USIBC meeting
-
తెలంగాణది భిన్నమైన ముద్ర
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు మొత్తం భారతదేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలను భిన్న యూనిట్‌గా పరిగణించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. యూఎస్ఐబీసీ ఇన్వెస్ట్మెంట్ వెబ్‌నార్‌లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు, ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు పెట్టుబడి అవకాశాల్లో చాలా తేడా ఉంటుందన్నారు. గత ఆరేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో భిన్నంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో రాష్ట్రం వినూత్న పంథాలో పురోగమిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ విధానం కింద కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల అనుమతులిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ విధానం విజయవంతం అయిందని, అనుమతులు ఇచ్చిన వాటిలో 80 శాతానికి పైగా పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించిందన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కరోనా సంక్షోభంలో ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి అనుకూల వాతావరణం ఉందని, ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైస్ పార్క్ తెలంగాణలో ఉందని, ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇ న్వెస్ట్మెంట్ వెబ్‌నార్‌లో పాల్గొన్న అమెరికన్ కంపెనీల అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా టీ–ఐపాస్ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతుపైన తెలంగాణ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని యూఎస్ఐబీసీ అధ్యక్షురాలు నిషా బిశ్వాల్ తెలిపారు. -
భారత్ కీలకం..
వాషింగ్టన్ : టెక్ దిగ్గజం గూగుల్ కొంగొత్త ఉత్పత్తులు ఆవిష్కరించడంలోనూ, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో వాటిని ప్రవేశపెట్టడంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా భారత్ చాలా భారీ మార్కెట్ కావడంతో ఇక్కడిలాంటి ప్రయోగాలు చేయటం గూగుల్‌కు సాధ్యమవుతోంది. అమెరికా, ఇండియా వ్యాపార మండలి (యూఎస్ఐబీసీ) నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఈ విషయాలు చెప్పారు. పాలనను, సామాజిక.. ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటోందని ఆయన కితాబిచ్చారు. ఇందులో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషదాయకమన్నారు. ‘భారత మార్కెట్ భారీ పరిమాణం కారణంగా ముందుగా అక్కడ కొత్త ఉత్పత్తులు, సాధనాలు రూపొందించేందుకు, ఆ తర్వాత ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు మాకు వీలుంటోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లుగా ఈ ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం భారత్ క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లుతోంది. దీంతో చెల్లింపుల సాధనాలను ప్రవేశపెట్టడానికి భారత్ సరైన మార్కెట్ అని మేం భావించాం. ఇది నిజంగానే మంచి ఫలితాలు కూడా ఇచ్చింది. ఇలా భారత మార్కెట్ కోసం రూపొందించిన సాధనాన్ని ప్రస్తుతం ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి తేవడంపై మా టీమ్ కసరత్తు చేస్తోంది‘ అని పిచయ్ పేర్కొన్నారు. ఫోన్ల ధరలను తగ్గించి, మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తూనే ఉందన్నారు. 2004లో భారత్‌లో రెండు దేశీ తయారీ సంస్థలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 200 పైచిలుకు ఉన్నాయని పిచయ్ చెప్పారు. మరోవైపు, డేటా ప్రైవసీని కాపాడేందుకు అనుసరించాల్సిన ప్రమాణాల రూపకల్పనలో భారత్, అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ వాణిజ్య లావాదేవీలకు సమాచార మార్పిడి స్వేచ్ఛగా జరగడం ప్రధానమని, అయితే అదే సమయంలో యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండటం కూడా ముఖ్యమేనని ఆయన పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా పిచయ్ గ్లోబల్ లీడర్షిప్ పురస్కారాన్ని అందుకున్నారు. భారత్, ఇంగ్లండ్ మధ్యే వరల్డ్ కప్ ఫైనల్స్... ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడే అవకాశాలు ఉన్నాయని పిచయ్ జోస్యం చెప్పారు. భారత జట్టు గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ‘భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ పోరు ఉండొచ్చనుకుంటున్నాను. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా మంచి పటిష్టమైన జట్లే. వాటినీ తక్కువగా అంచనా వేయలేం’ అన్నారాయన. క్రీడల్లో తనకు క్రికెట్ అంటే మక్కువని తెలిపిన పిచయ్.. అమెరికాలో తన క్రికెట్, బేస్‌బాల్ ఆటల అనుభవాలు వెల్లడించారు. ‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో బేస్‌బాల్ ఆడేందుకు ప్రయత్నించాను. అది కాస్త కష్టమైన ఆటే. మొదటి గేమ్‌లో బాల్‌ను గట్టిగా కొట్టా. క్రికెట్లో అలా చేస్తే గొప్ప షాట్ కాబట్టి.. గొప్పగానే ఆడాననుకున్నా. అందరూ వింతగా చూశారు. అలాగే క్రికెట్లో రన్ తీసేటప్పుడు బ్యాట్‌ను వెంట పెట్టుకుని పరుగెత్తాలి. ఇందు లోనూ అలాగే చేశాను.. కానీ తర్వాత తెలిసింది.. బేస్‌బాల్ అనేది క్రికెట్ లాంటిది కాదని. ఏదైతేనేం.. నేను క్రికెట్‌కే కట్టుబడి ఉంటా’ అన్నారు. -
ప్రపంచ వృద్ధికి ఇంజిన్.. భారత్
అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్ ద్వారాలు తెరవాలి ♦ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నాం ♦ వస్తూత్పత్తుల్లోనే కాదు... సేవల్లోనూ మాకు అవకాశమివ్వాలి ♦ భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం... ♦ యూఎస్ఐబీసీ సమావేశంలో మోదీ ఉద్ఘాటన; ఇన్వెస్టర్లకు ఆహ్వానం వాషింగ్టన్: భారత్ వంటి వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తు, సేవల మార్కెట్ల ద్వారాలను పూర్తిగా తెరిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుండి నడిపించే ప్రధాన చోదకంగా (ఇంజిన్) భారత్ నిలుస్తుందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్-ఇండియా వ్యాపార మండలి(యూఎస్ఐబీసీ) వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచానికిప్పుడు ఒక కొత్త వృద్ధి చోదకం కావాలి. అదికూడా ప్రజాస్వామ్య దేశాలైతే మంచిది. భారత్ వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రపంచానికి బహుళ ప్రయోజనాలుంటాయి. అందుకే భారత్ ఈ పాత్ర పోషించబోతోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలు, విధానపరమైన చర్యల కారణంగానే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఆవిర్భవించిందని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమంటూ అమెరికా ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ముఖ్యంగా తయారీ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘భారత్ అంటే కేవలం మార్కెట్ మాత్రమే కాదు. అత్యంత నమ్మకమైన భాగస్వామి. అమెరికా పెట్టుబడులు, సాంకేతికత... భారత్‌కు ఉన్న అపారమైన మానవ వనరులు, పారిశ్రామిక నైపుణ్యాలు కలగలిస్తే ఆ శక్తికి ఎదురుండదు’ అని మోదీ పేర్కొన్నారు. సేవల్లో కూడా అవకాశాలివ్వాలి... ఒక్క వస్తూత్పత్తుల్లోనే కాకుండా సేవల రంగంలో కూడా అభివృద్ధి చెందిన దేశాలు భారత్ వంటి దేశాలకు తమ మార్కెట్లలో పూర్తిగా అవకాశాలు కల్పించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ దేశ కంపెనీలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. దీన్ని తొలగించి వర్ధమాన దేశాలకూ అవకాశాలు లభించేలా మార్కెట్ ద్వారాలు తెరవాలి’ అని ప్రధాని వ్యాఖ్యానిం చారు. జోరుగా వృద్ధిని సాధిస్తున్న భారత్... అమెరికా అనుభవం నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఎంట్రప్రెన్యూర్షిప్తో పాటు డ్రోన్ల నుంచి ఔషధాల దాకా అమెరికా అభివృద్ధి చేసిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉందని చెప్పారు. ‘గత వైభవంతోపాటు అద్వితీయమైన భవిష్యత్తు ఉన్న దేశం అమెరికా. ఇండో-యూఎస్ భాగస్వామ్యం ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా నిలుస్తుందని భావిస్తున్నా. వ్యాపారాలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే విషయంలో మా చర్యలను వేగవంతం చేస్తాం. అంతేకాదు అవినీతికి అడ్డుకట్టవేయడంలోనూ మా ప్రభుత్వం నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంది’ అని మోదీ కార్పొరేట్ అమెరికాకు వివరించారు. దిలీప్ సంఘ్వీకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు... అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటు సన్‌ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ దిలీప్ సంఘ్వీ కూడా యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. భారత్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడంలో నిబద్ధత, చేయూతలకుగాను ఈ పురస్కారాన్ని ఇచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాధిగ్రస్తులకు అత్యంత నాణ్యమైన ఔషధాలను అందించడంపైనే మేం దృష్టిపెట్టాం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాంకేతిక పరిజ్ఞానంలో ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఔషధ ఉత్పత్తులను ప్రపంచానికి అందించేందుకు ఇది మాకు దోహదం చేస్తుంది’ అని సంఘ్వీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆయన పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే.