సాక్షి, భోపాల్ : మరో ఆరునెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను సీఎం రేసులో లేనని మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. నర్మదా నది పరిరక్షణ కోసం ఆరు నెలల పాటు 3,100 కిలోమీటర్ల మేర ఆయన చేపట్టిన యాత్ర ఇటవల ముగిసింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సమైక్యంగా పోరాడాలని అందుకు తాను చొరవ చూపుతానని చెప్పారు.
నర్మదా పరిక్రమ యాత్రను ఆయన ఓంకారేశ్వర్ ఆలయంలో ముగించారు. నర్మదా ఘాట్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ తాను సీఎం రేసులో లేనని తేల్చిచెప్పారు. రెండు సార్లు తాను పూర్తికాలం సీఎం పదవిని చేపట్టానని..మరోసారి సీఎం కావాలన్న ఆకాంక్ష తనకు లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని భావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏ బాధ్యత అప్పగించినా దాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ వర్గాలను ఏకతాటిపై నడిపించి, బీజేపీకి దీటుగా పోటీ ఇవ్వడమే తన అభిమతమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment