సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ
న్యూఢిల్లీ: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడుతున్నారు. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వారిద్దరూ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బి.ఎల్.సంతోష్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది.
ఢిల్లీకి రావాలంటూ సోనోవాల్, శర్మకు శుక్రవారం వర్తమానం పంపింది. శనివారం పార్టీ పెద్దలతో భేటీ అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అస్సాం శాసనసభాపక్ష సమావేశం ఆదివారం గువాహటిలో జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చిస్తామని వెల్లడించారు. కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారుపై, నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని ప్రశ్నలకు ఈ సమావేశంలోనే సమాధానం దొరుకుతుందన్నారు. ఢిల్లీలో సోనోవాల్, శర్మతో బీజేపీ అగ్రనేతలు రెండుసార్లు విడివిడిగా మాట్లాడారు. ఒకసారి ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి చర్చించారు. నడ్డా నివాసానికి వేర్వేరు వాహనాల్లో వచ్చిన సోనోవాల్, శర్మ తిరిగి వెళ్లేటప్పుడు ఒకే కారులో వెళ్లారు.
సీఎం రేసులో ముందంజలో ఉన్నారని భావిస్తున్న సోనోవాల్ అస్సాంలోని స్థానిక సోనోవాల్–కచారీ గిరిజన తెగకు చెందిన నాయకుడు. ఇక శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. 2016లో ఎన్నికల కంటే ముందు సోనోవాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో తొలిసారిగా గెలిచింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment