
ఆడవాళ్లకే ఎక్కువ
కొత్తగా రంగంలోకి అడుగిడేవారిలో ప్రతిభగల వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వర్ధమాన తార కృతి సనన్ పేర్కొంది. అయితే మగవారితో పోలిస్తే ఆడవాళ్లకే అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయంది. ‘బయటి ప్రాంతాలనుంచి వచ్చేవారి విషయంలో పరిస్థితులు మారిపోయాయి, వారికి నాణ్యమైన పని దొరుకుతోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడమనేది ఆహ్వానించదగ్గ పరిణామం’ అని అన్నారు. నిర్మాతలు వెనకటి మాదిరిగా లేరు. ఈ రంగంతో సంబంధంలేని వారికి కూడా అవకాశం కల్పించడమనేది గతంలో ఏనాడూ జరగలేదు. సినిమా అనేది హీరో భుజస్కంధాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల హీరో పాత్రధారి అందరికీ తెలిసినవాడైతే బాగుంటుంది’ అని అంది. ఏదిఏమయినప్పటికీ మగవాళ్లకంటే ఆడవాళ్లకే అవకాశాలు బాగా లభిస్తున్నాయంది.
కొత్త నటుడిని పరిచయం చేసేందుకు నిర్మాతలు కొంత జంకుతున్నారంది. కొత్తగా బాలీవుడ్‌లోకి అడుగిడిన ఆడవాళ్లకు సీనియర్ నటుల సరసన నటించే అవకాశాలు కూడా లభిస్తున్నాయని 23 ఏళ్ల కృతి తన మనసులో మాట చెప్పింది. ఆడవాళ్లకు అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయంది. కాగా సినిమాయేతర రంగంనుంచి బాలీవుడ్‌లోకి అడుగిడిన కృతికి అవకాశాలు విరివిగానే లభిస్తున్నాయి. ఇందుకోసం ఈ సుందరి పెద్దగా పోరాడాల్సిన పనేలేకుండాపోయింది. ‘బాలీవుడ్‌లో అవకాశాల విషయంలో నేనెంతో అదృష్టవంతురాలిని, సినిమా అవకాశాలకోసం నానాతంటాలు పడుతున్నవారిని ఎందరినో గమనిస్తున్నా’నంటూ కాస్త గర్వంగా చెప్పింది.