ఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్( సీపీడబ్ల్యూడీ ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), టాటా ప్రాజెక్ట్‌ల అధికారులు సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్‌లోని తన గదిలోకి ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు లేఖ రాశారు.
‘‘ఇది చాలా అసాధారణ విషయం. నా ఛాంబర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలా నా ఛాంబర్‌లోకి చొరబాడటం... అగౌరవపర్చటంతో పాటు ఆమోదయోగ్యం కాదు. ఎవరి అదేశాలు, సూచనల ప్రకారం వారు అనుమతి లేకుండా నా ఛాంబర్‌లోకి ప్రవేశించారో తెలియజేయాని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి' అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.
అయితే.. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదని రాజ్యసభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖపై.. సీఐఎస్ఎఫ్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఛాంబర్లతో ఏవైనా నిర్మాణ మరమత్తు పనులు జరుగుతున్న సమయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పార్లమెంట్‌లోని ప్రోటోకాల్‌లో భాగంగా ఇతర ఏజెన్సీలతో కలిసి ఉంటారని ఓ అధికారి తెలిపారు.
‘‘పలు కార్యాలయాల్లో మరమత్తు పనులు జరిగాయి. కార్యాలయాల తాళాలు సీఐఎస్‌ఎఫ్ వద్ద లేవు. పార్లమెంటు అంతటా భద్రత కోసం మాత్రమే సీఐఎస్‌ఎఫ్ ఉంది. నిర్వహణ పనుల జరగుతున్న సమయంలో వారు.. అధికారులతో పాటు పలు కార్యాలయాలకు వెళ్లి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూశారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment