global growth
-
మెరుగ్గా వ్యవహరించిన భారత్
అంతర్జాతీయ పరిణామాలు సవాలు విసురుతున్న సమయంలో గత ఏడాది భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచం క్రమంగా కోలుకున్నప్పటికీ, ప్రపంచ వృద్ధి ఇంకా దుర్బలంగానే ఉంది. ద్రవ్యోల్బణం కూడా మొండిగాఉంది. విపరీతమైన వాతావరణ ఘటనలు పెరుగుతున్న తరుణంలో (రికార్డుల పరంగా జూలై అత్యంత వేడి అయిన నెల అని గ్రహించాలి), వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఈ ‘కార్యాచరణ దశాబ్ది’లో తక్షణ చర్యలు అవసరం. అయితే, అంతర్జాతీయ సహకారాత్మక చర్యకు సంబంధించిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ – భౌగోళిక రాజకీయ పోటీ, ఘర్షణ ప్రమాదాలు ఆ సహకారానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ కష్టతరమైన ప్రపంచ ముఖచిత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బహుశా భారతదేశ అత్యంత పరిణామాత్మకమైన, అత్యంత బోధనాత్మకమైన నిర్ణయం, జీ20 చర్చా ప్రక్రియకు ఉపక్రమించడం! చెప్పాలంటే,ఇండియా చేయాల్సినదాని కంటే ఎక్కువ చేసింది. అత్యంత సంఘటిత ప్రక్రియను నడిపించడం ద్వారా సహకార విధానంలోకి మొగ్గు చూపింది. భౌగోళిక కమ్యూనిటీలు అన్నింటికీ స్వరాలు ఉండాల్సిన ఈ బహుముఖ, బహుళ వాటాదారుల విధానం... ప్రపంచ సహకారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. మన భాగస్వామ్య ప్రాధాన్యాలపై పురోగతి సాధించడానికి ప్రపంచం తక్షణమే మార్గాలను కనుగొనాల్సిన తరుణంలో ఇది చాలా కీలకమైనది. ప్రపంచ జనాభాలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణార్ధ దేశాల సమూహానికి బహుముఖ సంభాషణలలో తరచుగా చోటివ్వరు. అయితే దక్షిణార్ధ ప్రపంచ (గ్లోబల్ సౌత్) వాణికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశం భౌగోళికంగా జీ20 చర్చలను విస్తరించింది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలల్లో భారతదేశం 125 దేశాలకు చెందిన నాయకులు, మంత్రుల భాగస్వామ్యంతో కూడిన ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీ20 కూటమిలో ప్రాతినిధ్యం వహించని దేశాలతో సంప్రదింపులు జరపడం, వారి ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడమే దీని లక్ష్యం. అటువంటి ప్రాధాన్యాల్లో ఒకటి ప్రపంచ సార్వభౌమాధికార దేశాల రుణ సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం దేశాలు తీవ్రమైన రుణ బాధలో ఉన్నట్టు అంచనా. ఈ రుణ విచికిత్స కోసం భారతదేశం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 3 ట్రిలియన్ డాలర్ల సామూహిక జీడీపీ ఉన్న 55 ఆఫ్రికన్ రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చాలని కూడా భారతదేశం వాదించింది (ఈ మేరకు సఫలమైంది కూడా). విభిన్న భౌగోళిక ప్రాంతాల నుండి పెట్టుబడులను తీసుకువచ్చే బహుముఖ ప్రక్రియకు నాయకత్వం వహించడంతో పాటు, భారతదేశం కమ్యూనిటీలలో కూడా వాటాదారులతో చర్చలు జరిపింది. ఉదాహరణకు, థింక్20 కమ్యూనిటీ అనేది, జీ20కి ‘ఐడియా బ్యాంక్’గా పనిచేస్తుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య కమ్యూనిటీకి ప్రాతి నిధ్యం వహించే అధికారిక డైలాగ్ ఫోరమ్‌గా బి20 వ్యవహరిస్తుంది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మొట్ట మొదటిసారిగా ‘స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్’ ప్రాతినిధ్యం వహిస్తుంది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్, సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సాధనంగా అంతర్జాతీయ బహుళ వాటాదారుల సహకారానికి ప్రాముఖ్యమిస్తోంది. ఈ విధానం స్పష్టమైన హామీని కలిగి ఉంది. పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో– భౌగోళికాలు, వ్యాపార రంగాలు, పర్యావరణ వ్యవస్థలు, కమ్యూనిటీలలోని సవాళ్లను పరిష్కరించడానికి బహుళ వాటాదారుల విధానం చాలా అవసరం. సమ్మిళిత జీ20 ప్రక్రియను తీర్చి దిద్దడానికి చేసిన భారత ప్రయత్నాలను సులభంగా తీసేయకూడదు. జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. ప్రస్తుతం నిట్టనిలువుగా ఎదుగుతున్న పథంలో ఉంది. అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వరుసగా మూడేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 100 కంటే ఎక్కువ స్టార్టప్ యునికార్న్స్ (1 బిలి యన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లు) కలిగివుంది. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదలను చూసింది. ఇవి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్ల కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం, ప్రపంచం త్వరలో కొత్త జీ3 యుగానికి స్వాగతం పలుకుతుంది. ఈ అంచనా అమెరికా, చైనాతోపాటు ప్రపంచంలోని ఉత్కృష్ట దేశాలలో భారతదేశాన్ని కూడా చేర్చింది. ఇది మరోలా ఉండి వుంటే, ఈ పరిణామాలు వేరుగా ఉండేవి. ఇదంతా భారతదేశం దాని తలలోకి ఎక్కించు కొని ఉండవచ్చు. అందరినీ కలుపుకొని పోవడం కాకుండా, కొందరితో ప్రత్యేకంగా చర్చలు జరిపి వుండొచ్చు. కానీ భారతదేశం స్వభావరీత్యా పైనుంచి కిందివరకూ చర్చలను నడిపించడానికి ప్రోత్సహించింది. జీ20 అధ్యక్షతలో తొలి నుండీ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ మకుటంతో, మరింత సంపన్నమైన, సురక్షితమైన భవి ష్యత్తును రూపొందించడానికి ఏకైక మార్గం సహకారమే అని గుర్తు చేసింది. సహకారం పట్ల అంతర్జాతీయ నిబద్ధత క్షీణిస్తున్న తరుణంలో, భారతదేశ జీ20 అధ్యక్షత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రధారులు తమ సహకార విధానాలకు మళ్లీ కట్టుబడి ఉండాలని గుర్తుచేస్తోంది. బోర్గే బ్రెండే వ్యాసకర్త వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు; నార్వే మాజీ విదేశాంగ మంత్రి -
ప్రపంచ ఎకానమీలో భారత్ వెలుగులు
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ‘‘ప్రకాశవంతమైన ప్రాంతం‘గా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జివా అన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని భారత్‌లో పర్యటించనున్న ఆమె అంచనా వేశారు. కరోనా మహమ్మారి సమస్య నుంచి ప్రపంచంలోని ఐదవ–అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ‘‘డిజిటలైజేషన్’’ బయటపడవేయగలిగిందన్నారు. దీనికితోడు దేశం అనుసరిస్తున్న వివేకవంతమైన ఆర్థిక విధానం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో మూలధన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ (33 శాతం పెంపుతో రూ.10 లక్షల కోట్లకు) బడ్జెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం దేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని జార్జివా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు తెలిపిన అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► 2022–23లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.1%గా ఉంటుందన్నది మా అభిప్రాయం. ఆయా గణాంకాలు దేశాన్ని ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుపుతాయి. ► ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధి అభినందనీయం. ► భారత్ ఎకానమీ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలాగా కాస్త నెమ్మదించినప్పటికీ, ప్రపంచ సగటు కంటే, భారత్ వృద్ధి వేగం ఎక్కువగా ఉంది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా దాదాపు 15 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► దేశాన్ని ‘గ్రీన్ ఎకానమీ’ వైపు మళ్లించడానికి, తద్వారా వృద్ధిని కొనసాగించడానికి పునరుత్పాదక ఇంధనాలతో సహా వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడంపై భారతదేశం ఎంత శ్రద్ధ కనబరుస్తోందో నేను ప్రత్యేకంగా గమనించాను. -
బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్రం.. భారత్‌పై ఐఎంఎఫ్ ప్రశంసల వర్షం!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ (imf) భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుతం ఉన్న భారత ఆర్థిక వృద్ది రేటు 6.8 నుంచి 6.1 శాతానికి పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ తిరిగి పుంజుకుంటుందనే అంచనాల్ని ఉదహరిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. గ్లోబల్ వృద్ధి రేటు ఐఎంఎఫ్ అప్డేట్ చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆ అవుట్ లుక్‌లో 2022 గ్లోబల్ వృద్ధి రేటు 3.4 ఉండగా 2023లో 2.9 శాతానికి తగ్గి 2024లో 3.1శాతానికి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటుపై ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పియరీ ఒలివర్ గౌరించాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 6.8శాతంతో వృద్ది రేటు అక్టోబర్ అవుట్ లుక్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కానీ మార్చి తర్వాత ఇండియన్ ఎకానమీ 6.1 శాతానికి దిగజారుతుందనే అంచనా వేసినట్లు తెలిపారు. అందుకు దేశంలోనే పరిస్థితులేనని అన్నారు. పురోగతి సాధ్యమే 2022లో భారత వృద్ది రేటు 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతం తగ్గింది. అయితే దేశీయంగా స్థిరమైన డిమాండ్ కొనసాగనుందనే అంచనాలతో పురోగతి సాధిస్తూ 2024లో 6.8 శాతానికి చేరుకోనుంది. ఆసియా దేశాల్లో ఆసియా దేశాల్లో అభివృద్ది నిలకడగా కొనసాగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ ఆర్ధిక వృద్ది రేటును పెంచింది. 2023లో వృద్ది రేటు 5.2శాతం ఉండగా 2024లో 5.5శాతానికి పెంచింది. 2022లో ఊహించిన దానికంటే లోతైన మందగమనం తర్వాత ఆసియా దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థకు 4.3 శాతానికి తగ్గించింది ఐఎంఎఫ్. చైనా అభివృద్దిలో అడ్డంకులు 2022 నాల్గవ త్రైమాసికంలో చైనా జీడీపీ మందగించింది. వెరసీ 40 ఏళ్ల చరిత్రలో ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉండటం చైనాకు ఇది మొదటిసారి. వ్యాపారంలో శక్తి సామర్ధ్యాలు తగ్గిపోవడం, క్షీణిత, నెమ్మదించిన నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2022 క్యూ4లో 3.0 శాతంగా ఉన్న వృద్ది రేటును 0.2శాతానికి తగ్గించింది. అది అలాగే మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక అదే వృద్ది రేటు 2023లో 5.2 శాతం వరకు పెరగొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అభివృద్ధిలో ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉందనే అంచనాలతో 2024 కంటే ముందే వృద్ది రేటు 4శాతం తగ్గొచ్చంటూ సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది తిరుగులేని స్థానం మీడియా ప్రతినిధులు సంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా గౌరించాస్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాదేనని వెల్లడించారు. అదే అమెరికా, యూరోప్రాంతం కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు. ► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం. ► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. ► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది. ► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి. ► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది. ► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది. -
భయపెడుతున్న జోస్యం
అవును.. ఇది ప్రపంచాన్ని భయపెడుతున్న జోస్యం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు సహా అనేక కారణాల వల్ల వచ్చే 2023లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి మునుపు ఆశించినంత ఉండదట. అంతర్జా తీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) జూలైలో వేసిన అంచనా కన్నా 0.2 శాతం తగ్గి, 2.7 శాతమే వృద్ధి సాధిస్తుందట. 2001 నుంచి ఎన్నడూ లేనంతటి అత్యంత బలహీనమైన వృద్ధి ఇది. అదీ కాక, వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం లాంటి గడ్డు పరిస్థితి ప్రపంచంలో అత్యధిక జనాభాకు తప్పదని ఐఎంఎఫ్ హెచ్చరించింది. జూలై నాటి అంచనాలను సవరించి, తాజాగా ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ను ప్రకటించింది. మంగళవారం ప్రకటించిన ఈ అంచనాలు, ముందున్నది ముసళ్ళ పండగ అనే హెచ్చరికలు సహజంగానే నిరాశాజనకం. అదే సమయంలో ఆర్థిక రథసారథులకు మేలుకొలుపు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు ఈ ఏడాది, లేదంటే వచ్చే ఏడాది కుంచించుకు పోతుందట. ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాలు స్తంభిస్తాయట. ఉక్రెయిన్ యుద్ధంతో జర్మనీ, ఇటలీ లాంటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలు సైతం మాంద్యంలో కూరుకుపోనున్నాయట. ఐరోపాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ పూర్తిగా రష్యా నుంచి వచ్చే ఇంధనం మీదే ఆధారపడడం ఇబ్బంది తెచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు ప్రతిగా ఐరోపాకు చమురు సరఫరాలో రష్యా కోత జర్మనీకి తలనొప్పి అయింది. ఫలితంగా, ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం వచ్చే 2023లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం మేర కుంచించుకుపోనుంది. చమురు దిగుమతులపై ఆధారపడ్డ ఇటలీ స్థూల జాతీయోత్పత్తి 0.2 శాతం మేర తగ్గనుంది. మొత్తానికి, ఈ ఏడాది ప్రపంచ ద్రవ్యోల్బణం 8.8 శాతం గరిష్ఠానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా. వచ్చే 2024కు అది 4.1 శాతానికి తగ్గవచ్చట. మిగిలిన ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా చిక్కులూ చాలా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధి 2022 –23లో తగ్గుతుందంటూ గత వారం రోజుల్లో అటు ప్రపంచ బ్యాంక్, ఇటు ఐఎంఎఫ్ – రెండూ అంచనా వేశాయి. ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఇంధన సరఫరా ఇక్కట్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ దోవలో వివిధ కేంద్ర బ్యాంకులు ద్రవ్య వినియోగాన్ని కట్టుదిట్టం చేయడం లాంటివన్నీ ఇందుకు కారణాలే. గత ఆర్థిక సంవత్సరం 8.7 శాతం ఉన్న భారత వృద్ధి ఈసారి 6.8 శాతమే ఉండవచ్చని ఐఎంఎఫ్ తాజా మాట. ఏప్రిల్ నాటి అంచనా కన్నా ఇది 1.4 శాతం తక్కువ. ఇక, ప్రపంచ బ్యాంకు అయితే తన తాజా ‘దక్షిణాసియా ఆర్థిక అప్డేట్’ (ఎస్‌ఏఈయూ)లో మన దేశ వృద్ధిరేటు 1 శాతం మేర తగ్గి, 6.5 శాతం దాకా ఉండవచ్చంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఒక్కటీ మాత్రం మిగిలినవాటికి భిన్నంగా, కాస్తంత మెరుగ్గా ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా కట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తాజాగా వాషింగ్టన్లో మాట్లాడుతూ ఈ ఏడాది మన వృద్ధి 7 శాతం ఉంటుందని బింకంగా చెప్పారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావానికి మనం అతీతులం కామని ఒప్పుకున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్న భారత్ ఈ ఏడాది ఆ కిరీటాన్ని సౌదీ అరేబియాకు కోల్పోయే సూచనలున్నాయి. వచ్చే ఏడాది మళ్ళీ ఆ ఘనత సాధిస్తామని భావిస్తున్నా, ఆశ పెట్టుకోలేం. ప్రపంచ పరిణామాలు, పర్యవసానాలు భారత్ పైనా ప్రభావం చూపుతాయి. అలా వృద్ధి 5.2 శాతానికి జారిపోతుందనే అనుమానం ఉంది. మిగిలిన వారితో పోలిస్తే పైకి బాగున్నట్టు కనిపిస్తున్నా, 2020లో తగిలిన దెబ్బతో దేశంలో అత్యధికంగా 5.6 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. దారిద్య్రరేఖ దిగువకు పడిపోయారు. ప్రమాదాలూ పొంచి వున్నాయి. ఇప్పుడు పెరిగే ముడిచమురు, ఎరువుల ధరలతో దేశీయ ద్రవ్యోల్బణం హెచ్చు తుంది. ప్రపంచ మందగమనం ఎగుమతుల్ని దెబ్బతీసి, వృద్ధిని నీరసింపజేసి, వాణిజ్యలోటును పెంచు తుంది. డాలర్ దెబ్బతో రూపాయి మారకం రేటుపై ఒత్తిడి పెరిగి, విదేశీమారక నిల్వలు తగ్గుతాయి. ఇప్పుడున్న నిరాశావహ ప్రపంచ వాతావరణంలోనూ పరిస్థితులు మెరుగవ్వాలంటే ఎప్పటి లానే విధాన నిర్ణేతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముందుగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలి. అందుకు తగ్గ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ, ద్రవ్య వినియోగంపై పట్టు బిగించి జీవన వ్యయాన్ని అదుపు చేయాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేశామనీ, అదేమంత ఆందోళన చెందాల్సిన విషయం కాదనీ పాలకులు అంటున్నారు. కానీ, వాస్తవంలో జూలైలో కాస్తంత తెరిపి నిచ్చినా, ఆగస్ట్, సెప్టెంబర్లలో ధరలు పెరుగుతూనే పోయాయి. ద్రవ్యోల్బణం 7 శాతానికి పైనే ఉంటూ వచ్చింది. దేశంలో తలసరి ఆదాయం తక్కువ గనక, ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇంటి ఖర్చులు చుక్కలు చూపిస్తాయి. అలాగే, ఆహార ధరలు రెక్కలు విప్పుకొన్న కొద్దీ ఆర్బీఐకి సవాలు పెరుగుతుంది. అందుకే, ఆహార ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయాలి. కేంద్రం, రాష్ట్రాలు తెలివైన ఆర్థిక చర్యలు చేపట్టాలి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు సందేహిస్తుంది గనక, ప్రభుత్వాలు మూలధన వ్యయంలో కోతలు విధించకుండా ముందుకు సాగాలి. అది ఆర్థిక వృద్ధికి కారణమవుతుంది. ఏప్రిల్ – ఆగస్టు మధ్య భారత సర్కార్ 47 శాతం మేర మూలధన వ్యయాన్ని పెంచి, దోవ చూపడం ఆనందించాల్సిన విషయమే. కానీ, దేశ వృద్ధిగమనం నిదానిస్తున్న వేళ కళ్ళు తెరిచి, సత్వర కార్యాచరణకు దిగాలి. అదే మన తక్షణ కర్తవ్యం! -
ఎయిరిండియా.. టాటా గ్రూపు సంచలనం..కొత్త..కొత్తగా!
సాక్షి, ముంబై: ఎయిరిండియాకు సంబంధించి టాటా గ్రూపు కీలక ప్రకటన చేసింది. కొత్తపేరు, కొత్త ప్రణాళికలతో ప్రయాణికుల ముందుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘విహాన్ ఎయిరిండియా’ అనే ప్లాన్స్‌తో దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలను తాజాగా ప్రకటించింది. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో, ఐదు నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకుంది. (రెసిషన్ భయాలు:రుపీ మరోసారి క్రాష్) కస్టమర్ అనుభవం, బలమైన కార్యకలాపాలు, పరిశ్రమ-ఉత్తమప్రతిభ, పరిశ్రమ నాయకత్వం, వాణిజ్య సామర్థ్యం అనే ఐదు కీలక లక్ష్యాలతో ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. దాని పేరు విహాన్ ఏఐ ... విహాన్ అంటే సంస్కృతంలో కొత్త శకానికి నాంది అని అర్థం. దీంతోపాటు రాబోయే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించింది. దేశీ మార్కెట్లో ప్రస్తుతం 8 శాతంగా ఉన్న తన వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేలా అంతర్జాతీయ సర్వీసులను గణనీయంగా పెంచాలని భావిస్తోంది. ఇందులోనే భాగంగా నెట్వర్క్, ఫ్లీట్ రెండింటి వృద్ధిపైనా మరింత దృష్టిపెట్టనుంది. ఎయిరిండియాను దారిలో పెట్టడమే ఈ ప్లాన్ లక్ష్యమంటూ ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్ సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి, వర్క్‌ప్లేస్, వర్చువల్ కమ్యూనికేషన్ ఎంగేజ్ మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మొత్తం సంస్థ ప్లాన్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక మార్పునకు నాంది ఇదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త శకానికి తొలి అడుగు.. అద్భుతమైన ఉత్సాహంతో కొత్త వృద్ధికి పునాది వేస్తున్నామని ప్రకటించారు. ఈ ట్రాన్సఫర్మమేషన్ ఇప్పటికే మొదలైంది, విమాన క్యాబిన్స్ పునరుద్ధరణ, సౌకర్యవంతమైన సీట్లు, భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ నిరంతరం యాక్టివ్‌గా ఉండటంతోపాటు ఆన్-టైమ్ పనితీరును మెరుగు, క్రియాశీల నిర్వహణ, విమాన షెడ్యూల్‌లను మెరుగుపరుస్తామని ఆయన ప్రకటించారు. -
బంగారం రూ.44,000 పైకి..
ముంబై: ఒకవైపు అంతర్జాతీయంగా పసిడి పరుగు, మరోవైపు దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌తో దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాములు ధర రూ.1,000కుపైగా పెరిగి రూ.44,000 దాటిపోయింది. న్యూఢిల్లీలో ధరలు రూ.1,155 ఎగసి, రూ. 44,383కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.50,000 కొంచెం అటు ఇటూ పలుకుతుండడం గమనార్హం. ప్రపంచ వృద్ధికి కోవిడ్–19 భయాలు, దీనితో తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తుండడం, దీనికితోడు వృద్ధికి బలాన్ని ఇవ్వడానికి అమెరికా ఫెడ్‌సహా పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానాలను అవలంభిస్తుండడం వంటి అంశాలు పసిడికి అంతర్జాతీయంగా బలాన్ని ఇస్తున్నాయి. రూపాయి... 17 నెలల కనిష్టం ఇదిలావుండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం మరో 20 పైసలు నష్టపోయి.. 73.39 వద్ద ముగిసింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి. ట్రేడింగ్ మొదట్లో 72.90 వద్ద ప్రారంభమైన రూపాయి, 74 పైసల కనిష్ట–గరిష్ట స్థాయిల మధ్య తిరగడం గమనార్హం. బుధవారం ఒక దశలో 73.64 స్థాయినీ చూసింది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూలతలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. -
మందగమనం తాత్కాలికమే..
దావోస్ (స్విట్జర్లాండ్): భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. శుక్రవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అమెరికా–చైనా మధ్య తొలి దశ ఒప్పందంతో తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, సమకాలిక పన్ను కోతలు తదితర అంశాలు సానుకూల పరిస్థితులకు దారితీసినట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 3.3 శాతం వృద్ధి రేటు అన్నది అద్భుతమేమీ కాదన్నారు. ‘‘ఇప్పటికీ వృద్ధి నిదానంగానే ఉంది. అయితే పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరింత దూకుడైన ద్రవ్య విధానాలు అవసరం. నిర్మాణాత్మక సంస్కరణలు కావాలి. మరింత చైతన్యం కావాలి’’ అని జార్జీవా పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లలో ఒక్క భారత మార్కెట్‌నే తాము డౌన్‌గ్రేడ్ చేశామని, అది కూడా తాత్కాలికమేనని చెప్పారు. రానున్న కాలంలో పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. వర్ధమాన దేశాల్లో ఇండోనేషియా, వియత్నాంను ఆశాకిరణాలుగా పేర్కొన్నారు. చాలా ఆఫ్రికా దేశాలు కూడా మంచి పనితీరు చూపిస్తున్నాయని, అదే సమయంలో మెక్సికో వంటి దేశాల పనితీరు ఆశావహంగా లేదన్నారు. తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం, దీర్ఘకాలంగా తయారీ వృద్ధి బలహీనంగా ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా ఆమె పేర్కొన్నారు. ఎన్నో అంశాలపై ప్రగతి... డబ్ల్యూఈఎఫ్ 50 వార్షిక సదస్సు విశేషమైనదిగా సంస్థ ప్రెసిడెంట్ బోర్గేబ్రెండే పేర్కొన్నారు. ఎన్నో అంశాలపై ప్రగతిని సాధించినట్టు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ/ప్రైవేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. 2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు. టాటా స్టీల్‌కు డబ్ల్యూఈఎఫ్ గౌరవం గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో చేరినందుకు టాటా స్టీల్ కళింగనగర్ను డబ్ల్యూఈఎఫ్ సత్కరించింది. టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ అవార్డును అందుకున్నట్టు కంపెనీ తెలిపింది. గోయల్ కీలక భేటీలు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా శుక్రవారం పలు కీలక నేతలతో చర్చలు జరిపారు. సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్ రాబర్టో అజవేదోతో చెప్పారు. ఈయూ వాణిజ్య కమిషనర్ ఫిల్ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్ స్పెన్స్, బ్లాక్‌స్టోన్ గ్రూపు చైర్మన్ ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్ పీటర్ వోసర్ తదితరులతోనూ గోయల్ చర్చించారు. ప్రపంచ వృద్ధి అంచనాలు సవరణ సవరించిన ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసింది. 2019 సంవత్సరానికి వృద్ధి రేటు 2.9 శాతానికి సవరించిం ది. 2020లో ఇది 3.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2021లో 3.4 శాతానికి పెరుగు తుందని అంచనా వేసింది. -
వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)భారత వృద్ది అంచనాలను మరోసారి భారీగా కుదించింది. అతి తక్కువ వృద్ధిని అంచనా వేసింది. అలాగే భారతదేశ ఆర్థిక మందగమన పరిస్థితి గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేసిందని సోమవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ది రేటును 4.8 శాతానికి సవరించింది. అంతేకాదు ఇది ప్రతికూల ఆశ్చర్యంగా పక్రటించింది. గత ఏడాది ఇదేకాలంలో ఐఎంఎఫ్ అంచనా 7.5 శాతం. అక్టోబర్‌లో 6.1 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలలో 0.1 శాతం తగ్గించిన ఐఎంఎఫ్ భారతదేశ ఆర్థిక మందగమనానిదే "సింహభాగం" అని ఐఎంఎఫ్ పేర్కొంది. దీనికి తోడు అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక అశాంతిని తీవ్రతరం చేయడం, అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య సంబంధాలను దెబ్బతీయడం, అలాగే ఇతర దేశాల మధ్య ఆర్థిక ఘర్షణలులాంటివి ప్రముఖంగా ఉన్నాయని తెలిపింది. దేశీయంగా బ్యాంకుయేతర ఆర్థిక రంగంలో ఒత్తిడి ,రుణ వృద్ధి క్షీణత, దేశీయ వినిమయ డిమాండ్ ఊహించిన దానికంటే చాలా మందగించిందని వ్యాఖ్యానించింది. ఇదే వృద్ధి రేటును తగ్గించడానికి కారణమని తెలిపింది. మరోవైపు జపాన్ వృద్దిరేటును అంచనాలను బాగా పెంచింది ఐఎంఎఫ్. ప్రధానంగా జపాన్ ప్రధాని షింజో అబే గత నెలలో ప్రకటించిన స్టిములస్ ప్యాకేజీ కారణంగా వృద్ధి పురోగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2020 నాటికి 0.7శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. గత అక్టోబరు లో ఇది 0.5 శాతంగా మాత్రమే వుంటుందని అంచనావేసింది. అలాగే అమెరికా-చైనా ట్రేడ్‌డీల్ కారణంగా చైనా వృద్ది రేటుకు పైకి సవరించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఒక శాతం పెరిగి 5.8 శాతంగా ఉండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ వుంటుందని తెలిపింది. 6.5 శాతం వృద్ధి రేటుతో చైనా (5.8 శాతం)ను అధిగమించి 2021 లో భారత్ మొదటి స్థానంలో నిలబడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దృక్పథాన్ని స్వల్పంగా క్రిందికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్దిపై కొత్త అంచనాలు 2019 లో 2.9 శాతం, 2020 లో 3.3 శాతం, 2021 లో 3.4 శాతం వృద్ధినగా వుంచింది.. భారతదేశ ఆర్థిక వృద్ధి క్షీణత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందని అభిప్రాయపడింది. అయితే దేశ వృద్ది 2020లో 5.8 శాతంగాను, 2021లో 6.5 శాతానికి మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభోత్సవానికి ముందు, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ వృద్ధి మళ్లీ మందగించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరూ మళ్లీ సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అయితే అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద పరిణామాలతో అక్టోబర్ నుంచి కొన్ని నష్టాలు పాక్షికంగా తగ్గాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తుండగా, ఐరాస 5.7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
దశాబ్దంలోనే కనిష్టానికి ప్రపంచ వృద్ధి: ఓఈసీడీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008–09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి ఈ ఏడాదిలోనే నమోదు కానుందని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ’ (ఓఈసీడీ) తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి గతేడాది 3.6 శాతం నుంచి ఈ ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్‌లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందన్న అంచనాలకు వచ్చింది. 2018లో 6.8 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు అంతర్జాతీయ వృద్ధిని దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి నెట్టిందని అభివర్ణించింది. -
మోదీ సర్కార్‌కు వరల్డ్ బ్యాంకు బూస్ట్
వాషింగ్టన్: ప్రపపంచబ్యాంకు మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట నిచ్చింది.భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్ చేస్తూ అంచనాలను విడుదల చేసింది. అనేక సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా, ఈ ఏడాది భారత ఆర్థిక ప్రగతి 6.7 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భారత ప్రభుత్వం ఊహించినదానికన్నా ఎక్కువే వుంటుందంటూ మోదీ సర్కర్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దుపై విమర్శలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విడుదలైన ఈ ప్రపంచ బ్యాంకు నివేదికపై బీజీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక ప్రగతి 6.5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాదు 2018-19 సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కూడా 7.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. ప్రపంచదేశాలపైన కూడా తన నివేదికను వెల్లడించిన ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని వెల్లడించింది. భారత్ మళ్లీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశమని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్‌లో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ఈ సందర్భంగా భారత ఆర్థిక ప్రగతిపై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. జీఎస్టీ వల్ల వృద్ధి రేటు గత ఏడాది రెండవ భాగంలో సుమారు 0.1 శాతం తగ్గినట్లు రిపోర్ట్ పేర్కొన్నది. 2019-20లో జీడీపీ 7.5 శాతం ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జీఎస్టీ వల్ల లాభాలు మెలమెల్లగా వస్తుంటాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నది. నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. మేకిన్ ఇండియా వల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు పెరుగుతాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మంచి సందేశాన్ని అందిస్తున్నా, అప్రమత్తంగా వ్యవహరించాలని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యంగ్ కిమ్ తెలిపారు. పెట్టుబడులకు ఇది మంచి అవకాశమని, గ్లోబల్‌గా ట్రేడ్ రికవరీ పుంజుకుంటోందనీ, తద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు. ఏదేమైనా, దేశాలు తమ వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడానికి పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్య రంగాల్లోకి ఎక్కువ మంది ప్రజలను, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చేరడానికి ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
ప్రపంచ వృద్ధికి ఇంజిన్.. భారత్
అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్ ద్వారాలు తెరవాలి ♦ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నాం ♦ వస్తూత్పత్తుల్లోనే కాదు... సేవల్లోనూ మాకు అవకాశమివ్వాలి ♦ భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం... ♦ యూఎస్ఐబీసీ సమావేశంలో మోదీ ఉద్ఘాటన; ఇన్వెస్టర్లకు ఆహ్వానం వాషింగ్టన్: భారత్ వంటి వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తు, సేవల మార్కెట్ల ద్వారాలను పూర్తిగా తెరిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుండి నడిపించే ప్రధాన చోదకంగా (ఇంజిన్) భారత్ నిలుస్తుందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్-ఇండియా వ్యాపార మండలి(యూఎస్ఐబీసీ) వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచానికిప్పుడు ఒక కొత్త వృద్ధి చోదకం కావాలి. అదికూడా ప్రజాస్వామ్య దేశాలైతే మంచిది. భారత్ వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రపంచానికి బహుళ ప్రయోజనాలుంటాయి. అందుకే భారత్ ఈ పాత్ర పోషించబోతోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలు, విధానపరమైన చర్యల కారణంగానే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఆవిర్భవించిందని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమంటూ అమెరికా ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ముఖ్యంగా తయారీ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘భారత్ అంటే కేవలం మార్కెట్ మాత్రమే కాదు. అత్యంత నమ్మకమైన భాగస్వామి. అమెరికా పెట్టుబడులు, సాంకేతికత... భారత్‌కు ఉన్న అపారమైన మానవ వనరులు, పారిశ్రామిక నైపుణ్యాలు కలగలిస్తే ఆ శక్తికి ఎదురుండదు’ అని మోదీ పేర్కొన్నారు. సేవల్లో కూడా అవకాశాలివ్వాలి... ఒక్క వస్తూత్పత్తుల్లోనే కాకుండా సేవల రంగంలో కూడా అభివృద్ధి చెందిన దేశాలు భారత్ వంటి దేశాలకు తమ మార్కెట్లలో పూర్తిగా అవకాశాలు కల్పించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ దేశ కంపెనీలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. దీన్ని తొలగించి వర్ధమాన దేశాలకూ అవకాశాలు లభించేలా మార్కెట్ ద్వారాలు తెరవాలి’ అని ప్రధాని వ్యాఖ్యానిం చారు. జోరుగా వృద్ధిని సాధిస్తున్న భారత్... అమెరికా అనుభవం నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఎంట్రప్రెన్యూర్షిప్తో పాటు డ్రోన్ల నుంచి ఔషధాల దాకా అమెరికా అభివృద్ధి చేసిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉందని చెప్పారు. ‘గత వైభవంతోపాటు అద్వితీయమైన భవిష్యత్తు ఉన్న దేశం అమెరికా. ఇండో-యూఎస్ భాగస్వామ్యం ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా నిలుస్తుందని భావిస్తున్నా. వ్యాపారాలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే విషయంలో మా చర్యలను వేగవంతం చేస్తాం. అంతేకాదు అవినీతికి అడ్డుకట్టవేయడంలోనూ మా ప్రభుత్వం నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంది’ అని మోదీ కార్పొరేట్ అమెరికాకు వివరించారు. దిలీప్ సంఘ్వీకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు... అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటు సన్‌ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ దిలీప్ సంఘ్వీ కూడా యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడంలో నిబద్ధత, చేయూతలకుగాను ఈ పురస్కారాన్ని ఇచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాధిగ్రస్తులకు అత్యంత నాణ్యమైన ఔషధాలను అందించడంపైనే మేం దృష్టిపెట్టాం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాంకేతిక పరిజ్ఞానంలో ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఔషధ ఉత్పత్తులను ప్రపంచానికి అందించేందుకు ఇది మాకు దోహదం చేస్తుంది’ అని సంఘ్వీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆయన పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే.