న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.
అసలేంటి వివాదం?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
పదవి నుంచి తొలగించాల్సిందే
జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.
అంత ఈజీ కాదు..
హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌ను అందజేయాలి. పార్లమెంట్‌లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్‌లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.
చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలు
అయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్‌లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
గతంలోనూ తీర్మానాలు
హైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి.
1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.
2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు.
2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.
2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది.
2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment