మీ గొంతులో వ్యంగ్యం ధ్వనిస్తోంది
ధన్‌ఖడ్ సంబోధనపై జయ అభ్యంతరం
స్కూలు పిల్లల్లా చూస్తున్నారని ఆక్షేపణ
ఆమె తీరుపై తీవ్రంగా ఆగ్రహించిన ధన్‌ఖడ్
సెలబ్రిటీలైతే నిబంధనలకు అతీతులా?
పేరు ప్రఖ్యాతులున్నది మీకు మాత్రమేనా?
చైర్‌కే ఉద్దేశాలు ఆపాదిస్తున్నారంటూ ధ్వజం
జయకు మద్దతుగా విపక్షాల వాకౌట్
ధన్‌ఖడ్‌పై అభిశంసన తీర్మానం!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి.
వేడెక్కిన రాజ్యసభ
జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు.
నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు.
విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు.
‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి.
మేం స్కూలు పిల్లలమా?: జయ
ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు.
ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.
87 మంది ఎంపీల సంతకాలు
ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.
ముందస్తు నోటీసు తప్పనిసరి
రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment