బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆకాంక్షను వారిద్దరూ ఏమాత్రం దాచుకోవడం లేదు. పరస్పరం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏమున్నదో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల బలాలు, బలహీనతలు, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం..
సిద్ధరామయ్య బలాలు
► మాస్ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు.
► మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు.
► 2013 నుంచి 2018 పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం.
► ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిపాలనలో విశేష అనుభవం ఉంది.
► మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల్లో ఆదరణ.
► బీజేపీ, జేడీ(ఎస్)లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం.
► రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం.
► రాహుల్ గాంధీ నుంచి లభిస్తున్న అండదండలు.
బలహీనతలు
► కాంగ్రెస్ పార్టీతో సంస్థాగతంగా పెద్దగా అనుబంధం లేకపోవడం.
► 2018లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించలేకపోవడం.
► జేడీ(ఎస్) నుంచి వచ్చిన ఆయన్ను బయటి వ్యక్తిగానే ఓ వర్గం చూస్తుండటం.
► వయసు 75 ఏళ్లు.
► వృద్ధాప్యం సమీపిస్తుండడం.
అవకాశాలు
► ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపే, అందిరినీ కలుపుకొనేపోయే తత్వం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలంటే సిద్ధూ వంటి అనుభవజ్ఞుడు కావాలని అధిష్టానం భావిస్తుండడం.
► డీకే శివకుమార్‌పై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు.
► తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించినందున మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే చివరి అవకాశం కావడం.
డీకే శివకుమార్ బలాలు
► సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. బలమైన సంస్థాగత సామర్థ్యాలు.
► అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడం.
► పార్టీ నాయకత్వానికి విధేయుడిగా పేరు.
► కష్ట కాలంలో ట్రబుల్ షూటర్‌గా అందించిన సేవలు.
► పుష్కలమైన ఆర్థిక వనరులు కలిగిన నాయకుడు.
► బలమైన తన సొంత సామాజిక వర్గం ఒక్కళిగల మద్దతు.
► సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం.
► వయసు కేవలం 61 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం.
► మంత్రిగా శాఖలను నిర్వర్తించిన అనుభవం.
బలహీనతలు
► వెంటాడుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. న్యాయ పోరాటం చేయాల్సి రావడం.
► తిహార్ జైలులో కొన్నిరోజులపాటు శిక్ష అనుభవించడం.
► రాష్ట్రమంతటా కాకుండా పాత మైసూర్‌కే తన ప్రాబల్యం పరిమితం కావడం.
► ఒక్కళిగలు మినహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడం.
అవకాశాలు
► పాత మైసూర్‌లో కాంగ్రెస్‌కు ప్రజాదరణ దక్కడం వెనుక కృషి శివకుమార్‌దే.
► కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం. ఎస్‌ఎం కృష్ణ, వీరేంద్ర పాటిల్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారు.
► కాంగ్రెస్‌లోని పాత తరం నాయకుల ఆశీస్సులు లభిస్తుండడం.
Comments
Please login to add a commentAdd a comment