ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7%
15 నెలల కనిష్ట స్థాయి ఇది..
వ్యవసాయం, సేవా రంగాల పేలవ పనితీరు
2023 ఇదే కాలంలో వృద్ధి రేటు 8.2 శాతం
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతంగా నమోదయ్యింది. గడచిన 15 నెలల కాలంలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎకానమీ 6.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వ్యవసాయం, సేవా రంగాల పేలవ పనితీరు తాజా లెక్కలపై ప్రభావం చూపినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) డేటా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం. తాజా సమీక్షా కాలానికి ముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రేటు 7.8 శాతం.
6.7 శాతం వృద్ధి ఎలా అంటే..
2024–25 తొలి త్రైమాసికంలో 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని మదింపుచేసే జీడీపీ విలువ రూ.43.64 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఇది రూ.40.91 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 6.7 శాతమన్నమాట. ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికకాకుండా, ప్రస్తుత ధరల ప్రకారం పరిశీలిస్తే, 2023 ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ విలువ 9.7 శాతం వృద్ధితో రూ.70.50 లక్షల కోట్ల నుంచి రూ.77.31 లక్షల కోట్లకు ఎగసింది.
‘వృద్ధి వేగంలో టాప్’ ట్యాగ్ యథాతథం
ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదయ్యింది. ఈ కాలంలో ప్రపంచంలోనే మరేదేశమూ 6.7 శాతం వృద్ధి రేటును అందుకోలేకపోవడంతో, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటు విషయంలో భారత్ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నట్లయ్యింది.
జీవీఏ వృద్ధి 6.8 శాతం
ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి రేటు 2023–24 చివరి త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదయితే, 2024–25 మొదటి త్రైమాసికంలో అరశాతం పెరిగి 6.8 శాతంగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే జీవీఏ విలువ రూ.38.12 లక్షల కోట్ల నుంచి రూ.40.73 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 6.8 శాతం వృద్ధి రేటుకాగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.3 శాతం. వివిధ రంగాల వృద్ధి తీరును స్థూలంగా జీవీఏ ప్రాతిపదికన పరిశీలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment