cm race
-
ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 24 ఏళ్లకు బీజేపీ గెలుపు సొంతం చేసుకోవడం తెల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించేదెవరన్న విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. అయితే, సీనియర్ నేత, తాజాగా ఎమ్మెల్యే సురేశ్ పూజారిని పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది. దీంతో, సీఎం పదవి ఆయనకే దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శాసనసభా పక్ష నేత ఎవరనేది అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఇలా ఉండగా, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ దృష్ట్యా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 10కి బదులుగా 12న చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. -
రాజస్తాన్ రాజెవరో?
రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్‌నగర్ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహంత్ బాలక్‌నాథ్ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. వసుంధర రాజే వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి. దియా కుమారి రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్‌మాధోపూర్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్‌లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మహంత్ బాలక్‌నాథ్ యోగి రాజస్తాన్‌లోనూ ఉత్తరప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్ బాలక్‌నాథ్ యోగి. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. బాలక్‌నాథ్ ప్రస్తుతం రాజస్తాన్‌లో అల్వార్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్ చాంద్‌నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజేంద్రసింగ్ షెకావత్ రాజస్తాన్ బీజేపీలో మరో సీనియర్ నేత గజేంద్రసింగ్ షెకావత్. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్ ఆశలు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Karnataka CM Race: సిద్ధూ వర్సెస్ డీకే
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆకాంక్షను వారిద్దరూ ఏమాత్రం దాచుకోవడం లేదు. పరస్పరం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏమున్నదో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల బలాలు, బలహీనతలు, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం.. సిద్ధరామయ్య బలాలు ► మాస్ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు. ► మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు. ► 2013 నుంచి 2018 పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం. ► ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిపాలనలో విశేష అనుభవం ఉంది. ► మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల్లో ఆదరణ. ► బీజేపీ, జేడీ(ఎస్)లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం. ► రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం. ► రాహుల్ గాంధీ నుంచి లభిస్తున్న అండదండలు. బలహీనతలు ► కాంగ్రెస్ పార్టీతో సంస్థాగతంగా పెద్దగా అనుబంధం లేకపోవడం. ► 2018లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించలేకపోవడం. ► జేడీ(ఎస్) నుంచి వచ్చిన ఆయన్ను బయటి వ్యక్తిగానే ఓ వర్గం చూస్తుండటం. ► వయసు 75 ఏళ్లు. ► వృద్ధాప్యం సమీపిస్తుండడం. అవకాశాలు ► ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపే, అందిరినీ కలుపుకొనేపోయే తత్వం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలంటే సిద్ధూ వంటి అనుభవజ్ఞుడు కావాలని అధిష్టానం భావిస్తుండడం. ► డీకే శివకుమార్‌పై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. ► తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించినందున మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే చివరి అవకాశం కావడం. డీకే శివకుమార్ బలాలు ► సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. బలమైన సంస్థాగత సామర్థ్యాలు. ► అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడం. ► పార్టీ నాయకత్వానికి విధేయుడిగా పేరు. ► కష్ట కాలంలో ట్రబుల్ షూటర్‌గా అందించిన సేవలు. ► పుష్కలమైన ఆర్థిక వనరులు కలిగిన నాయకుడు. ► బలమైన తన సొంత సామాజిక వర్గం ఒక్కళిగల మద్దతు. ► సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం. ► వయసు కేవలం 61 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం. ► మంత్రిగా శాఖలను నిర్వర్తించిన అనుభవం. బలహీనతలు ► వెంటాడుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. న్యాయ పోరాటం చేయాల్సి రావడం. ► తిహార్ జైలులో కొన్నిరోజులపాటు శిక్ష అనుభవించడం. ► రాష్ట్రమంతటా కాకుండా పాత మైసూర్కే తన ప్రాబల్యం పరిమితం కావడం. ► ఒక్కళిగలు మినహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడం. అవకాశాలు ► పాత మైసూర్లో కాంగ్రెస్‌కు ప్రజాదరణ దక్కడం వెనుక కృషి శివకుమార్‌దే. ► కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం. ఎస్ఎం కృష్ణ, వీరేంద్ర పాటిల్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారు. ► కాంగ్రెస్‌లోని పాత తరం నాయకుల ఆశీస్సులు లభిస్తుండడం. -
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ.. సిద్ధూ, డీకేల్లో సీఎం ఎవరో!
సాక్షి బెంగళూరు: విభేదాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై నిలిచి కాంగ్రెస్‌ను గెలుపు బాటన నడిపిన మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు సీనియర్లు కూడా రేసులో ఉండటంతో ఎంపిక అధిష్టానానికి సవాలుగా మారింది. సీఎం అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఆదివారం సాయంత్రం కీలకమైన కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరం. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్ షూటర్ శివకుమార్ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధూ సొంతం. చదవండి: హంగ్ అడ్డుగోడ బద్ధలు వీరిద్దరి మధ్య వివాదాలకు తావు లేని రీతిలో అధికార పంపిణీ చేయాలని అధిష్టానం యోచనగా చెబుతున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన 75 ఏళ్ల సిద్ధూకు సీఎం, డీకేకు డిప్యూటీ, లేదా కీలక మంత్రి పదవి ఇచ్చి కొంతకాలానికి వారిని పరస్పరం మారుస్తారని భావిస్తున్నారు. దళిత నేత వైపు అధిష్టానం మొగ్గితే పరమేశ్వరకు చాన్సుంటుంది. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయతులు ఈసారి కాంగ్రెస్ వైపు నిలిచినందున ఆ వర్గానికి చెందిన పాటిల్‌కు అవకాశమివ్వాలన్న డిమాండ్లూ విన్పిస్తున్నాయి. -
త్రిపురలో సీఎం రేసులో ప్రతిమా బౌమిక్!
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కు దాటి ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీ కూటమిలో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏడాదికాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సాహాకు పోటీగా కేంద్ర సహాయ మహిళా మంత్రి ప్రతిమా బౌమిక్‌ను సీఎం రేసులో నిలపాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ భావిస్తుండటమే ఇందుకు కారణం. సీఎం అభ్యర్థిగా ఒక్కరినే ఎన్నుకునేలా, ఏకగ్రీవం కోసం ఒప్పించేందుకు ఈశాన్యభారతంలో బీజేపీ సమస్యల పరిష్కర్త, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బిప్లవ్ వర్గాన్ని శాంతింపజేసేందుకు ప్రతిమా బౌమిక్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు శేఖర్ దత్తా అభిప్రాయపడ్డారు. 60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 చోట్ల, దాని కూటమి పార్టీ ఐపీఎప్టీ ఒక చోట విజయం సాధించిన విషయం తెల్సిందే. మరోవైపు మార్చి ఎనిమిదో తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అస్సాం సీఎం హిమంత భేటీ అయ్యారు. భేటీలో నాగాలాండ్ సీఎంనేపియూ రియో సైతం పాల్గొన్నారు. -
సీఎంకు ఓటర్ల షాక్.. మోదీ సూచనతో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మహిళ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో.. పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని నియమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీకే సీఎం పగ్గాలు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. బీజేపీ హైకమాండ్ నుంచి రీతు ఖండూరీకి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై అధినాకత్వం రీతూతో చర్చించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆమెనే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రీతూ ఖండూరీ భర్త రాజేశ్ భూషణ్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ హెల్త్ సెక్రెటరీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, సీఎం రేసులో మరో ఆరుగురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిషన్ సింగ్ చుఫాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇదిలాఉండగా.. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనా కాలంలో ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముగ్గురిని సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని ఒకరిని, నిర్ణీత సమయంలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున మరొరిని సీఎం పదవుల నుంచి బీజేపీ అధిష్టానం తప్పించింది. చివరగా పుష్కర్ సింగ్ ధామికి అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సీఎంల మార్పు వ్యవహారం పార్టీని కొంతవరకు ఇబ్బంది పెట్టింది. దీంతో ఈసారి ఎలాంటి తప్పూ దొర్లకుండా ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. -
అస్సాం ముఖ్యమంత్రి ఎవరో?
న్యూఢిల్లీ: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడుతున్నారు. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వారిద్దరూ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బి.ఎల్.సంతోష్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఢిల్లీకి రావాలంటూ సోనోవాల్, శర్మకు శుక్రవారం వర్తమానం పంపింది. శనివారం పార్టీ పెద్దలతో భేటీ అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అస్సాం శాసనసభాపక్ష సమావేశం ఆదివారం గువాహటిలో జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చిస్తామని వెల్లడించారు. కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారుపై, నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని ప్రశ్నలకు ఈ సమావేశంలోనే సమాధానం దొరుకుతుందన్నారు. ఢిల్లీలో సోనోవాల్, శర్మతో బీజేపీ అగ్రనేతలు రెండుసార్లు విడివిడిగా మాట్లాడారు. ఒకసారి ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి చర్చించారు. నడ్డా నివాసానికి వేర్వేరు వాహనాల్లో వచ్చిన సోనోవాల్, శర్మ తిరిగి వెళ్లేటప్పుడు ఒకే కారులో వెళ్లారు. సీఎం రేసులో ముందంజలో ఉన్నారని భావిస్తున్న సోనోవాల్ అస్సాంలోని స్థానిక సోనోవాల్–కచారీ గిరిజన తెగకు చెందిన నాయకుడు. ఇక శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. 2016లో ఎన్నికల కంటే ముందు సోనోవాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో తొలిసారిగా గెలిచింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. -
సింధియాలకు అందని సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్‌సింగ్ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్‌నాథ్‌తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు. గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్‌నాథ్ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్‌నాథ్(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్ చుర్హాత్ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మాధవ్‌రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్‌సింగ్ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్‌రావు సింధియా కూడా భోపాల్‌లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు. అయితే, అధిష్టానం మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్‌రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
అనూహ్య పరిణామాలు.. సీఎం రేసులో కొత్త పేర్లు
సాక్షి, బెంగళూరు: సరిగ్గా కౌంటింగ్‌కు ముందే కర్ణాటక ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేడీఎస్ మద్ధతు అనివార్యమయ్యే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను మార్చాలని కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లోనూ కొత్త నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. సిద్ధరామయ్య స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీ పరమేశ్వర, మల్లికార్జున ఖర్గే(ఖర్గే ఇది వరకే వార్తను ఖండించారు) పేర్లు వినిపిస్తుండగా, బీజేపీ నుంచి యాడ్యురప్ప స్థానంలో అనంత కుమార్ లేదా రాములు పేర్లు తెరపైకి వచ్చాయి. జేడీఎస్ మద్ధతు తప్పనిసరి అయితే దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణను డిప్యూటీ సీఎం చేస్తామన్న హామీని ఇరు పార్టీలు ఇస్తున్నట్లు సమాచారం. దళిత సీఎం ప్రతిపాదన, హంగ్ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ మార్పులు సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాములు పేరును బీజేపీ శ్రేణులు డిప్యూటీ సీఎంగా ప్రచారం చేస్తున్నాయి. ఏదిఏమైనా ఈ నెల 17న తానే సీఎంగా ప్రమాణం చేస్తానని యెడ్యూరప్ప ఘంటాపథంగా చెబుతున్నారు. -
‘ముఖ్యమంత్రి రేసులో లేను’
సాక్షి, భోపాల్ : మరో ఆరునెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను సీఎం రేసులో లేనని మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. నర్మదా నది పరిరక్షణ కోసం ఆరు నెలల పాటు 3,100 కిలోమీటర్ల మేర ఆయన చేపట్టిన యాత్ర ఇటవల ముగిసింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సమైక్యంగా పోరాడాలని అందుకు తాను చొరవ చూపుతానని చెప్పారు. నర్మదా పరిక్రమ యాత్రను ఆయన ఓంకారేశ్వర్ ఆలయంలో ముగించారు. నర్మదా ఘాట్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ తాను సీఎం రేసులో లేనని తేల్చిచెప్పారు. రెండు సార్లు తాను పూర్తికాలం సీఎం పదవిని చేపట్టానని..మరోసారి సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని భావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏ బాధ్యత అప్పగించినా దాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ వర్గాలను ఏకతాటిపై నడిపించి, బీజేపీకి దీటుగా పోటీ ఇవ్వడమే తన అభిమతమని అన్నారు. -
ముఖ్యమంత్రి రేసులో సుష్మాస్వరాజ్!
న్యూఢిల్లీ/చంఢీఘర్: హర్యానాలో బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని స్సష్టమవడంతో ముఖ్యమంత్రి స్థానానికి ఆ పార్టీలో పోటీ మొదలైంది. హర్యానాలో బీజేపీ మొట్టమొదటిసారిగా ఆధికారాన్ని చేపట్టబోతోంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 శాసనసభ స్థానాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. బీజేపీ దాదాపు 52 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 స్థానాలు ఉంటే చాలు. మెజార్టీ స్థానాలను బీజేపీ ఒక్కటే గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు అనేక అంశాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా కులానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బీజేపీ సీనియర్ నేత కెప్టెన్ అభిమన్యు పేరు ప్రధానంగా వినవస్తోంది. ఇంకా కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఇంద్రజిత్ సింగ్, క్రిషన్ పాల్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంవిలాస్ శర్మ పేర్లు కూడా వినవస్తున్నాయి. ** -
'సీఎం రేసులో ఉన్న నేతలంతా ఓటమి'
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ కకావికలమైంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న పలువురు ముఖ్యనేతలు ఓటమి చవిచూశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జనగామలో పరాజయం చెందారు. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీచేసిన పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఓడిపోయారు. అందోల్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, మంథని నుంచి శ్రీధర్ బాబు, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, సునీతా లక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, వీ హనుమంతరావు ఓటమి పాలయ్యారు. వీరితో పాటు మరికొందరు కీలక నేతలు విజయశాంతి, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, జయసుధ ఓడిపోయారు. కాగా గుడ్డిలో మెల్లగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుంచి డీకే అరుణ గెలుపొందారు.