దేశానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా, అమెరికా పర్యటనకు నిర్మలా సీతారామన్‌ | Nirmala Sitharaman Will Visit Usa For Investment To India | Sakshi
Sakshi News home page

దేశానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా, అమెరికా పర్యటనకు నిర్మలా సీతారామన్‌

Published Tue, Oct 11 2022 7:34 AM | Last Updated on Tue, Oct 11 2022 7:37 AM

Nirmala Sitharaman Will Visit Usa For Investment To India - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్న ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశాల్లో ఆమె పాల్గొంటారు.

ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా (అక్టోబర్‌ 11–16) సీతారామన్‌ జీ–20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్లు, వ్యాపార వేత్తలు, ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. అమెరికా ఆర్థికమంత్రి జనెత్‌ ఎలెన్, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మెల్‌పాస్‌లతో ఆమె వేర్వేరుగా సమావేశం కానున్నారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.  భారత్‌ ఆర్థిక ప్రయోజనాలు, దేశానికి భారీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా అర్థికమంత్రి అమెరికా యాత్ర జరగనున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  

జీ–20 ఆర్థికమంత్రులతో సమావేశాలు.. 
జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, భూటాన్, న్యూజిలాండ్, ఈజిప్ట్, జర్మనీ, మారిషస్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ), ఇరాన్, నెదర్లాండ్స్‌సహా పలు దేశాల మంత్రులతో  ద్వైపాక్షిక సమావేశాలు కూడా మంత్రి పర్యటనలో భాగంగా ఉన్నాయి. ఓఈసీడీ, యూరోపియన్‌ కమిషన్, యూఎన్‌డీపీల చీఫ్‌లతో ఆమె భేటీ కానున్నారు.  

పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి,  వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ‘భారత ఆర్థిక అవకాశాలు –ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాత్ర’ అన్న అంశంపై జరిగే సదస్సులో పాల్గొననున్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్‌ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతలను తీసుకోనుంది. డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్‌ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి జీ–20 ఆర్థికమంత్రులతో జరుపుతున్న సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.  

కీలకం కానున్న ఐఎంఎఫ్‌ కోటా  
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని భారత్‌ స్పష్టం చేస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో ఈ బహుళ జాతి సంస్థ వార్షిక సమావేశం జరగడం మరో విశేషం.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని ఆర్థికమంత్రి  సీతారామన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.  ఐఎంఎఫ్‌ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్‌ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం.

ఐఎంఎఫ్‌ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్‌ 15వ తేదీలోపు ముగియాలి.  వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దు బాటు జరగాలని, వాటి ఓటింగ్‌ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement