పెట్టుబడులపై 15–20 రెట్ల ప్రతిఫలం
అమెరికా ఇన్వెస్టర్లకు కేవీ సుబ్రమణియన్ సూచన
వాషింగ్టన్: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్‌లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు.
వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో.. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం.
భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువ..
భారత బ్యాంక్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్ సూచించారు. అమెరికాలో కంటే భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్‌లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్‌లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్‌లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment