అభిప్రాయం
ఏం చదివితే ఏమి? ఏ పదవిలో కూర్చుంటే ఏమి? పితృస్వామ్య భావజాలం నరనరాన జీర్ణించుకున్నప్పుడు ప్రతి ఒక్కడూ ఒక మనువే అవుతాడు. ఇందుకు రాజ్యసభలో జయాబచ్చన్ పట్ల చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహారశైలే ఒక ఉదాహరణ.
ప్రజలందరి స్వేచ్ఛా సమానత్వాలను కాపాడటానికి కృషి చేసే చట్టసభల్లో మహిళా సభ్యులు అవమానాలకు, వివక్షలకు గురి కావడం భారతదేశంలో చాలా సహజంగా మారిపోయింది, చర్చించవలసిన విషయం కాకుండా పోయింది. ఇందిరాగాంధీ, జయ లలిత, సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీతో సహా రాష్ట్రాల మహిళా శాసనసభ్యులు అనేకమంది ఇలాంటి వాటిని ఎదుర్కొన్నవారే.
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, రెండు దశాబ్దాలుగా భారత పార్లమెంటేరియన్; ఆస్తులు, హోదాలు, కుటుంబపు దన్ను, సామాజిక ఆధిపత్య స్థానంలో ఉన్న జయాబచ్చన్ కూడా రాజ్యసభలో తన పేరును వ్యంగ్యంగా కాక గౌరవంగా పిలవడం కోసం పోరాటం చేస్తోంది. ‘తోటి సభ్యురాలి పేరుకి విలువ ఇవ్వనివారు, మా హక్కులను ఎలా కాపాడతారని’ ప్రజలు ప్రశ్నిస్తే చట్టసభలు ఏమని సమాధానం ఇస్తాయి?
మొన్నటి రాజ్యసభ సమావేశాల్లో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తను మాట్లాడ టానికి అవకాశం ఇమ్మని కోరిన జయను ఉద్దేశించి– ‘ఇపుడు జయా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడతారని’ ధన్‌ఖడ్ అన్నారు. ‘అమితాబ్’ పేరుని ఒత్తి పిలవడంతో, అందులోని వ్యంగ్యాన్ని జయ గుర్తించి అందుకు అభ్యంతరం చెప్పింది.
అప్పటికి అది నాలుగోసారి జయ పేరుని ధన్‌ఖడ్ ఆ తీరులో పలకడం! తనని జయాబచ్చన్ అని మాత్రమే పిలవమని ప్రతిసారీ ఆయనకు చెబుతూనే ఉంది. తను భర్త చాటు భార్యను కాననీ, స్త్రీగా తన ఉనికిని గుర్తించాలని స్పష్టంగా చెప్పింది. ఒక స్త్రీ, అందునా ప్రతిపక్షంలో ఉన్న స్త్రీ కచ్చితంగా చెప్పడం ఎంతటి ఉదారులకైనా నచ్చు తుందా! ఎన్నికల అఫిడవిట్‌లో జయ పేరు ‘జయా అమితాబ్ బచ్చన్’ అని ఉంటుంది.
అందుకే అలా పిలిచానని ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యుల పేర్లన్నీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే పిలవడం లేదు కదా! దీన్ని బట్టి చూస్తే జయని రెచ్చగొట్టడానికే పదేపదే అలా పిలిచారు. అయితే పేరు పిలవడం కేవలం సాంకేతిక విషయం కాదు. పైకి మామూలుగా కనిపించే మాటకు మనం అద్దే స్వరం ద్వారా ఉద్దేశించిన అర్థం మారి పోవచ్చు. తనొక కళాకారిణిననీ, ఎదుటివారి హావభావాలు తనకి ఇట్టే తెలిసిపోతాయనీ, ‘పిలిచిపుడు మీ టోన్ బాలేద’నీ చెప్పింది జయ.
చట్టసభల్లో సభాధ్యక్షులు ఎలా వ్యవహరించాలి అన్నదానికి మనకి కొన్ని సంప్ర దాయాలు ఉన్నాయి. చైర్మన్ ఏ పార్టీ నుంచి ఎన్నిక అయినా సరే సభలో ఉన్న అన్ని పార్టీలు, సభ్యుల పట్ల తటస్థ వైఖరితో వ్యవహరించాలి. కానీ జగదీప్ ధన్‌ఖడ్ సభా నిర్వహణ చాలా స్పష్టంగా ఒక పక్షం వైపు పనిచేస్తూనే ఉంది. ఆయన ముందుగానే ప్రతిపక్ష సభ్యులతో వాదం వేసుకుని అధికారపార్టీ సభ్యుల పని సులువు చేస్తారు.
దేశ ప్రజలందరికీ ఆదర్శమైన వ్యక్తిత్వంతో ఉండాల్సిన మనిషి, పరుషమైన భాష, వ్యంగ్యపు హావభావాలు, కటుత్వం, ఆధిపత్యపు మొగ్గు, సభా సంప్రదాయాలను పట్టించుకోకపోవడం ద్వారా ప్రతిపక్ష సభ్యుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. తను కళాకారిణిని కాబట్టి హావభావాలు గ్రహించానని చెప్పడం, ‘మనం కొలీగ్స్ కదా’ అని జయ అనడంతో ధన్‌ఖడ్ ద్వంద్వానికి గురయ్యారు.
‘మీరు సెలబ్రెటీ అయితే ఏమిటి, సభలో అందరూ ఒక్కటే’ అన్న మరుక్షణమే ‘మనం ఒకటి ఎలా అవుతాం! అధ్యక్ష స్థానానికి విలువ ఇవ్వరా!’ అంటూ ధన్‌ఖడ్ పెద్దస్వరంతో మాట్లాడడం రాజ్యసభ ప్రసారాలు చూసినవారికి ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్ష సభ్యులంతా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. జయకి సోనియాగాంధీ మద్దతుగా నిలబడింది. ధన్‌ఖడ్ స్వభావం గురించి చెబుతూ సభ్యులను తరచుగా ‘శూన్యబుద్ధి’ అంటారని, మాట్లాడుతుంటే ‘న్యూసెన్స్’ అంటారని జయ చెప్పింది.
ఈ సందర్భంలో జయ ప్రస్తావించిన ‘మాటల్లో ధ్వని’ గురించి మాట్లాడుకోవాలి. ‘ఇప్పుడు ఆడవాళ్ళని ఒక మాటని బతకగలమా!’ అన్నది తరచూ వింటున్న మాట. స్త్రీలమీద జరిగే రకరకాల వేధింపులు, దాడులను అరికట్టడానికి కొన్ని చట్టాలు వచ్చాక నిస్సంకోచంగా స్త్రీలను అవమానించడం కొంతమేరకు తగ్గి ఉండవచ్చు. కానీ ఆ మేరకు కొత్త సాధనాలను పితృస్వామ్యం సమకూర్చుకుంటుంది.
అందులో ఒకటి ధ్వని గర్భితంగా మాట్లాడటం! తాము వాడే ప్రతీ పదం రాజకీయంగా తప్పులేకుండా చూసుకుని– స్వరంలోని హెచ్చుతగ్గులు, తమకి అవసరమైన పదాలను ఒత్తి పలకడం, హావభావాల ద్వారా వివక్షను చూపడం! రాజ్యసభలో ఈ తెలివైన వివక్షకే జయ గురయింది. దీని వెనుక ఉన్న కారణం ఒక్కటే. ఇప్పటికీ స్త్రీలు రెండవతరగతి పౌరులు! అటువంటివారు చట్టసభల్లోకి వచ్చి మౌనంగా కూర్చోకుండా సవాళ్ళు విసురుతారు, గట్టి గొంతుతో మాట్లాడతారు.
అందుకే జేపీ నడ్డా లాంటి వారికి జయలో సభా మర్యాదలు, ప్రజాస్వామిక విలువలు పాటించడం తెలియని గర్వపోతు కనపడింది. స్త్రీలు ఎంతటి స్థానానికి ఎదిగినా వారు సమాజం కళ్ళకు స్త్రీలుగానే కనపడతారు. అందుకే సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోవాలని ఆశిస్తారు. సునీత రెండో పెళ్లి చేసుకోవద్దని డిమాండ్ చేస్తారు. తులసి చందు తన యూట్యూబ్ ఛానెల్ ఆపేయాలని బెదిరిస్తారు. దేశంలోని మామూలు మనుషులంతా ఆ కుస్తీపిల్లని గుండెల్లో పెట్టుకుంటే మతతత్వ వాదులు ఆమె ఒంటి మీది దుస్తులను విప్పాలని చూస్తారు. జయను ఎలా పిలవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు!
కె.ఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శి
malleswari.kn2008@gmail.com
Comments
Please login to add a commentAdd a comment