opportunities
-
వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయని ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి అన్నారు. సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ సాయంతో ఇందుకు అనుకూలమైన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ రంగంలో ఉత్పాదకత, నాణ్యత పెరగాలంటూ, అదే సమయంలో వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ పురి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందంటూ.. ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడానికి ఇలాంటి అంశాలే కారణమని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. వారితో మనం ఏ విధంగా కలసి పనిచేయగలం? వారిని ఉత్పాదకత దిశగా, భవిష్యత్‌కు అనుగుణంగా ఎలా సన్నద్ధులను చేయగలం? ఈ దిశగా వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయి’’అని సంజీవ్‌పురి చెప్పారు. సాగు విధానాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ తరహా సుస్థిర సాగు విధానాలు అవసరమన్నారు. నూతన తరం టెక్నాలజీల సాయంతో, వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలను రైతులకు అందించాలన్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. -
భారత్‌లో అద్భుత అవకాశాలు
వాషింగ్టన్: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్‌లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు. వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో.. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం. భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువ.. భారత బ్యాంక్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్ సూచించారు. అమెరికాలో కంటే భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్‌లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్‌లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. ఎక్స్ లేదా వై లేదా జెడ్.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్‌లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్‌గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్‌లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్ ఉన్న ఐపీవోలో అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం. ఒకటికి మించిన దరఖాస్తులు ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్‌కు బిడ్ వేయాలి. ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఒక లాట్ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్ వేసినా కానీ, ఒక్కటే లాట్ అలాట్ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు. జాక్పాట్డిమాండ్ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్ (30) ఇటీవలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో జాక్‌పాట్ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్‌హోల్డర్ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్ఎన్ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్ రోజున బజాజ్ ఫైనాన్స్ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు. వాటాదారుల కోటా.. ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్) అప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ. అలాగే, బజాజ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫిన్సర్వ్ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్‌హోల్డర్స్ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.బిడ్స్ ఇలా...త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం లిస్టెడ్ సంస్థ హీరో మోటోకార్ప్ వాటాదారులకు కోటా రిజర్వ్ చేసింది. ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రుణం తీసుకుని మరీ..వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలు, ఒక హెచ్‌యూఎఫ్ డీమ్యాట్ ఖాతా ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్బీఎఫ్సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్ఎన్ఐ విభాగంలో బిడ్ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు. వాటాదారుల కోటాలో..ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్ మెహ్రా (43) ముందుగానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్ హోల్డర్స్ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్ అయ్యాయి. తిరస్కరణకు దూరంగా..కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోని పేరు, డీమ్యాట్ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% మేర సబ్‌్రస్కిప్షన్ రావాల్సి ఉంటుంది. కసరత్తు అవసరం.. లిస్టింగ్ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్ లాభం కోసం దరఖాస్తుచేసుకుంటే.. లిస్టింగ్ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్ నాటికి మార్కెట్ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో నష్టాలను మిగల్చవచ్చు.ఎస్ఎంఈ ఐపీవోలు మెయిన్‌బోర్డ్ ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్) కాగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.జాగ్రత్త అవసరం..ఇక ఎస్ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్‌్కను తగ్గించుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్సాల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనే ఎస్ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్‌ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్‌బోర్డ్ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్ఎంఈలకు అయితే బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. రుణంతో దరఖాస్తు... పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్‌కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్ సాయపడుతుంది. ఒక్కో పాన్‌పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్ఎన్ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు. రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్‌ను ఇన్వెస్టర్ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ ఖాతాకు ఎన్బీఎఫ్సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్బీఎఫ్సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్బీఎఫ్సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ వెనక్కి తీసుకోవచ్చు.నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్ఐఐ) అధిక నెట్‌వర్త్ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్ హెచ్ఎన్ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్స్కిప్షన్ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్ హెచ్ఎన్ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్ హెచ్ఎన్ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బీమాలోకి మరిన్ని కంపెనీలు రావాలి
ముంబై: ఇన్సూరెన్స్‌లో ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలున్న నేపథ్యంలో మరిన్ని దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబశీష్ పాండా సూచించారు. కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను కూడా సరళతరం చేశామని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘‘మేమైతే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. కంపెనీలే మరింత సమయం కోరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కన్సాలిడేషన్ కన్నా మార్కెట్లో మరిన్ని సంస్థలు వచ్చేలా చూసేందుకే ఐఆర్డీఏఐ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. భారత బీమా రంగంలో అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఇటీవలే జపాన్, యూరప్, అమెరికాలో రోడ్‌షోలు నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యేలా మరిన్ని సంస్థలను ఐఆర్డీఏఐ ప్రోత్సహిస్తోందని పాండా చెప్పారు. దీనితో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా షేర్హోల్డర్లు అలాగే పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదని పేర్కొన్నారు. దేశీయంగా 140 కోట్ల మంది పైగా జనాభా ఉన్న నేపథ్యంలో మొత్తం బీమా సంస్థలు డెభ్భైకి పైగా ఉన్నా .. ఇంకా వ్యాపార అవకాశాలు ఎక్కువే ఉన్నాయని పాండా చెప్పారు. జీఎస్టీ తగ్గింపు వార్తలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ బీమా పాలసీలు అందరికీ అందుబాటు స్థాయిలో ఉండేలా చూడాలనేదే ఐఆర్డీఏఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, పన్నుల తగ్గింపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదని తెలిపారు. -
ఎన్ఆర్ఐలకు ఫండ్స్ రూట్!
మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్ఆర్ఐలు ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్ఆర్ఐలు భారత్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్‌కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ (ఎన్ఆర్వో), ఫారీన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) అకౌంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం→ ఎన్ఆర్ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. → ఎన్ఆర్వో ఖాతా.. భారత్‌లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్‌లో ఆదాయాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా కాగా, ఎన్ఆర్ఈ పొదుపు/కరెంటు/రికరింగ్/ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాగా పనిచేస్తుంది. → చెక్, డీడీ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ (ఎఫ్ఐఆర్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవైసీ కీలకంభారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్‌పోర్ట్ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఓసీఐ కార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.పెట్టుబడుల మార్గాలు.. ఎన్ఆర్ఐలు తామే స్వయంగా లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్‌లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్ఆర్ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు యూఎస్ఏ, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఎన్ఆర్ఐలు, యూఎస్ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు యూఎస్ఏ, కెనడా నుంచి ఎన్ఆర్ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్లైన్లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నవీ మ్యూచువల్ ఫండ్, ఎన్జే ఇండియా మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టారస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ క్యాపిటల్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్ మోడ్‌లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్లైన్లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents నుంచి యూఎస్, కెనడాలోని ఎన్ఆర్ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అవకాశాలు.. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్ చెల్లింపులు ఉండవు. దీంతో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్ లేదా డైరెక్ట్ ప్లాన్ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్‌స్టాక్స్, కువేరా, ఎన్ఆర్ఐలకు సంబంధించి వాన్స్ తదితర ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి. ఉపసంహరణ – పన్ను బాధ్యత భారత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్‌తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్‌కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై భారత పౌరులకు, ఎన్ఆర్ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్ఆర్ఐలు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే విక్రయించుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్ అమలు చేస్తాయి. అదే డెట్ ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్ రెసిడెన్సీ సరి్టఫికెట్ (టీఆర్సీ) సమరి్పంచాల్సి ఉంటుంది. భారత్‌లో పన్ను చెల్లించిన ఎన్ఆర్ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్’కు చెందిన కౌశిక్ రామచంద్రన్ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్రపంచ విమానయాన హబ్‌గా భారత్: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. భారత్‌ను ప్రపంచ విమానయాన హబ్‌గా మార్చడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ప్రాంతీయ అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం ప్రజలందరికీ అందుబాటులోకి వస్తోందని అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి సైతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వెల్లడించారు. పౌర విమానయానంపై గురువారం ఢిల్లీలో జరిగిన రెండో ఆసియా–పసిఫిక్ మినిస్టీరియల్ సదస్సులో మోదీ మాట్లాడారు. 29 దేశాల నంచి 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రభుత్వం తీసుకొచి్చన ‘ఉడాన్’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, దీనిపై అధ్యయనం చేయాలని విదేశీ ప్రతినిధులకు మోదీ సూచించారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగంలో నూతన అవకాశాలు సృష్టించేందుకు ప్రయతి్నంచాలని కోరారు. దాంతో ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, శాంతి, సౌభాగ్యానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉద్ఘాటించారు. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను వైమానిక రంగంతో అనుసంధానిస్తే వివిధ దేశాలకు, ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండడం, వారు సృష్టిస్తున్న డిమాండ్ విమానయాన రంగానికి చోదకశక్తిగా మారుతున్నాయని మోదీ స్పష్టంచేశారు. భారత్‌లో విమానయాన సంస్థల నెట్వర్క్, సేవలు నానాటికీ విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఏవియేషన్ సెక్టార్లో ‘మహిళల సారథ్యంలో ప్రగతి’కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్‌లోని మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 5 శాతమేనని పేర్కొన్నారు. -
ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 300 బిలియన్ డాలర్లుగా ఉంటే, భారత్‌నుంచి కేవలం 5 బిలియన్ డాలర్లే ఉన్నట్టు వెల్లడించారు. కనుక రానున్న సంవత్సరాల్లో భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులను 50–100 బిలియన్ డాలర్లకు చేర్చే సామర్థ్యాలున్నట్టు వివరించారు. టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్, రత్నాభరణాల వంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను (ఎఫ్ఎంజీ) సమీకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలు ఈ–కామర్స్ ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను సమీకరించే చక్కని నెట్వర్క్, లాజిస్టిక్స్ సదుపాయాలు, గోదాముల వసతులు అవసరమన్నారు. ఈ కామర్స్ ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించగా.. త్వరలో ఆయా కంపెనీలతో డీజీఎఫ్టీ సమావేశం కానున్నట్టు చెప్పారు. 4–5 రోజుల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఏ అగ్రిగేటర్ అయినా లేదా సంస్థ.. ఫాస్ట్ మూవింగ్ ఈ–కామర్స్ గూడ్స్ అయిన టెక్స్టైల్స్, రత్నాభరణాలు, చేనేత ఉత్పత్తులు, ఆయు‹Ù, వెల్నెస్ ఉత్పత్తులను డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీ చేయగలిగే సామర్థ్యాలు ఉంటే ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు’’అని వివరించారు. ఈ తరహా ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు తగిన సామర్థ్యాలు షిప్‌రాకెట్, డీహెచ్ఎల్ సంస్థలకు ఉన్నట్టు చెప్పారు. -
Kudumbashree Mission: బడి రెక్కలతో మళ్లీ బాల్యంలోకి...
ఆ క్లాసురూమ్‌లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్‌లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్‌ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్‌రూమ్‌లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్‌తో మళ్లీ బడిపిల్లలయ్యారు.... దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్‌కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్‌లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్‌లో తిరిగే స్కూల్లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. ‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్‌కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం డిజిటల్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల. ‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్‌లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్‌రూమ్‌లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు. ‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్‌కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్‌కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు. పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్‌లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత. -
ServiceNow study: ఏఐ నైపుణ్యాల పెంపు అత్యావశ్యకం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ), ఆటోమేషన్‌పై దేశంలో 1.62 కోట్ల మందికి నైపుణ్యాల పెంపు, పునఃశిక్షణ అవసరం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ రెండు విభాగాల్లో 47 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు రానున్నట్టు తెలిసింది. సర్వీస్‌నౌ సంస్థ అధ్యయనం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉపాధి ముఖచిత్రాన్ని ఏఐ మార్చేయనుందని, డిజిటల్‌నైపుణ్యాల పెంపుతోపాటు టెక్నాలజీలో లక్షలాది ఉపాధి అవకాశాలను తీసుకురానుందని ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. అప్లికేషన్ డెవలపర్లు అదనంగా 75,000 మంది అవసరమని పేర్కొంది. డేటా అనలిస్టులు 70,000 మంది, ప్లాట్‌ఫామ్ ఓనర్లు 65,000 మంది, ప్రొడక్ట్ ఓనర్లు 65,000 మంది, ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్లు 55,000 మంది 2027 నాటికి అవసరం ఉంటుందని వెల్లడించింది. టెక్నాలజీ కారణంగా తయారీలో ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయని, 23 శాతం మంది ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ఆ తర్వాత వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్‌లో 22 శాతం, హోల్‌సేల్, రిటైల్ వాణిజ్యంలో 11.6 శాతం, రవాణా, స్టోరేజ్‌లో 8 శాతం, నిర్మాణ రంగంలో 7.8 శాతం మంది కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరించింది. సర్వీస్‌నౌ సంస్థ నైపుణ్యాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తుంటుంది. ఇప్పటికే 13కు పైగా విద్యా సంబంధిత భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. కీలకమైన వ్యాపార అవసరాలు, భవిష్యత్ అవసరాలకు ఉద్యోగులను సిద్ధం చేసేందుకు వీలుగా నాస్కామ్కు చెందిన ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్‌తో ఆగస్ట్‌లో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ప్రతి పరిశ్రమతో పనిచేస్తున్నాం. ఏఐని అర్థవంతమైన వ్యాపార మార్పుల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చన్నది తెలియజేస్తున్నాం. ఈ మార్పుల వల్ల ఉత్పాదకత పెంపుతోపాటు నాణ్యమైన, సురక్షితమైన ఉపాధి అవకాశాలను అందించేలా చూస్తున్నాం’’అని సెక్యూర్‌నౌ వైస్ ప్రెసిడెంట్ కమోలికా గుప్తా పెరెస్ వివరించారు. రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అప్నా పండుగలకు ముందు పెద్ద ఎత్తు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్ట్, సెపె్టంబర్లో కొత్తగా 1.2 లక్షల ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ వివరాలను జాబ్స్, ప్రొపెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఆప్నా డాట్ కో విడుదల చేసింది. జూలై–సెపె్టంబర్ కాలంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యరి్థనుల సంఖ్య 61 శాతం పెరిగింది. ఇది మహిళా నిపుణుల కోసం వివిధ రంగాల్లో పెరిగిన డిమాండ్‌ను సూచిస్తున్నట్టు అప్నా నివేదిక తెలిపింది. ఈ కామర్స్, రిటైల్, ఆతిథ్య రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచినట్టు వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో బజాజ్, యాక్సిస్ బ్యాంక్, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ కంపెనీలు ఎక్కువ నియామకాలకు ముందుకు వచి్చనట్టు తెలిపింది. మంచి ప్రతిభ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఆఫర్ చేయడంతోపాటు, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బిజినెస్ డెవలప్మెంట్లో ఉద్యోగుల భర్తీకి ప్రాధాన్యం ఇచి్చనట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెపె్టంబర్ వరకు తన ప్లాట్ఫామ్లో యాజమాన్యాల సంప్రదింపులు పెరిగాయని, 78,000 కొత్త సంస్థలు చేరినట్టు వెల్లడించింది. 2022 ఇదే కాలంలో 42,000 కొత్త సంస్థల చేరికతో పోల్చి చూస్తే గణనీయమైన వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,70,000 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల అయితే, అవి ఈ ఏడాది 2,13,000కు పెరిగినట్టు తెలిపింది. మహిళా దరఖాస్తు దారుల సంఖ్య పెరిగిందని, గతేడాదితో పోలిస్తే ఉద్యోగార్థుల ప్రాధాన్యతల్లోనూ మార్పు కనిపించినట్టు అప్నా సీఈవో నిర్మిత్ పారిఖ్ తెలిపారు. -
బ్యాటరీ టెక్నాలజీల్లో భారత్ మరింత ముందుకు
నోయిడా: బ్యాటరీ టెక్నాలజీల్లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) మార్కెట్ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల మార్కెట్ 128 గిగావాట్–అవర్ (జీడబ్ల్యూహెచ్) స్థాయికి చేరవచ్చనే అంచనాలు ఉన్నట్లు రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొన్న సందర్భంగా ఇన్ఫర్మా మార్కెట్స్ ఆఫ్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిలకడైన రీసైక్లింగ్ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ విద్యుత్ డిమాండ్‌లో చైనా, భారత్ సారథ్యంలోని ఆసియాకి ప్రస్తుతం 60 శాతం వాటా ఉందని ఉడ్ మెకెంజీ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ విట్వర్త్ తెలిపారు. రాబోయే రెండు దశాబ్దాల్లో సాంకేతిక పురోగతి వల్ల పవన, సౌర విద్యుత్ సామర్థ్యాలు నాలుగింతలు పెరగనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దకాలంలో ఈ రంగంలో 3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపారు. 700 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 900 పైగా బ్రాండ్లు ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. 40,000 మంది సందర్శకులు ఈ ఎక్స్పోను సందర్శించే అవకాశం ఉంది. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
ఆ బిల్లులు ఆమోదించాలి
మహిళలకు సమానావకాశాలతోనే అభివృద్ధి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకా శాలు లభించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్పీపీ పేర్కొంది. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశా ల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశా రు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా బీఆర్ఎస్పీపీ ఆమోదించింది. సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మహిళలకు పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్ పీపీ) సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వీటిని ఆమోదించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశా లు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్పీపీ సంయుక్త సమావేశం జరిగింది. పార్లమెంటు, శాసన సభల్లో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారి హక్కులు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంద న్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని, అందుకు అవసరమైన సమాచారంతో సిద్ధం కావాలని సూచించారు. దేశ సంపదలో ఓబీసీల కీలక భాగస్వామ్యం తమ వృత్తుల ద్వారా దేశ సంపదను సృష్టించడంలో కీలక భాగస్వాములైన ఓబీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేలా 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీఆర్ఎస్పీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందనే అభి ప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ మంచి ఫలితాలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని ఎంపీలు అన్నారు. రాజకీయ అధికారంలో ఓబీసీ ల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వా రు పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతారని బీఆర్ ఎస్పీపీ పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావే శాల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే (14 జూన్ 2014) ఓబీసీ రిజర్వే షన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. తొమ్మిదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 17న కేంద్రం ఏమంటుందో చూద్దాం ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమా వేశాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులు చర్చకు వస్తాయని కేంద్రం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఎజెండాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సీఎం కేసీఆర్ బీఆర్ఎస్పీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై వ్యూహాన్ని రూపొందించుకుందాం. ఒకవేళ జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలు ప్రస్తావనకు వస్తే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేద్దాం. ఈడీ నోటీసులు జారీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నందున ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడేది లేదు. మహిళలు, ఓబీసీల రిజర్వేషన్ బిల్లులపై ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ అసలు స్వరూపం పడుతుంది..’ అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. వారికి 33% రిజర్వేషన్ కల్పించండి ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖలు చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లులు ప్రవేశ పెట్టాలని శుక్రవారం బీఆర్ఎస్పీపీ తీర్మానించిన నేపథ్యంలో ముఖ్య మంత్రి ఈ లేఖలు రాశారు. ‘శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమా పేందుకు ముందుచూపుతో రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. పార్లమెంటు, శాసనసభల్లోనూ మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చొరవను తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనైనా బిల్లు ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను..’ అని ఒక లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఓబీసీలకు కోటాపై సీఎం మరో లేఖ రాశారు. ‘విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఫలాలు కొంతమేర దక్కినా చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికైనా కేంద్రం 33 శాతం కోటా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలి..’ అని కోరారు. -
వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ - తయారీలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: ఆసియా తయారీ సరఫరా వ్యవస్థలో వైవిధ్యానికి దారితీస్తున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల నుంచి భారత్ ప్రయోజనం పొందుతుందని ది ఎకనామిస్ట్ గ్రూప్ అంచనా వేసింది. భారత్ బలమైన వృద్ధి మార్గంలో ప్రయాణిస్తోందని ద ఎకనామిస్ట్ గ్రూప్ ఇండియా హెడ్ ఉపాసనా దత్ పేర్కొన్నారు. విధానపరమైన సంస్కరణలతో భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభంగా మారుతోందన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ బలమైన పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన భారత్, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తెలిసిందే. పీఎల్ఐ సహా పలు పథకాల ద్వారా దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఎకనామిస్ట్ గ్రూపు ప్రస్తావించింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ ఇంధన వనరులపై అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యావరణ అనుకూల విధానాలు ఇవన్నీ భారత్ వంటి దేశాలకు అవకాశాలను తీసుకొస్తాయని ఉపాసనా దత్ అభిప్రాయపడ్డారు. తయారీలో స్థానం బలోపేతం ‘‘భౌగోళిక రాజకీయ రిస్క్‌ల నేపథ్యంలో కంపెనీలు తమ సరఫరా వ్యవస్థలపై పునరాలోచన చేస్తున్నాయి. చైనా మార్కెట్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకునే దిశగా అవి తీసుకునే నిర్ణయాలతో ఇతర మార్కెట్ల వాటా పెరగనుంది. చైనాకు భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్ అవుతుంది’’అని ఉపాసనా దత్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, పన్నులు, వాణిజ్య నియంత్రణల పరంగా భారత్‌లో ఎంతో పురోగతి కనిపిస్తోందంటూ.. దేశంలో తయారీ పరంగా ఉన్న రిస్క్‌లను ఇది తగిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో వర్ధమాన, ముఖ్యంగా దక్షిణాసియా మార్కెట్ల నుంచి ఎదురయ్యే బలమైన పోటీ కారణంగా.. తయారీలో బలమైన శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షను కొంత ఆలస్యం చేస్తుందన్నారు. -
దేశీయ వ్యవసాయ రంగ వృద్ధికి అపార అవకాశాలున్నాయి - సంజీవ్ పురి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే కొద్దీ ఉత్పత్తుల విక్రయాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. సీక్వెన్షియల్‌గా కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో భౌగోళికరాజకీయ పరిస్థితుల్లాంటి అంతర్జాతీయ అంశం ప్రధానమైనది కాగా వాతావరణ మార్పు రెండోదని ఆయన వివరించారు. అయితే, మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలని సంజీవ్ పురి తెలిపారు. మరోవైపు, హోటల్ వ్యాపారాన్ని విడగొట్టడం వల్ల ప్రస్తుత వాటాదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అగ్రిబిజినెస్ వ్యాపార విభాగం ప్రతికూల పనితీరు ప్రభావం కారణంగా జూన్ త్రైమాసికంలో ఐటీసీ ఆదాయం 6 శాతం క్షీణించి రూ. 18,639 కోట్లకు పరిమితం కాగా లాభం మాత్రం 16 శాతం పెరిగి రూ. 5,180 కోట్లకు చేరింది. దేశీయంగా వ్యవసాయ రంగ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని సంజీవ్ పురి చెప్పారు. ఉత్పాదకత, మార్కెట్ అనుసంధానతను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
లక్ష యూనికార్న్‌లు.. 20 లక్షల స్టార్టప్‌లు సాధ్యమే: కేంద్ర మంత్రి ధీమా
న్యూఢిల్లీ: నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్ ,ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విజయాలు గోరంతేనని .. దేశం ముందు కొండంత అవకాశాలు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భవిష్యత్తులో ఒక లక్ష యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), సుమారు 10–20 లక్షల స్టార్టప్‌ల స్థాయికి ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా టెక్నాలజీతో ప్రజలకు, సమాజానికి, దేశానికి టెక్నాలజీతో ఎలా ప్రయోజనాలు చేకూర్చవచ్చనేది ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని మంత్రి చెప్పారు. పాలనలో, ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రభుత్వంలోను డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకోనుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ, డిజిటల్ రంగంలో భారత్ అంగలు వేయడం ఇప్పుడే ప్రారంభమైందని, ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాలు వివరించారు. -
ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్
పట్నా: దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండడం అధికార బీజేపీకి కలవరం కలిగిస్తోందని చెప్పారు. విపక్ష కూటమి పూర్తిగా బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికార పక్షం ఉండొచ్చని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఐచ్ఛికం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేశారు. -
ఏఐతో కొత్త అవకాశాలు.. ప్రైవసీకి సవాళ్లు
పాంజిమ్: కృత్రిమ మేథ (ఏఐ)తో మానవాళి అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించగలవని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. పనితీరు, పరివర్తనలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాచార సేకరణ, ప్రాసెసింగ్, వితరణ ప్రక్రియ అంతా వేగంగా, సమర్థమంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతోందని రెండో జీ20–ఎస్ఏఐ (సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ), నకిలీ వార్తలపరమైన సవాళ్లు తలెత్తవచ్చని ఆయన చెప్పారు. -
భారత్‌లో అవకాశాలు అపారం
సిడ్నీ: భారత్‌లో డిజిటల్ ఇన్ఫ్రా, టెలికం, సెమీ కండక్టర్లలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లో అవకాశాల గురించి తెలియజేశారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రా, ఐటీ, ఫిన్‌టెక్, టెలికం, సెమీకండ్టర్, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్, విద్య, ఫార్మా, హెల్త్‌కేర్, వైద్య ఉపకరణాల తయారీ, మైనింగ్, టెక్స్టైల్, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, శుద్ధ ఇంధనాల విషయంలో భారత కంపెనీలతో సహకారం ఇతోధికం చేసుకోవాలని కోరారు. నిబంధనల అమలును సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళతరం చేసినట్టు వివరించారు. హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గినా రైన్‌హార్ట్, ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆండ్య్రూ ఫారెస్ట్, ఆస్ట్రేలియా సూపర్ సీఈవో పౌల్ ష్రోడర్ ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. 2000 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 1.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్‌కు ఆస్ట్రేలియా 13వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. -
Karnataka CM Race: సిద్ధూ వర్సెస్ డీకే
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆకాంక్షను వారిద్దరూ ఏమాత్రం దాచుకోవడం లేదు. పరస్పరం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏమున్నదో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల బలాలు, బలహీనతలు, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం.. సిద్ధరామయ్య బలాలు ► మాస్ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు. ► మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు. ► 2013 నుంచి 2018 పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం. ► ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిపాలనలో విశేష అనుభవం ఉంది. ► మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల్లో ఆదరణ. ► బీజేపీ, జేడీ(ఎస్)లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం. ► రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం. ► రాహుల్ గాంధీ నుంచి లభిస్తున్న అండదండలు. బలహీనతలు ► కాంగ్రెస్ పార్టీతో సంస్థాగతంగా పెద్దగా అనుబంధం లేకపోవడం. ► 2018లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించలేకపోవడం. ► జేడీ(ఎస్) నుంచి వచ్చిన ఆయన్ను బయటి వ్యక్తిగానే ఓ వర్గం చూస్తుండటం. ► వయసు 75 ఏళ్లు. ► వృద్ధాప్యం సమీపిస్తుండడం. అవకాశాలు ► ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపే, అందిరినీ కలుపుకొనేపోయే తత్వం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలంటే సిద్ధూ వంటి అనుభవజ్ఞుడు కావాలని అధిష్టానం భావిస్తుండడం. ► డీకే శివకుమార్‌పై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. ► తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించినందున మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే చివరి అవకాశం కావడం. డీకే శివకుమార్ బలాలు ► సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. బలమైన సంస్థాగత సామర్థ్యాలు. ► అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడం. ► పార్టీ నాయకత్వానికి విధేయుడిగా పేరు. ► కష్ట కాలంలో ట్రబుల్ షూటర్‌గా అందించిన సేవలు. ► పుష్కలమైన ఆర్థిక వనరులు కలిగిన నాయకుడు. ► బలమైన తన సొంత సామాజిక వర్గం ఒక్కళిగల మద్దతు. ► సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం. ► వయసు కేవలం 61 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం. ► మంత్రిగా శాఖలను నిర్వర్తించిన అనుభవం. బలహీనతలు ► వెంటాడుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. న్యాయ పోరాటం చేయాల్సి రావడం. ► తిహార్ జైలులో కొన్నిరోజులపాటు శిక్ష అనుభవించడం. ► రాష్ట్రమంతటా కాకుండా పాత మైసూర్కే తన ప్రాబల్యం పరిమితం కావడం. ► ఒక్కళిగలు మినహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడం. అవకాశాలు ► పాత మైసూర్లో కాంగ్రెస్‌కు ప్రజాదరణ దక్కడం వెనుక కృషి శివకుమార్‌దే. ► కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం. ఎస్ఎం కృష్ణ, వీరేంద్ర పాటిల్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారు. ► కాంగ్రెస్‌లోని పాత తరం నాయకుల ఆశీస్సులు లభిస్తుండడం. -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
International disabled day: దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం దివ్యాంగులు తమ ప్రతిభను చాటుకునేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, వారు సాధిస్తున్న విజయాలను ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందనటానికి తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలే తార్కాణం. దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న కృషి వారందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. -
Population Growth: సవాళ్ళు... సదవకాశాలు
ప్రతి అవకాశాన్నీ సంక్షోభంగా మార్చుకోవడం పలువురు చేసే తప్పు. అందరూ సంక్షోభం అనుకొనేదాన్ని కూడా సదవకాశంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ నవంబర్ 15న పుట్టిన శిశువుల్లో ఒకరితో పుడమిపై జనాభా 800 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనాను ఆ దృష్టితో చూస్తే కర్తవ్యం బోధపడుతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. ఈ మైలు రాయి సవాళ్ళు విసురుతూనే, అవకాశాలూ అందిస్తోంది. ఎందుకంటే, జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది. చారిత్రకంగా చూస్తే – మానవ జాతి ఆవిర్భావం మొదలు క్రీ.శ. 1800వ సంవత్సరం నాటికి కానీ జనాభా వంద కోట్లకు చేరలేదు. కానీ, ఆ తర్వాత కేవలం రెండొందల పైచిలుకు ఏళ్ళలో మన సంఖ్యలో మరో 700 కోట్లు చేరాయన్నమాట. మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఒకప్పటితో పోలిస్తే తగ్గిన ప్రపంచ దారిద్య్రం, మాతా శిశు ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల, ఆయుఃప్రమాణం పెరగడం ఇలాంటివి అనేకం దీనికి కారణం. తాజా 800 కోట్ల మార్కును ‘‘మానవాళి సాధించిన విజయాలకు ఇది మైలురాయి’’ అని ఐరాస జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) అన్నది అందుకే. వర్తమాన ధోరణులే గనక కొనసాగితే, 2080ల నాటికి జనాభా 1040 కోట్ల గరిష్ఠానికి చేరుతుందనీ, దాదాపు 1050 కోట్ల దగ్గర ప్రపంచ జనాభా స్థిరపడవచ్చనీ అంచనా. వర్ధమాన దేశాల్లో అధిక భాగం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపైన మాట నిజమే. అలాగని ఈ లెక్కల్నే చూసి, సంపూర్ణ చిత్రాన్ని విస్మరిస్తే కష్టం. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లుండేది. ఆ పైన పట్టుమని పన్నెండేళ్ళకే మరో వంద కోట్లు పెరిగి, ఇప్పుడు 800 కోట్లయింది.అయితే, ఈ సంఖ్య 900 కోట్లవడానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టనుంది. మరో పధ్నాలుగున్నర ఏళ్ళకు, అంటే 2037 నాటికి గానీ అక్కడకు చేరుకోమని అంచనా. అంటే, జనాభా రేటు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆ పెరుగుదల వేగం తగ్గుతోందన్న మాట. 1950తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదల చాలా నిదానించి, 2020లో 1 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని ఐరాస జనాభా నివేదికే వెల్లడించింది. ఒక్కమాటలో... నిదానంగానైనా జనాభా తగ్గుదల మార్గంలోనే పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతాన సాఫల్య రేటూ దీనికి నిదర్శనం. దాని ప్రభావం స్పష్టంగా తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. వెరసి వయసు పెరిగిన జనాభా ఎక్కువవడం ఈ శతాబ్దిలో ప్రధాన ధోరణి కానుంది. వచ్చే 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్ ముంగిట సువర్ణావకాశం ఉంది. చైనా (38.4 ఏళ్ళు), జపాన్ (48.6) దేశాల్లోని సగటు వయస్కుల కన్నా చాలా తక్కువగా భారతీయుల సగటు వయసు 28.7 ఏళ్ళే కానుంది. చివరకు ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్ళ కన్నా మన దేశంలోనే పిన్న వయస్కులుంటారు. అలాగే, మన జనాభాలో 27 శాతానికి పైగా 15 నుంచి 29 ఏళ్ళ వయసువాళ్ళయితే, 25.3 కోట్ల మంది 10–19 ఏళ్ళ మధ్యవయస్కులు. వచ్చే 2030 వరకు ప్రపంచంలోనే పిన్న వయస్కులున్న దేశం మనదే కావడం కలిసొచ్చే అంశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనాభాను సమస్యగా భావించి ఆందోళన చెందే కన్నా ఆయుధంగా అనుకోవాలి. ఉత్పాదకత పెంచే శ్రామికశక్తిగా మలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి. గతంలో చైనా చేసినది అదే! ప్రస్తుతం చైనా జనాభాలో పెద్ద వయస్కుల సంఖ్య పెరుగుతోంది. పడిపోతున్న జననాల రేటు వల్ల జనాభా తగ్గుతోంది. అంటే, ఇప్పటిదాకా ఆ దేశ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమైన శ్రామిక శక్తి ఇక ఏ మేరకు అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకం. ఒక బిడ్డే ఉండాలంటూ అనేక దశాబ్దాలు కఠిన విధానం అనుసరించిన చైనా గత ఏడాది నుంచి ముగ్గురు పిల్లలకు అనుమతిం చింది. మరింతమందిని కంటే ప్రోత్సాహకాలిస్తామనీ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో మన 141 కోట్ల పైచిలుకు జనాభాను సానుకూలతగా మలుచుకోవాలి. అయితే, భారత్‌లో పట్టణ జనాభా అంతకంతకూ అధికమవుతున్నందున సవాళ్ళూ ఎక్కువే. పట్టణ ప్రజావసరాలు తీర్చా లంటే రాగల 15 ఏళ్ళలో భారత్ కనీసం 84 వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక. అంటే సగటున ఏటా 5500 కోట్ల డాలర్లు. అందుకు సిద్ధం కావాలి. పట్టణాల్లో అలా వసతుల కల్పన నాణ్యమైన జీవనంతో పాటు ఉత్పాదక శక్తి పెంపునకూ దోహదం చేస్తుంది. అయితే, జనాభాతో పాటు ధనిక, పేద తేడాలు పెరుగుతాయి. ఉద్రిక్తతలు హెచ్చే ముప్పుంది. ప్రపంచ ఆదాయంలో అయిదోవంతు కేవలం అగ్రశ్రేణి ఒక శాతం జనాభా గుప్పిట్లో ఉండడం పెను ప్రమాదఘంటిక. అత్యంత ధనిక దేశాల ప్రజలు, అతి నిరుపేద దేశాల వారి కన్నా 30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారట. పెరిగిన జనాభా కన్నా ఈ వ్యత్యాసాల పెరుగుదలే దుర్భరం. పెరిగిన జనసంఖ్య కోస మంటూ ప్రకృతి వనరుల విధ్వంసం ప్రపంచ సమస్య. అడవుల నరికివేత, భూగర్భ జలాల దుర్విని యోగం, చేజేతులా కాలుష్యాలు, వాతావరణ మార్పుపై అశ్రద్ధ లాంటివి అరికట్టాలి. 800 కోట్ల మంది కలసి బతుకుతూ, ఈ పుడమిని రాబోయే తరాలకూ నివాసయోగ్యంగా ఉంచడం కీలకం. -
ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం: ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్‌కుమార్ చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ 4.0– అవకాశాలు, సవాళ్లు’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం విశాఖ వచ్చారు. చదవండి: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ ఎస్టీపీఐ డైరెక్టర్ సి.వి.డి.రామ్‌ప్రసాద్‌తో కలిసి ఆయన సాక్షితో మాట్లాడారు. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్‌గా ద్వితీయశ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయని, ఇందులో మొదటి వరుసలో విశాఖపట్నం ఉందని చెప్పారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించబోతోందన్నారు. అరవింద్‌కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ఐటీ పాలసీ అద్భుతం ఐటీ సర్వీస్ సెక్టార్ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. విశాఖపట్నం ఒక డైనమిక్ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే.. ఐటీ రంగం మొత్తం విశాఖ వంటి నగరాల వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా అద్భుతంగా ఉంది. మరిన్ని అవకాశాల కోసం పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాల పోటీని తట్టుకోవాలంటే వైజాగ్ వంటి టైర్–2 నగరాలని ఎంపిక చేసుకోవాల్సిందే. బీపీవోల ఓటు వైజాగ్‌కే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలు కూడా ద్వితీయశ్రేణి నగరాల బాట పడుతున్నాయి. వీటి ఓటు కూడా వైజాగ్‌కే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా.. విశాఖపట్నం వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఎస్టీపీఐ సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న కార్యాలయం కాకుండా మరో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. 2026 నాటికి 80 బిలియన్ల మార్కెట్ ఎస్టీపీఐ లక్ష్యం ప్రస్తుతం ఎస్టీపీఐ సేవలను విస్తృతం చేశాం. వై2కే సమస్యని అధిగమించి అడుగులు వేయడం వల్లే.. ఎస్టీపీఐపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఏర్పడింది. అందుకే సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల మార్కెట్లో 1992లో రూ.17 కోట్లు మాత్రమే ఉన్న మా వాటా.. ప్రస్తుతం రూ.5.69 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ సేవల మార్కెట్లోను రూ.227 కోట్ల వాటాను ఆర్జించాం. సీవోఈలకు అమ్మలాంటి కల్పతరు ఇప్పటికే ఎస్టీపీఐ 20 సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీవోఈ)లని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోను సేవలందిస్తున్నాం. పరిశోధనలు, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం కల్పతరు ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉండటం హర్షదాయకం. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల క్లస్టర్‌గా ఇది ఉపయుక్తమవుతుంది. ఇప్పటివరకు కల్పతరు ఇండస్ట్రీ 4.0 కోసం 250 దరఖాస్తులు వచ్చాయి. డేటా సెంటర్ హబ్‌గా భారత్ ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించే అవకాశం ఉంది. ఇందుకు ఎస్టీపీఐ నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తున్నాం. డేటా సెంటర్లకు సంబంధించిన విధానాన్ని రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ పాలసీని అమలుచేసే ఏజెన్సీగా ఎస్టీపీఐ వ్యవహరిస్తుంది. ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతిక రంగాలపై దృష్టిసారిస్తున్నాం. -
Defence stocks rally: డిఫెన్స్ షేర్లు లాభాల గన్స్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరికరాలు, సాంకేతిక సేవలందిచే కంపెనీలు కొద్ది రోజులుగా దేశీస్టాక్ మార్కెట్లలో వెలుగులో నిలుస్తున్నాయి. డిఫెన్స్ సంబంధ షేర్లకు ఇటీవల డిమాండు బలపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ప్రొడక్టుల తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహం, భారీ ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీ తాజాగా 101 వస్తువులతో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో డిఫెన్స్ కౌంటర్లకు జోష్ వచ్చినట్లు తెలియజేశారు. దీంతో గత వారం డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లు జోరు చూపాయి. జాబితా పెద్దదే గత వారం లాభాల బాటలో సాగిన డిఫెన్స్ సంబంధ షేర్లలో మజ్గావ్ డాక్‌యార్డ్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, మిశ్రధాతు నిగమ్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. ఇకపైన కూడా డిఫెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్ల కు లాభాలనిచ్చే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రంగంలోని ఇతర కౌంటర్లలో డేటా ప్యాటర్న్స్(ఇండియా), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. మూడు నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసానీ వెల్లడించారు. కారణాలున్నాయ్.. ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లకు వీలుండటం, దేశీయంగా తయారీకి ఊతం, పలు దేశాలకు ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు డిఫెన్స్ కంపెనీల ఆదాయ వృద్ధికి అద్దం పడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవల పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగడంతో కొంతమేర దిద్దుబాటుకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. ఇది కన్సాలిడేషన్‌కు దారి చూపవచ్చని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు సైతం డిఫెన్స్ తయారీకి ప్రాధాన్యం ఇస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశంకాగా.. ఏడాది కాలంగా డిఫెన్స్ సంబంధ కంపెనీలకు డిమాండు కొనసాగుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరంగ్ షా తెలియజేశారు. భవిష్యత్‌లో బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్, కొచిన్ షిప్‌యార్డ్ తదితరాలు భారీ ఆర్డర్లను పొందే వీలున్నట్లు అంచనా వేశారు. దిగుమతి ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందిన దేశాలపై రక్షణ రంగ పరికరాల కోసం ఆధారపడటం ఇటీవల తగ్గుతూ వస్తున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అశ్విన్ పాటిల్ పేర్కొన్నారు. దేశీ తయారీకి రక్షణ శాఖ ఆత్మనిర్భరత పేరుతో ఇస్తున్న దన్ను ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో రక్షణ శాఖకు సులభంగా, చౌకగా పరికరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని వివరించారు. దేశీ తయారీకి ఊతమిస్తూ 2020 ఆగస్ట్ నుంచీ ప్రభుత్వం నాలుగు దఫాలలో 310 ఐటమ్స్‌తో విడుదల చేసిన జాబితా డిఫెన్స్ రంగానికి బలిమినిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
బీమా రంగంలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి. ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్ రైటింగ్ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ ఆనంద్ పెజావర్ తెలిపారు. భారత్‌లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరుస విలీనాలు.. ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డీఎఫ్సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్ బీమాలో టాప్–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ అవినాష్ సింగ్ తెలిపారు. విస్తరణ మార్గాలు.. ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.