న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదయ్యింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండవ అడ్వాన్స్ అంచనాలు 7 శాతం కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు చక్కటి పనితీరును ప్రదర్శించినట్టు బుధవారం విడుదలైన గణాంకాలు వెల్లడించాయి.
చైనా వృద్ధి రేటు చివరి త్రైమాసికంలో 4.5 శాతంగా నమోదయ్యింది. దీనితోపాటు ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను పోల్చితే భారత్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. తాజా గణాంకాలతో గణనీయమైన పురోగతితో వార్షికంగా 3.3 ట్రిలియన్ డాలర్లకు ఎగసిన ఎకానమీ విలువ వచ్చే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
జీడీపీ లెక్కలు ఇలా..
2011–12 స్థిర ధరల వద్ద (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసి) 2021–22 జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.41.12 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో (2022–23 జనవరి–మార్చి) ఈ విలువ రూ.43.62 లక్షల కోట్లు. వెరసి నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.1 శాతమన్నమాట. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరంలో చూస్తే... ఈ విలువలు 2021–22తో పోల్చిచూస్తే 2022–23లో రూ.149.26 లక్షల కోట్ల నుంచి రూ.160.06 లక్షల కోట్లకు పెరిగాయి. వెరసి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. 2021–22లో వృద్ధి రేటు 9.1 శాతం అయినప్పటికీ, బేస్ తక్కువగా ఉండడం (2020–21లో కరోనా కష్టకాలంలో వృద్ధిరేటు భారీగా పడిపోవడం) దీనికి ప్రధాన కారణం. అయితే 2021–22 చివరి త్రైమాసికం 4 శాతంతో పోల్చితే తాజా లెక్కలు మెరుగ్గా ఉండడం గమనార్హం.
జీవీఏ లెక్క ఇదీ...
కేవలం వివిధ రంగాల ఉత్పత్తి విలువకు సంబంధించిన– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి రేటు 2022–23లో 7%గా ఉంది. 2021–22లో రేటు 8.8 శాతం. జీవీఏ ప్రకారం మార్చి త్రైమాసికం వృద్ధి రేటు పరిశీలిస్తే...
► తయారీ రంగం పురోగతి 2021–22 మార్చి త్రైమాసికంలో 0.6% ఉంటే, 2022–23 మార్చి త్రైమాసికంలో 4.5%గా నమోదయ్యింది.
► మైనింగ్ ఉత్పత్తి వృద్ధి ఇదే కాలంలో 2.3 శాతం నుంచి 4.3 శాతానికి ఎగసింది.
► నిర్మాణ రంగం విషయంలో భారీగా 4.9 శాతం నుంచి 10.4 శాతానికి చేరింది.
► వ్యవసాయ రంగం పురోగతి 4.1 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది.
2022–23 వృద్ధి (%)
క్యూ1 13.1
క్యూ2 6.2
క్యూ3 4.5
క్యూ4 6.1
సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది
ప్రపంచ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.2 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసుకోవడం హర్షణీయ పరిణామం. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, సూచీల దృఢమైన పనితీరును, ఆశాజనక పరిస్థితిని గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.
– ప్రధాని నరేంద్ర మోదీ
అంచనాలకు మించి..
తాజా ఆర్థిక పురోగతిని పరిశీలిస్తే, ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ తొలి 6.5% అంచనాలను మించి వృద్ధి సాధించే అవకాశా లు కనిపిస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనాలను మించి 2022–23 ఎకానమీ గణాంకాలు నమోదుకావడం భారత్ సవాళ్లను ఎదుర్కొనగలిగిన పరిస్థితికి అద్దం పడుతోంది.
– వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ
Comments
Please login to add a commentAdd a comment