న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే కొద్దీ ఉత్పత్తుల విక్రయాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. సీక్వెన్షియల్‌గా కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు.
వీటిలో భౌగోళికరాజకీయ పరిస్థితుల్లాంటి అంతర్జాతీయ అంశం ప్రధానమైనది కాగా వాతావరణ మార్పు రెండోదని ఆయన వివరించారు. అయితే, మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలని సంజీవ్ పురి తెలిపారు.
మరోవైపు, హోటల్ వ్యాపారాన్ని విడగొట్టడం వల్ల ప్రస్తుత వాటాదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అగ్రిబిజినెస్ వ్యాపార విభాగం ప్రతికూల పనితీరు ప్రభావం కారణంగా జూన్ త్రైమాసికంలో ఐటీసీ ఆదాయం 6 శాతం క్షీణించి రూ. 18,639 కోట్లకు పరిమితం కాగా లాభం మాత్రం 16 శాతం పెరిగి రూ. 5,180 కోట్లకు చేరింది. దేశీయంగా వ్యవసాయ రంగ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని సంజీవ్ పురి చెప్పారు. ఉత్పాదకత, మార్కెట్ అనుసంధానతను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment