ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు.
► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది.
► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం.
► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది.
► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది.
► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి.
► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు.
► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది.
► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది.
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
Published Thu, Nov 10 2022 4:56 AM | Last Updated on Thu, Nov 10 2022 4:56 AM
Comments
Please login to add a commentAdd a comment