
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారైనట్టుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీ పక్షనేతగా కమల్‌నాథ్ పేరును ప్రతిపాదించారు. పార్టీ గెలుపుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే కారణమని సింధియా తెలిపారు. సీఎం ఎవరనే నిర్ణయాన్ని రాహుల్‌కే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న సింధియానే శాసనసభ పక్ష నేతగా కమల్‌నాథ్ పేరును ప్రకటించడంతో ఆయన ఎంపిక లాంఛనం కానుంది. ఈ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రకటను చేయలేదు. ఈ రోజు రాత్రికి కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో మెజారిటీ మార్కుకు రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్.. అధికారం చేజిక్కించుకోవడానికి వేగంగా పావులు కదిపింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, స్వతంత్రులతో కాంగ్రెస్ నాయకుల చర్చలు ఫలించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అయితే సీఎం పదవి విషయంలో కొద్దిగా సందిగ్ధత నెలకొంది. సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.