వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ‘‘ప్రకాశవంతమైన ప్రాంతం‘గా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జివా అన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని భారత్‌లో పర్యటించనున్న ఆమె అంచనా వేశారు. కరోనా మహమ్మారి సమస్య నుంచి ప్రపంచంలోని ఐదవ–అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ‘‘డిజిటలైజేషన్’’ బయటపడవేయగలిగిందన్నారు.
దీనికితోడు దేశం అనుసరిస్తున్న వివేకవంతమైన ఆర్థిక విధానం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో మూలధన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ (33 శాతం పెంపుతో రూ.10 లక్షల కోట్లకు) బడ్జెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం దేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని జార్జివా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు తెలిపిన అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలు...
► 2022–23లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.1%గా ఉంటుందన్నది మా అభిప్రాయం. ఆయా గణాంకాలు దేశాన్ని ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుపుతాయి.
► ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధి అభినందనీయం.
► భారత్ ఎకానమీ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలాగా కాస్త నెమ్మదించినప్పటికీ, ప్రపంచ సగటు కంటే, భారత్ వృద్ధి వేగం ఎక్కువగా ఉంది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా దాదాపు 15 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం.
► దేశాన్ని ‘గ్రీన్ ఎకానమీ’ వైపు మళ్లించడానికి, తద్వారా వృద్ధిని కొనసాగించడానికి పునరుత్పాదక ఇంధనాలతో సహా వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడంపై భారతదేశం ఎంత శ్రద్ధ కనబరుస్తోందో నేను ప్రత్యేకంగా గమనించాను.
Comments
Please login to add a commentAdd a comment