
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపు తప్పుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలిన్ జార్జివా హెచ్చరించారు. అసాధారణమైన ఆర్థిక సంక్షోభ సమయంలో మరింత బాధను కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా విధాన నిర్ణేతలు ద్రవ్యోల్బణంపై పోరు సల్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశం నేపథ్యంలో ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే...
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒకదాని తర్వాత మరొ కటి షాక్‌లు తగులుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత అన్నీ సమస్యాత్మకమే.
► ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన అంశం. మనం ధర స్థిరత్వాన్ని పునరుద్ధరించలేకపోతే, వృద్ధి అవకాశాలకూ విఘాతం కలుగుతుంది. ప్రత్యేకించి పేద ప్రజల జీవనం మరింత సంక్షోభంలోకి వెళుతుంది.
► మహమ్మారితో పోరాడిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ఆహార కొరత లేకుండా చేయడం, ఇంధన వ్యయాల కట్టడి, పేద వారికి సహాయం చేయడంపై తక్షణం దేశాలు దృష్టి పెట్టాలి. విస్తృత వ్యయ కార్యక్రమాలపై ఇప్పుడు ప్రణాళికలు సరికాదు. విధాన చర్యలు పటిష్టం లక్ష్యంతో సాగాలి.
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పోటీ రాజకీయ కూటములతో ‘విచ్ఛిన్నం’ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాల చెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది. రేటు పెంపు వల్ల అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించలేం.
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఐక్యతా ప్రయోజనాలను మనం కోల్పోతే, మనమందరం పేదలుగా ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment