
సాక్షి బెంగళూరు: విభేదాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై నిలిచి కాంగ్రెస్‌ను గెలుపు బాటన నడిపిన మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు సీనియర్లు కూడా రేసులో ఉండటంతో ఎంపిక అధిష్టానానికి సవాలుగా మారింది. సీఎం అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఆదివారం సాయంత్రం కీలకమైన కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరం. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్ షూటర్ శివకుమార్ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధూ సొంతం.
చదవండి: హంగ్ అడ్డుగోడ బద్ధలు
వీరిద్దరి మధ్య వివాదాలకు తావు లేని రీతిలో అధికార పంపిణీ చేయాలని అధిష్టానం యోచనగా చెబుతున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన 75 ఏళ్ల సిద్ధూకు సీఎం, డీకేకు డిప్యూటీ, లేదా కీలక మంత్రి పదవి ఇచ్చి కొంతకాలానికి వారిని పరస్పరం మారుస్తారని భావిస్తున్నారు. దళిత నేత వైపు అధిష్టానం మొగ్గితే పరమేశ్వరకు చాన్సుంటుంది. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయతులు ఈసారి కాంగ్రెస్ వైపు నిలిచినందున ఆ వర్గానికి చెందిన పాటిల్‌కు అవకాశమివ్వాలన్న డిమాండ్లూ విన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment