ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివా (ఫైల్ ఫోటో)
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)భారత వృద్ది అంచనాలను మరోసారి భారీగా కుదించింది. అతి తక్కువ వృద్ధిని అంచనా వేసింది. అలాగే భారతదేశ ఆర్థిక మందగమన పరిస్థితి గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేసిందని సోమవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ది రేటును 4.8 శాతానికి సవరించింది. అంతేకాదు ఇది ప్రతికూల ఆశ్చర్యంగా పక్రటించింది. గత ఏడాది ఇదేకాలంలో ఐఎంఎఫ్ అంచనా 7.5 శాతం. అక్టోబర్‌లో 6.1 శాతానికి తగ్గించింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలలో 0.1 శాతం తగ్గించిన ఐఎంఎఫ్ భారతదేశ ఆర్థిక మందగమనానిదే "సింహభాగం" అని ఐఎంఎఫ్ పేర్కొంది. దీనికి తోడు అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక అశాంతిని తీవ్రతరం చేయడం, అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య సంబంధాలను దెబ్బతీయడం, అలాగే ఇతర దేశాల మధ్య ఆర్థిక ఘర్షణలులాంటివి ప్రముఖంగా ఉన్నాయని తెలిపింది. దేశీయంగా బ్యాంకుయేతర ఆర్థిక రంగంలో ఒత్తిడి ,రుణ వృద్ధి క్షీణత, దేశీయ వినిమయ డిమాండ్ ఊహించిన దానికంటే చాలా మందగించిందని వ్యాఖ్యానించింది. ఇదే వృద్ధి రేటును తగ్గించడానికి కారణమని తెలిపింది. మరోవైపు జపాన్ వృద్దిరేటును అంచనాలను బాగా పెంచింది ఐఎంఎఫ్. ప్రధానంగా జపాన్ ప్రధాని షింజో అబే గత నెలలో ప్రకటించిన స్టిములస్ ప్యాకేజీ కారణంగా వృద్ధి పురోగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2020 నాటికి 0.7శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. గత అక్టోబరు లో ఇది 0.5 శాతంగా మాత్రమే వుంటుందని అంచనావేసింది.
అలాగే అమెరికా-చైనా ట్రేడ్‌డీల్ కారణంగా చైనా వృద్ది రేటుకు పైకి సవరించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఒక శాతం పెరిగి 5.8 శాతంగా ఉండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ వుంటుందని తెలిపింది. 6.5 శాతం వృద్ధి రేటుతో చైనా (5.8 శాతం)ను అధిగమించి 2021 లో భారత్ మొదటి స్థానంలో నిలబడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దృక్పథాన్ని స్వల్పంగా క్రిందికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్దిపై కొత్త అంచనాలు 2019 లో 2.9 శాతం, 2020 లో 3.3 శాతం, 2021 లో 3.4 శాతం వృద్ధినగా వుంచింది.. భారతదేశ ఆర్థిక వృద్ధి క్షీణత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందని అభిప్రాయపడింది. అయితే దేశ వృద్ది 2020లో 5.8 శాతంగాను, 2021లో 6.5 శాతానికి మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభోత్సవానికి ముందు, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ వృద్ధి మళ్లీ మందగించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరూ మళ్లీ సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అయితే అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద పరిణామాలతో అక్టోబర్ నుంచి కొన్ని నష్టాలు పాక్షికంగా తగ్గాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తుండగా, ఐరాస 5.7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment