అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్ల రగడ | Harvard University discriminate Indian students | Sakshi
Sakshi News home page

అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్ల రగడ

Published Tue, Aug 8 2017 1:05 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్ల రగడ - Sakshi

అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్ల రగడ

హార్వర్డ్‌ యూనివర్సిటీ తాజా అడ్మిషన్లలో శ్వేతజాతేతరులకు సగానికి పైగా సీట్లు కేటాయించడం అమెరికా వర్సిటీల్లో రిజర్వేషన్లపై చర్చకు తెరలేపింది. అమెరికా  వర్సిటీల్లో  మైనార్టీలకు అనధికారికంగా అమలవుతున్న  రిజర్వేషన్‌ విధానం రద్దుకు ట్రంప్‌ సర్కారు సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో వర్సిటీల్లో సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని రెండేళ్ల క్రితం ఆసియన్‌ అమెరికన్లు చేసిన ఫిర్యాదులపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తునకు ఆదేశించడంతో.. ట్రంప్‌ సర్కారు, మైనార్టీలకు మధ్య ఘర్షణకు తెరలేచింది.

నిజానికి భారత్‌లోమాదిరి అమెరికాలో చట్టబద్ధ రిజర్వేషన్లు లేవు. జనాభాలో 12.2 శాతం ఉన్న ఆఫ్రికన్‌ అమెరికన్లు, 16.3 శాతమున్న లాటిన్‌ లేదా హిస్పానిక్‌ ప్రజలు.. శ్వేతజాతి అమెరికన్ల కన్నా వెనుకంజలో ఉండేవారు. దీంతో వారికి కొన్ని ప్రత్యేక కేటాయింపులతో సామాజిక న్యాయం అందేలా ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు వంటి చోట్ల అన్ని జాతుల, రంగుల ప్రజలు కనిపించాలనే దేశ సామాజిక న్యాయానికి అనుగుణంగా.. రిజర్వేషన్లకు బదులు అఫర్మేటివ్‌ యాక్షన్‌(నిశ్చయాత్మక చర్య), పాజిటివ్‌ డిస్‌క్రిమినేషన్‌(సానుకూల వివక్ష) పేర్లతో వర్సిటీల్లో కొన్ని సీట్లను మైనార్టీలకు కేటాయిస్తున్నారు. మిగతావారి కన్నా కొన్ని మార్కులు తక్కువ వచ్చినా.. ఆ వర్గాలకు సీట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది.

హార్వర్డ్‌ వర్సిటీలో ఈ ఏడాది మొత్తం 2,056 మంది విద్యార్థులకు ప్రవేశం లభించగా, వారిలో 50.8 శాతం శ్వేతజాతేతరులు. గతేడాది ఈ సంఖ్య 47.3 శాతమే. ఇప్పుడది సగానికి మించడం తెల్లజాతివారికి గుబులు పుట్టిస్తోంది.  అడ్మిషన్లలో ఆఫ్రికన్‌ అమెరికన్లకు 22.2, ఆసియన్‌ అమెరికన్లకు 14.6, లాటినోలకు 11.6 శాతం సీట్లు దక్కాయి. దీంతో వర్సిటీల్లో కోటా ఎత్తివేతపై ట్రంప్‌ సర్కారు దృష్టిపెట్టినట్లు సమాచారం.

ఒబామా హయాంలో.. హార్వర్డ్‌ వర్సిటీలో దక్షిణాసియా విద్యార్థులకు మంచి మార్కులు వచ్చినా తక్కువ ప్రతిభ ఉన్న ఇతర మైనార్టీలకు సీట్లు ఇచ్చారంటూ 2015లో దక్షిణాసియా, భారత సంఘాల సమాఖ్య నాటి ఒబామా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది.  ఒబామా సర్కారు వీటిపై స్పందించలేదు.

ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలతో శ్వేతజాతీయులు నష్టపోయారన్న ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ ఇప్పుడు ఆ ఫిర్యాదులపై స్పందించారు. అందుకే దక్షిణాసియా సంఘాల రెండేళ్లనాటి ఫిర్యాదులను పరిశీలించాలని లాయర్లను కోరామని అమెరికా న్యాయశాఖ తెలిపింది. నల్లజాతివారికి, లాటినోలకు కల్పిస్తున్న సౌకర్యాలను తెల్లజాతివారు నేరుగా సవాలు చేయకుండా భారతీయులు కీలకంగా వ్యవహరించే దక్షిణాసియా లాబీని ఈ పనికి వాడుకుంటున్నట్లు భావిస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement