Kristalina Georgieva
-
ప్రపంచ ఎకానమీలో భారత్ వెలుగులు
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ‘‘ప్రకాశవంతమైన ప్రాంతం‘గా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జివా అన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని భారత్‌లో పర్యటించనున్న ఆమె అంచనా వేశారు. కరోనా మహమ్మారి సమస్య నుంచి ప్రపంచంలోని ఐదవ–అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ‘‘డిజిటలైజేషన్’’ బయటపడవేయగలిగిందన్నారు. దీనికితోడు దేశం అనుసరిస్తున్న వివేకవంతమైన ఆర్థిక విధానం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో మూలధన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ (33 శాతం పెంపుతో రూ.10 లక్షల కోట్లకు) బడ్జెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం దేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని జార్జివా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు తెలిపిన అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► 2022–23లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.1%గా ఉంటుందన్నది మా అభిప్రాయం. ఆయా గణాంకాలు దేశాన్ని ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుపుతాయి. ► ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధి అభినందనీయం. ► భారత్ ఎకానమీ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలాగా కాస్త నెమ్మదించినప్పటికీ, ప్రపంచ సగటు కంటే, భారత్ వృద్ధి వేగం ఎక్కువగా ఉంది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా దాదాపు 15 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► దేశాన్ని ‘గ్రీన్ ఎకానమీ’ వైపు మళ్లించడానికి, తద్వారా వృద్ధిని కొనసాగించడానికి పునరుత్పాదక ఇంధనాలతో సహా వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడంపై భారతదేశం ఎంత శ్రద్ధ కనబరుస్తోందో నేను ప్రత్యేకంగా గమనించాను. -
ద్రవ్యోల్బణంపై పోరు తప్పదు!
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపు తప్పుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలిన్ జార్జివా హెచ్చరించారు. అసాధారణమైన ఆర్థిక సంక్షోభ సమయంలో మరింత బాధను కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా విధాన నిర్ణేతలు ద్రవ్యోల్బణంపై పోరు సల్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశం నేపథ్యంలో ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒకదాని తర్వాత మరొ కటి షాక్‌లు తగులుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత అన్నీ సమస్యాత్మకమే. ► ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన అంశం. మనం ధర స్థిరత్వాన్ని పునరుద్ధరించలేకపోతే, వృద్ధి అవకాశాలకూ విఘాతం కలుగుతుంది. ప్రత్యేకించి పేద ప్రజల జీవనం మరింత సంక్షోభంలోకి వెళుతుంది. ► మహమ్మారితో పోరాడిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ఆహార కొరత లేకుండా చేయడం, ఇంధన వ్యయాల కట్టడి, పేద వారికి సహాయం చేయడంపై తక్షణం దేశాలు దృష్టి పెట్టాలి. విస్తృత వ్యయ కార్యక్రమాలపై ఇప్పుడు ప్రణాళికలు సరికాదు. విధాన చర్యలు పటిష్టం లక్ష్యంతో సాగాలి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పోటీ రాజకీయ కూటములతో ‘విచ్ఛిన్నం’ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాల చెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది. రేటు పెంపు వల్ల అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించలేం. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఐక్యతా ప్రయోజనాలను మనం కోల్పోతే, మనమందరం పేదలుగా ఉండే అవకాశం ఉంది. -
భళా భారత్! ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జీవా ప్రశంసల వర్షం!
భారత్ అధిక వృద్ధి రేటు ఆ దేశానికి మాత్రమే ఆరోగ్యకరం కాదని.. మొత్తం ప్రంపచానికే సానుకూలమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టలీనా జార్జీవా అన్నారు. 2022లో భారత 8.2 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని, అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్ ఈ వారం మొదట్లోనే అంచనాలు ప్రకటించింది. 2022లో అంతర్జాతీయ వృద్ధి రేటు 3.6 శాతానికి తగ్గించింది. 2021లో ఈ అంచనాలు 6.1 శాతంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధిక ఇంధన, కమోడిటీల ధరల నేపథ్యంలో ఐఎంఎఫ్ అంచనాలు తగ్గించడం గమనార్హం. ‘‘అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కొంత క్షీణత ఉన్నప్పటికీ. ఈ ఏడాదికి వృద్ధి రేటును 8.2 శాతంగా అంచనా వేయడం జరిగింది. ఇది ఇండియాకు ఆరోగ్యకరం. అంతేకాదు, వృద్ధి మందగమనాన్ని చూస్తున్న ప్రపంచానికి కూడా మంచిదే’’ అని జార్జీవా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా భారత్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కరోనా సంక్షోభంలో టీకాలను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘భారత్ అంతర్జాతీయ సోలార్ కూటమితో కలసి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకునేందుకు కట్టుబడి ఉంది. డిజిటల్ కరెన్సీల్లో, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ విషయంలో ముందున్న దేశం. భారత ప్రజలు, వ్యాపారాలకు క్రిప్టో రిస్క్‌లను తగ్గించడంలోనూ చొరవ చూపిస్తోంది. వచ్చే ఏడాది జీ20 సమావేశానికి అధ్యక్షత వహించే భారత్‌తో కలసి ఎన్నో అంశాల విషయంలో పనిచేయాలనుకుంటున్నాం’’అని జార్జీవా చెప్పారు. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలదు కరోనా సంక్షోభం సమయంలో భారత్ అనుసరించిన స్థూల ఆర్థిక నిర్వహణ విజయవంతం కావడంతో వృద్ధి పరంగా వేగంగా కోలుకుందని ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ (భారత్) నదాచౌరీ పేర్కొన్నారు. ఫలితంగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 7 శాతం వాటా పోషిస్తుండడం, కొనుగోలు శక్తికితోడు వేగంగా వృద్ధి చెందుతుండడాన్ని ప్రస్తావించారు. కరోనా సమయంలో ఎన్నో కీలకమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. -
ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ గుడ్‌బై
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా వ్యవహరిస్తున్న గీతా గోపీనాథ్ (49) వచ్చే ఏడాది పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన గీతా గోపీనాథ్ .. ఐఎంఎఫ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్ యూనివర్సిటీ పొడిగించడంతో మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో కొనసాగారు. తాజాగా అదే వర్సిటీకి తిరిగి రానున్నారు. గీతా గోపీనాథ్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. ‘ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ అందించిన సేవలు అసమానమైనవి. ఫండ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు. గీతా గోపీనాథ్ మేధస్సు, అంతర్జాతీయ ఫైనాన్స్.. స్థూలఆరి్థకాంశాలపై ఆమెకున్న అపార అవగాహన, ఐఎంఎఫ్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రభావవంతమైన పనితీరుతో ఆమె అందరి అభిమానం, గౌరవం చూరగొన్నారు‘ అని జార్జియేవా పేర్కొన్నారు. తన విధుల నిర్వహణలో సహకరించినందుకు సహోద్యోగులకు గీతా గోపీనాథ్ ధన్యవాదాలు తెలిపారు. టీకాల ఊతంతో కోవిడ్–19 మహమ్మారిని అంతమొందించేందుకు తీసుకోతగిన చర్యలపై రూపొందించిన ’పాండెమిక్ పేపర్’కు ఆమె సహరచయితగా వ్యవహరించారు. ఇందులోని ప్రతిపాదనలకు అనుగుణంగా అల్పాదాయ దేశాలకు కూడా టీకాలను చేర్చేందుకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర ఏజెన్సీలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయని ఐఎంఎఫ్ పేర్కొంది. మైసూరు నుంచి అమెరికా వరకు... గీతా గోపీనాథ్ 1971లో మైసూరులో జన్మించారు. మలయాళీ కుటుంబ నేపథ్యం గల గీతా గోపీనాథ్ కోల్‌కతాలో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం, ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లోను, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మాస్టర్స్ చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీ వంటి దిగ్గజాల గైడెన్స్‌తో 2001లో ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన గీతా గోపీనాథ్ 2005లో హార్వర్డ్‌కు మారారు. 2010లో టెన్యూర్డ్ ప్రొఫెసర్ (దాదాపు పర్మనెంట్ స్థాయి) గా పదోన్నతి పొందారు. హార్వర్డ్ చరిత్రలో ఈ గౌరవం దక్కించుకున్న మూడో మహిళగాను, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తర్వాత తొలి భారతీయురాలిగాను ఆమె ఘనత సాధించారు. -
చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం
డబ్ల్యూటీవో రూల్స్‌ను విస్మరించి.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే చైనా అత్యాశ వాళ్ల పీకకే చుట్టుకుంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో పైరవీల ద్వారా మెరుగైన ర్యాంక్ సంపాందించిన వ్యవహారం బట్టబయలు కావడంతో చైనా నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68)కు పదవీగండం పట్టుకుంది. గతంలో చైనాకు ఊడిగం చేశారన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో ఆమె పాత్ర దాదాపు ఖరారైనట్లే!. దీంతో ఆమెను కొనసాగించడమా? తీసేయడమా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డు చేతుల్లో ఉంది. చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారని, డేటాను మార్చేశారని క్రిస్టలీనా (ఆ టైంలో ఆమె సీఈవోగా ఉన్నారు) ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్ హస్తం ఉందని తేలింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారం ఆరోపణలపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేసింది. మరోవైపు విల్‌మెర్‌హేల్ లీగల్ సంస్థ దర్యాప్తులోనూ ఆమెపై ఆరోపణలు నిజమని నిరూపితంకాగా, గురువారం ఆ ఆరోపణల్ని ఖండిస్తూ ఐఎంఎఫ్ బోర్డ్ మెంబర్స్‌కు లేఖ రాసింది క్రిస్టలీనా. పైగా ఫ్రాన్స్, యూరోపియన్ దేశాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ తరుణంలో తొందరపాటు నిర్ణయంగా కాకుండా.. ఆమెను పదవిలో కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునేందుకు సోమవారం నుంచి వరుస భేటీలు కానున్నాయి వరల్డ్‌బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డులు. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. చైనా 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ చైనా ఫేక్ ర్యాంకులు దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు సంస్థ వెల్లడించిన అంశం. చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా! -
ప్రజారోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలి
వాషింగ్టన్: కోవిడ్–19 మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ తక్షణం ప్రజారోగ్యం, పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు. అలాగే లఘు, చిన్న మధ్య తరహా ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆయా సంస్థలను వ్యాపార పరంగా కుప్పకూలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. ఆయా చర్యలతో దీర్ఘకాలంలో దేశాన్ని వృద్ధి బాటలో విజయవంతంగా నడిపించవచ్చని విశ్లేషించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సదస్సు నేపథ్యంలో ఎండీ మీడియాను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రపంచదేశాలన్నీ ఆరోగ్య రంగంపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గట్టెక్కితే ఎన్నో అవరోధానాలు అధిగమించవచ్చు. అనిశ్చితి, అసంపూర్తి ఆర్థిక రికవరీ పరిస్థితుల నుంచీ బయటపడవచ్చు. ► కోవిడ్–19... ప్రపంచ మానవాళికి ఒక సంక్షోభం. భారత్‌సహా పలు దేశాల్లో మృతుల సంఖ్య తీవ్రంగా ఉంటోంది. ► సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి భారత్ తన శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తోంది. ప్రత్యక్ష్య ద్రవ్య పరమైన చర్యలు లేకపోయినా, ఉద్దీపనలతో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కృషి చేస్తోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న కొన్ని దేశాల ఉద్దీపనలతో పోల్చితే ఇది తక్కువే. గణనీయమైన ఉద్దీపనలను అందించడంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు పరిమితులు ఉన్నాయి. 2020లో 10.3 శాతం క్షీణిస్తుందని అంచనావేసిన ఐఎంఎఫ్, అయితే 2021లో దేశం 8.8 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని ఇప్పటికే విశ్లేషించింది. తద్వారా తిరిగి వేగంగా వృద్ధి చెందుతున్న హోదాను దక్కించుకుంటుందని పేర్కొంది. ► కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డానికి ప్రపంచదేశాలు తగిన పటిష్ట ఆర్థిక చర్యలను తీసుకోవాలి. అయితే ఇలాంటి పటిష్ట ఆర్థిక మూల స్తంభాలను కష్టాలు రావడానికి ముందే నిర్మించుకోవాలి. ఇది మనకు కరోనా తాజాగా నేర్పిన పాఠం. ‘బ్రెట్టన్ వుడ్స్’ తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రపంచం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచం కొత్తగా ‘బ్రెట్టన్ వుడ్స్ సమావేశం’ నాటి స్థితిగతులను ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ ఎండీ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భవిష్యత్ ఘర్షణల నివారణ, పరస్పర ఆర్థిక సహకారం లక్ష్యంగా పటిష్టమైన ప్రపంచస్థాయి సంస్థలు, ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు 1944లో అమెరికా, న్యూ హ్యాంప్‌షైర్, కారోల్లోని బ్రెట్టన్ వుడ్స్ ప్రాంతంలో మిత్రపక్ష దేశాలు జరిపిన సమా వేశం అదే ప్రాంతం పేరుతో ప్రసిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నిలబెట్టడానికి పటిష్ట చర్యలు అవసరమని పేర్కొంటూ, ‘‘ప్రస్తుతం మనం బ్రెట్టన్ వుడ్స్ తరహా పరిస్థితిన ఎదుర్కొంటున్నాం. మహమ్మారి లక్షలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.4 శాతం క్షీణతలోకి జారే పరిస్థితి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 11 ట్రిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తి నష్టపోతున్నామన్న అంచనా ఉంది. దశాబ్ద కాలాల్లో మొట్టమొదటిసారి లక్షలాదిమంది పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. మానవాళికి తీవ్ర సంక్షోభ పరిస్థితి ఇది. ఇప్పుడు మన ముందు రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి కరోనాతో పోరాటం. రెండు అత్యుత్తమైన రేపటిరోజును నేడు నిర్మించుకోవడం. ఈ దిశలో వృద్ధి, ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల జరగాలి. ఇందుకు పటిష్ట ఆర్థిక విధానాలు, సంస్థలు అవసరం. ప్రపంచ దేశల పరస్పర సహకారం ఇక్కడ ఎంతో కీలకం’’ అని సదస్సును ఉద్దేశించి ఐఎంఎఫ్ ఎండీ అన్నారు. ‘వీ’ నమూనా వృద్ధి కనిపిస్తోంది: నిర్మలా సీతారామన్ ఇదిలావుండగా, ఐఎంఎఫ్ మంత్రిత్వస్థాయి కమిటీ అయిన అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంఘం (ఐఎంఎఫ్సీ) వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడారు. భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి పలు విభాగాల్లో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి కనబడుతోందని ఈ సందర్భంగా వివరించారు. దేశ ఆర్థిక పురోగతికి భారత్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐఎంఎఫ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. -
రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్ : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (57) కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది. ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న తమ సభ్యదేశాలను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానాల రూపకల్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగ్రశ్రేణి నిపుణుల సలహాలు తమకిపుడు చాలా అవసరం అని ఆమె చెప్పారు. వీరంతా తమ అమూల్య సేవలను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీలక పరిణామాలు, ఇతర విధి విధానాలపై ఈ టీం సూచనలు చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు కమిటీలో వున్నారు. (కరోనా : శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం) కాగా కోవిడ్-19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్నిఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. (దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్) నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా, కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం -
మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. కరోనా వైరస్ కారణంగా 1930 తీవ్ర మాంద్యం తర్వాత మరో విడత అటువంటి తీవ్ర పరిస్థితులు 2020లో రానున్నాయని, 170 దేశాలలో తలసరి ఆదాయం వృద్ధి మైనస్‌లోకి వెళ్లిపోవచ్చన్నారు. వాషింగ్టన్లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రాధాన్యతలు’ అనే అంశంపై జార్జీవా మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం ఇంతకుముందెన్నడూ లేనటువంటి సంక్షోభంతో పోరాడుతోంది. కరోనా వైరస్ కాంతి వేగంతో మన సామాజిక, ఆర్థిక క్రమాన్ని అస్తవ్యస్తం చేసింది. మన జీవిత కాలంలో గుర్తున్నంత వరకు ఈ స్థాయి ప్రభావాన్ని చూడలేదు’’ అని జార్జీవా పేర్కొన్నారు. వైరస్‌పై పోరాడేందుకు లాక్డౌన్ అవసరమని, ఇది వందల కోట్ల ప్రజలపై ప్రభావం చూపిస్తోందన్నారు. ప్రపంచం అసాధారణ అనిశ్చితిని చవిచూస్తోందని, ఈ సంక్షోభం తీవ్రత, ఎంత కాలం కొనసాగేదీ తెలియడం లేదని పేర్కొన్నారు. ఫలితంగా 2020లో ప్రపంచ వృద్ధి ప్రతికూల దశలోకి వెళ్లిపోతుందన్నది స్పష్టమన్నారు. వర్ధమాన దేశాలకు ట్రిలియన్ డాలర్ల నిధుల సాయం అవసరమని, ఇందులో ఆయా దేశాలు కొంత వరకే సమకూర్చుకోగలవని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ద్రవ్యపరమైన చర్యలు 8 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆమె తెలిపారు. -
మాంద్యం వచ్చేసింది..
వాషింగ్టన్: కరోనా కారణంగా ప్రపంచం మాం ద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియేవా స్పష్టం చేశారు. 2009 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకున్నాయన్నది సుస్పష్టం. ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా నిల్చిపోవడంతో వర్ధమాన మార్కెట్ల ఆర్థిక అవసరాలకు 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐఎంఎఫ్ అంచనా. ఇది కనీస స్థాయి మాత్రమే. ఇంతకు మించే అవసరం ఉండవచ్చు‘ అని ఆమె తెలిపారు. -
మందగమనం తాత్కాలికమే..
దావోస్ (స్విట్జర్లాండ్): భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. శుక్రవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అమెరికా–చైనా మధ్య తొలి దశ ఒప్పందంతో తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, సమకాలిక పన్ను కోతలు తదితర అంశాలు సానుకూల పరిస్థితులకు దారితీసినట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 3.3 శాతం వృద్ధి రేటు అన్నది అద్భుతమేమీ కాదన్నారు. ‘‘ఇప్పటికీ వృద్ధి నిదానంగానే ఉంది. అయితే పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరింత దూకుడైన ద్రవ్య విధానాలు అవసరం. నిర్మాణాత్మక సంస్కరణలు కావాలి. మరింత చైతన్యం కావాలి’’ అని జార్జీవా పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లలో ఒక్క భారత మార్కెట్‌నే తాము డౌన్‌గ్రేడ్ చేశామని, అది కూడా తాత్కాలికమేనని చెప్పారు. రానున్న కాలంలో పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. వర్ధమాన దేశాల్లో ఇండోనేషియా, వియత్నాంను ఆశాకిరణాలుగా పేర్కొన్నారు. చాలా ఆఫ్రికా దేశాలు కూడా మంచి పనితీరు చూపిస్తున్నాయని, అదే సమయంలో మెక్సికో వంటి దేశాల పనితీరు ఆశావహంగా లేదన్నారు. తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం, దీర్ఘకాలంగా తయారీ వృద్ధి బలహీనంగా ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా ఆమె పేర్కొన్నారు. ఎన్నో అంశాలపై ప్రగతి... డబ్ల్యూఈఎఫ్ 50 వార్షిక సదస్సు విశేషమైనదిగా సంస్థ ప్రెసిడెంట్ బోర్గేబ్రెండే పేర్కొన్నారు. ఎన్నో అంశాలపై ప్రగతిని సాధించినట్టు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ/ప్రైవేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. 2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు. టాటా స్టీల్‌కు డబ్ల్యూఈఎఫ్ గౌరవం గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో చేరినందుకు టాటా స్టీల్ కళింగనగర్ను డబ్ల్యూఈఎఫ్ సత్కరించింది. టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ అవార్డును అందుకున్నట్టు కంపెనీ తెలిపింది. గోయల్ కీలక భేటీలు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా శుక్రవారం పలు కీలక నేతలతో చర్చలు జరిపారు. సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్ రాబర్టో అజవేదోతో చెప్పారు. ఈయూ వాణిజ్య కమిషనర్ ఫిల్ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్ స్పెన్స్, బ్లాక్‌స్టోన్ గ్రూపు చైర్మన్ ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్ పీటర్ వోసర్ తదితరులతోనూ గోయల్ చర్చించారు. ప్రపంచ వృద్ధి అంచనాలు సవరణ సవరించిన ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసింది. 2019 సంవత్సరానికి వృద్ధి రేటు 2.9 శాతానికి సవరించిం ది. 2020లో ఇది 3.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2021లో 3.4 శాతానికి పెరుగు తుందని అంచనా వేసింది. -
నోట్ల రద్దు భారత్‌కు మంచిదే: ప్రపంచబ్యాంకు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తుందని, దానివల్ల అవినీతి కూడా అంతం అవుతుందని ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టలీనా జార్జియెవా అన్నారు. ఎక్కువగా నగదుతో కూడిన ఆర్థికవ్యవస్థలో ఉంటున్న ప్రజలకు పెద్దనోట్ల రద్దు వల్ల కొన్ని కష్టాలు ఎదురై ఉండచ్చని, అయితే దీర్ఘకాలంలో మాత్రం దీనివల్ల స్వచ్ఛమైన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. భారతదేశం చేసిన ప్రయోగాన్ని ఇతర దేశాలు గమనిస్తున్నాయని, ఇంత పెద్ద దేశంలో ఎప్పుడూ ఇలా నోట్లను రద్దు చేయలేదని ఆమె చెప్పారు. భారతదేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల నెలల తరబడి డబ్బులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర కష్టాల పాలవ్వాల్సి వచ్చింది. అయితే దానివల్ల దేశంలో అవినీతి గణనీయంగా తగ్గుతుందని జార్జియెవా అన్నారు. యూరోపియన్ యూనియన్ కూడా క్రమంగా పెద్దనోట్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, అయితే వాళ్లు ఒక్కసారిగా కాకుండా దీర్ఘకాలంలో దశలవారీగా చేస్తారని ఆమె చెప్పారు. వ్యాపారాలపై కూడా కొంత కాలం పాటు నోట్ల రద్దు వల్ల ప్రతికూల ప్రభావం కనిపించిందని, దీర్ఘకాలంలో మాత్రం భారతదేశం చేపట్టిన ఈ సంస్కరణలు మంచి ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన జార్జియెవా.. ముంబైలో లోకల్ రైల్లో ప్రయాణించడమే కాక, ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కూడా పర్యటించారు. మెరుగైన జీవితం కోసం ప్రజలు చాలా ఆతృతగా ఉన్నారని, మెరుగైన సేవల కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా కనపడుతున్నారని ఆమె అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగు పరుచుకోడానికి రాష్ట్రాల మధ్య పోటీ కూడా ఆరోగ్యకరంగా ఉందని ప్రశంసించారు. భారతదేశంలో ఈసారి వృద్ధిరేటు 7 శాతం ఉండొచ్చని తాము భావిస్తున్నామని, జీఎస్టీ అమలైతే ఆర్థికవృద్ధి మరింత వేగంగా ఉంటుందని తెలిపారు.