక్‌ను తయారు చేశారు. ఖీటోసన్ లక్షణాలు మారిపోకుండానే దాని నుంచి ప్లాస్టిక్ లాంటి ‘ష్రిల్క్’ను తయారు చేసే పద్ధతిని వీరు ఆవిష్కరించారు.
దీనితో ప్లాస్టిక్ మాదిరిగానే క్యారీబ్యాగులు, బొమ్మలు, వివిధ వస్తువులు తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రొయ్య, ఇతర క్రస్టేషియన్ జీవుల్లో, సీతాకోక చిలుక, ఇతర కీటకాల రెక్కల్లో ఖైటిన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి.. ఈ ప్లాస్టిక్ తయారీకి ముడిసరుకు కొరత ఉండదంటున్నారు. అలాగే వాడి పారేసిన కొన్ని వారాలకే ఇది ఎరువుగా మారి మొక్కల పెరుగుదలకూ తోడ్పడుతుందని చెబుతున్నారు.