సంక్షేమంలో కోత
- పడకేయనున్న పథకాలు!
- ఫీజు రీయింబర్స్‌మెంటుపై అనుమానాలు
- రేషన్ సరకులదీ అదే బాట
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే పథకాల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోటు బడ్జెట్ పేరుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కోత పడే అవకాశాలు ఉన్నాయంటూ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పటికే పథకాలకు నిధుల కేటాయింపులో కోత పడుతోంది. మున్ముందు పరిస్థితి
మరింత దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్ర విభజన ప్రభావం ప్రభుత్వ శాఖల బడ్జెట్‌పై పడింది. పెన్షన్ల నుంచి సాల్కర్‌షిప్‌ల వరకు అన్నింటికీ అరకొర నిధులే విడుదలవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,21,517 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.7.93 కోట్లు అవసరం. కానీ 1,70,413 మందికి రూ.4.66 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన వారు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. స్కాలర్‌షిప్‌ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.
హామీలు నెరవేర్చేనా : దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని తరువాత ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఈ పథకంలో కేటాయింపులు తగ్గించి విద్యార్థులపై భారం వేసింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీ కేజీ నుంచి పీజీ వరకు ఉచితమని మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అలాగే అన్ని రకాల పెన్షన్లను రూ. వెయ్యికి పెంచామని హామీలు గుప్పించారు.
కానీ ఇప్పుడు రుణమాఫీ విషయంలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లోటుబడ్జెట్ పేరుతో అన్ని పథకాలును అమలు చేయడం, హామీలన్నింటినీ ఒకేసారి నెరవేర్చడం సాధ్యంకాదని టీడీపీ నాయకులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రం కలిసున్నప్పుడే సంక్షేమ పథాకల్లో కోతలు పడగా రాష్ట్ర విభజన తరువాత బడ్జెట్ లేదన్న సాకుతో కొనసాగుతున్న పథకాలను మరింత కుదించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రేషన్‌దుకాణాల ద్వారా సరఫరా కావాల్సిన నిత్యావసరాలు సక్రమంగా విడుదల కావడం లేదు. జిల్లాకు కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తెల్లరేషన్‌కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
గత నెల 16న ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం కొలువుతీర లేదు. దీంతో సంక్షేమ పథకాల పరిస్థితి దారుణంగా మారింది. ఆదివారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రకటనలు చేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.