వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా వ్యవహరిస్తున్న గీతా గోపీనాథ్ (49) వచ్చే ఏడాది పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన గీతా గోపీనాథ్ .. ఐఎంఎఫ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్ యూనివర్సిటీ పొడిగించడంతో మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో కొనసాగారు. తాజాగా అదే వర్సిటీకి తిరిగి రానున్నారు. గీతా గోపీనాథ్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. ‘ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ అందించిన సేవలు అసమానమైనవి. ఫండ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు.
గీతా గోపీనాథ్ మేధస్సు, అంతర్జాతీయ ఫైనాన్స్.. స్థూలఆరి్థకాంశాలపై ఆమెకున్న అపార అవగాహన, ఐఎంఎఫ్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రభావవంతమైన పనితీరుతో ఆమె అందరి అభిమానం, గౌరవం చూరగొన్నారు‘ అని జార్జియేవా పేర్కొన్నారు. తన విధుల నిర్వహణలో సహకరించినందుకు సహోద్యోగులకు గీతా గోపీనాథ్ ధన్యవాదాలు తెలిపారు. టీకాల ఊతంతో కోవిడ్–19 మహమ్మారిని అంతమొందించేందుకు తీసుకోతగిన చర్యలపై రూపొందించిన ’పాండెమిక్ పేపర్’కు ఆమె సహరచయితగా వ్యవహరించారు. ఇందులోని ప్రతిపాదనలకు అనుగుణంగా అల్పాదాయ దేశాలకు కూడా టీకాలను చేర్చేందుకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర ఏజెన్సీలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయని ఐఎంఎఫ్ పేర్కొంది.
మైసూరు నుంచి అమెరికా వరకు...
గీతా గోపీనాథ్ 1971లో మైసూరులో జన్మించారు. మలయాళీ కుటుంబ నేపథ్యం గల గీతా గోపీనాథ్ కోల్‌కతాలో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం, ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లోను, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో మాస్టర్స్ చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీ వంటి దిగ్గజాల గైడెన్స్‌తో 2001లో ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన గీతా గోపీనాథ్ 2005లో హార్వర్డ్‌కు మారారు. 2010లో టెన్యూర్డ్ ప్రొఫెసర్ (దాదాపు పర్మనెంట్ స్థాయి) గా పదోన్నతి పొందారు. హార్వర్డ్ చరిత్రలో ఈ గౌరవం దక్కించుకున్న మూడో మహిళగాను, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తర్వాత తొలి భారతీయురాలిగాను ఆమె ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment