అప్పటికి 7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భావం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనా 6.8 శాతం
క్రిసిల్ రేటింగ్స్ నివేదిక
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతంగా క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే 2031 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయికి రెట్టింపై దాదాపు 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని.. తద్వారా ఎగువ మధ్య–ఆదాయ దేశంగా మారుతుందని క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది.
నిర్మాణాత్మక సంస్కరణలు తదితర సానుకూల ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఎకానమీ 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2024–25 నుంచి 2030–31) భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ కాలంలో ఎకానమీ సగటును 6.7 శాతం పురోగమిస్తుందని అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఐదవ స్థానంలో..
25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎనానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు.
4,500 డాలర్లకు తలసరి ఆదాయం..
2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరుగుతుంది. దీనితో దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్‌లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకా రం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డా లర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పే ర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
తయారీ, సేవల రంగాల్లో మంచి అవకాశాలు...
దేశీయ, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా తయారీ– సేవల రంగాలు రెండింటికీ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 2025–2031 ఆర్థిక సంవత్సరాల మధ్య తయారీ– సేవల రంగాలు వరుసగా 9.1 శాతం, 6.9 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని మేము అంచనా వేస్తున్నాము. తయారీ రంగం ద్వారా కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, సేవా రంగం భారతదేశ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తుంది.
– ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్
Comments
Please login to add a commentAdd a comment