న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.
అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్‌లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్‌లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.
కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు.
Comments
Please login to add a commentAdd a comment