భారత్ అధిక వృద్ధి రేటు ఆ దేశానికి మాత్రమే ఆరోగ్యకరం కాదని.. మొత్తం ప్రంపచానికే సానుకూలమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టలీనా జార్జీవా అన్నారు. 2022లో భారత 8.2 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని, అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్ ఈ వారం మొదట్లోనే అంచనాలు ప్రకటించింది.
2022లో అంతర్జాతీయ వృద్ధి రేటు 3.6 శాతానికి తగ్గించింది. 2021లో ఈ అంచనాలు 6.1 శాతంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధిక ఇంధన, కమోడిటీల ధరల నేపథ్యంలో ఐఎంఎఫ్ అంచనాలు తగ్గించడం గమనార్హం. ‘‘అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కొంత క్షీణత ఉన్నప్పటికీ. ఈ ఏడాదికి వృద్ధి రేటును 8.2 శాతంగా అంచనా వేయడం జరిగింది. ఇది ఇండియాకు ఆరోగ్యకరం. అంతేకాదు, వృద్ధి మందగమనాన్ని చూస్తున్న ప్రపంచానికి కూడా మంచిదే’’ అని జార్జీవా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా భారత్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కరోనా సంక్షోభంలో టీకాలను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
‘‘భారత్ అంతర్జాతీయ సోలార్ కూటమితో కలసి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకునేందుకు కట్టుబడి ఉంది. డిజిటల్ కరెన్సీల్లో, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ విషయంలో ముందున్న దేశం. భారత ప్రజలు, వ్యాపారాలకు క్రిప్టో రిస్క్‌లను తగ్గించడంలోనూ చొరవ చూపిస్తోంది. వచ్చే ఏడాది జీ20 సమావేశానికి అధ్యక్షత వహించే భారత్‌తో కలసి ఎన్నో అంశాల విషయంలో పనిచేయాలనుకుంటున్నాం’’అని జార్జీవా చెప్పారు.
సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలదు
కరోనా సంక్షోభం సమయంలో భారత్ అనుసరించిన స్థూల ఆర్థిక నిర్వహణ విజయవంతం కావడంతో వృద్ధి పరంగా వేగంగా కోలుకుందని ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ (భారత్) నదాచౌరీ పేర్కొన్నారు. ఫలితంగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 7 శాతం వాటా పోషిస్తుండడం, కొనుగోలు శక్తికితోడు వేగంగా వృద్ధి చెందుతుండడాన్ని ప్రస్తావించారు. కరోనా సమయంలో ఎన్నో కీలకమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment