సింధియాలకు అందని సీఎం | Jyotiraditya Scindia Misses Out On Chief Minister's Post | Sakshi
Sakshi News home page

సింధియాలకు అందని సీఎం

Published Sat, Dec 15 2018 3:05 AM | Last Updated on Sat, Dec 15 2018 3:05 AM

Jyotiraditya Scindia Misses Out On Chief Minister's Post - Sakshi

జ్యోతిరాదిత్య సింధియా

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్‌ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్‌సింగ్‌ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్‌నాథ్‌తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు.

గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్‌నాథ్‌ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్‌నాథ్‌(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది.  1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది.

అప్పట్లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్‌ చుర్హాత్‌ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్‌ రాచకుటుంబానికి చెందిన మాధవ్‌రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్‌సింగ్‌ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్‌ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్‌రావు సింధియా కూడా భోపాల్‌లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు.

అయితే, అధిష్టానం మోతీలాల్‌ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్‌రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్‌ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్‌ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement