న్యూఢిల్లీ: ‘జయా అమితాబ్ బచ్చన్’ ప్రస్తావన రాజ్యసభలో మరోసారి గందరగోళాన్ని సృష్టించింది. సమాజ్‌వాదీ ఎంపీ అయిన జయా బచ్చన్‌ను రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జయా అమితాబ్ బచ్చన్‌గా సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే జయా బచ్చన్‌నుఇప్పటికే రెండు సార్లు ఆ పేరుతో పిలవడం వల్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరోసారి ఇదే తంతు పునరావృతం కావడంతో జయా బచ్చన్ అసహనానికి గురయ్యారు. మరోసారి అలా పిలవొద్దని అన్నారు.
దీనిపై దన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘నాకు పాఠాలు బోధించవద్దు’ అని తీవ్రంగా స్పందించారు. అయితే ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా వాకౌట్ చేశాయి. జయా బచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
వాకౌట్ తర్వాత జయా బచ్చన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అవమానకరమైన అనుభవమని తెలిపారు. అధికార బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. ‘ చైర్మన్ ఏదీ మాట్లాడిన చెల్లుతుందా? ఆయన కూడా మనలంటి ఎంపీనే. ఛైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మేం స్కూల్ పిల్లలం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు.
ప్రతిపక్ష నేత (కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే) మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట తీరు బాధించింది. మైక్ కట్ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి నేను పట్టించుకోనంటూ తీవ్ర పదజాలం వాడుతుంటారు. ఆయన పట్టించుకోవాలని నేను అడగడం లేదు. ఐదోసారి నేను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాకు తెలీదా ఏం మాట్లాడాలో..? ఇలాంటి ప్రవర్తన పార్లమెంట్‌లో ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడిన తీరు మహిళలకు అగౌరపరిచేలా ఉంది. దీనిపై క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆమె వెంట సోనియా గాంధీ కూడా ఉన్నారు.
కాగా ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వానించారు. దీనిపై జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అంటూ చెప్పగా.. ‘మహిళలను వారి భర్త పేరుతోనే పిలస్తారా, వారికంటూ స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ మండిపడ్డారు. అనంతరం గత సోమవారం కూడా జయా అమితాబ్ బచ్చన్ అని సంభోధించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ.. జయా బచ్చన్ అని సంబోధిస్తే సరిపోతుందని అన్నారు.
పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment