ప్రపంచ వృద్ధికి ఇంజిన్.. భారత్ | India a new engine of global development, says Modi | Sakshi
Sakshi News home page

ప్రపంచ వృద్ధికి ఇంజిన్.. భారత్

Published Thu, Jun 9 2016 12:25 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రపంచ వృద్ధికి ఇంజిన్.. భారత్ - Sakshi

ప్రపంచ వృద్ధికి ఇంజిన్.. భారత్

అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్ ద్వారాలు తెరవాలి
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నాం
వస్తూత్పత్తుల్లోనే కాదు... సేవల్లోనూ మాకు అవకాశమివ్వాలి
భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం...
యూఎస్‌ఐబీసీ సమావేశంలో మోదీ ఉద్ఘాటన; ఇన్వెస్టర్లకు ఆహ్వానం

 వాషింగ్టన్: భారత్ వంటి వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తు, సేవల మార్కెట్ల ద్వారాలను పూర్తిగా తెరిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుండి నడిపించే ప్రధాన చోదకంగా (ఇంజిన్) భారత్ నిలుస్తుందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్-ఇండియా వ్యాపార మండలి(యూఎస్‌ఐబీసీ) వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచానికిప్పుడు ఒక కొత్త వృద్ధి చోదకం కావాలి. అదికూడా ప్రజాస్వామ్య దేశాలైతే మంచిది. భారత్ వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రపంచానికి బహుళ ప్రయోజనాలుంటాయి.

అందుకే భారత్ ఈ పాత్ర పోషించబోతోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలు, విధానపరమైన చర్యల కారణంగానే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఆవిర్భవించిందని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమంటూ అమెరికా ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ముఖ్యంగా తయారీ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘భారత్ అంటే కేవలం మార్కెట్ మాత్రమే కాదు. అత్యంత నమ్మకమైన భాగస్వామి. అమెరికా పెట్టుబడులు, సాంకేతికత... భారత్‌కు ఉన్న అపారమైన మానవ వనరులు, పారిశ్రామిక నైపుణ్యాలు కలగలిస్తే ఆ శక్తికి ఎదురుండదు’ అని మోదీ పేర్కొన్నారు.

 సేవల్లో కూడా అవకాశాలివ్వాలి...
ఒక్క వస్తూత్పత్తుల్లోనే కాకుండా సేవల రంగంలో కూడా అభివృద్ధి చెందిన దేశాలు భారత్ వంటి దేశాలకు తమ మార్కెట్లలో పూర్తిగా అవకాశాలు కల్పించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ దేశ కంపెనీలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. దీన్ని తొలగించి వర్ధమాన దేశాలకూ అవకాశాలు లభించేలా మార్కెట్ ద్వారాలు తెరవాలి’ అని ప్రధాని వ్యాఖ్యానిం చారు. జోరుగా వృద్ధిని సాధిస్తున్న భారత్... అమెరికా అనుభవం నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఎంట్రప్రెన్యూర్‌షిప్‌తో పాటు డ్రోన్‌ల నుంచి ఔషధాల దాకా అమెరికా అభివృద్ధి చేసిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉందని చెప్పారు.

‘గత వైభవంతోపాటు అద్వితీయమైన భవిష్యత్తు ఉన్న దేశం అమెరికా. ఇండో-యూఎస్ భాగస్వామ్యం ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా నిలుస్తుందని భావిస్తున్నా. వ్యాపారాలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే విషయంలో మా చర్యలను వేగవంతం చేస్తాం. అంతేకాదు అవినీతికి అడ్డుకట్టవేయడంలోనూ మా ప్రభుత్వం నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంది’ అని మోదీ కార్పొరేట్ అమెరికాకు వివరించారు.

దిలీప్ సంఘ్వీకి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు...
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటు సన్‌ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ దిలీప్ సంఘ్వీ కూడా యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు. భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడంలో నిబద్ధత, చేయూతలకుగాను ఈ పురస్కారాన్ని ఇచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాధిగ్రస్తులకు అత్యంత నాణ్యమైన ఔషధాలను అందించడంపైనే మేం దృష్టిపెట్టాం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాంకేతిక పరిజ్ఞానంలో ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఔషధ ఉత్పత్తులను ప్రపంచానికి అందించేందుకు ఇది మాకు దోహదం చేస్తుంది’ అని సంఘ్వీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆయన పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement