దిగ్విజయ్ వల్లే సీఎం అయ్యా: పారికర్
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా.. తనకు అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు గోవా సీఎం, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ కృతజ్ఞతలు తెలిపారు. మార్చి మొదటి వారంలో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్.. శుక్రవారం నాడు జీరో అవర్ సందర్భంగా రాజ్యసభకు వెళ్లారు. అక్కడి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరినీ గోవాకు స్వాగతించారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు అందరూ తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఎంతగానో సహకరించారని, వాళ్లంతా ఎప్పుడు గోవా రావాలనుకున్నా అందరికీ స్వాగతమని అన్నారు. ఆ తర్వాత.. గోవాలోనే ఉన్నా, ఏమీ చేయకుండా కూర్చున్నందుకు దిగ్విజయ్ సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని, ఆయన వల్లే తాను ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగానని వ్యాఖ్యానించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నిరసన, అభ్యంతరం తెలియజేశారు.
మార్చి 11వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో గోవాలో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 17, బీజేపీకి 13 రాగా.. ఇతర చిన్న పార్టీలు మిగిలిన స్థానాలను పంచుకున్నాయి. కాంగ్రెస్ ముందుగా స్పందించకపోవడంతో బీజేపీ పావులు కదిపి, చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ తరఫున పరిశీలకుడిగా సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గోవాలోనే మకాం వేశారు. అయినా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోగా.. సీనియర్ నాయకుడు విశ్వజిత్ రాణే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణకు కొద్ది సేపటి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం దిగ్విజయ్‌కు షాకిచ్చింది. తర్వాత మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేశారు. దిగ్విజయ్ సింగ్ వల్లే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని వాళ్లిద్దరూ వ్యాఖ్యానించారు.