స్క్వాడ్రన్ లీడర్ అభయ్
సాక్షి, హైదరాబాద్: సమాజంలో దివ్యాంగులకూ సమాన అవకాశాలు కల్పించడమెలా? కుక్కలు మనకు నేర్పే పాఠాలు ఏమిటి? మనలాంటి సామాన్యులు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఏం చేయాలి? పామాయిల్‌కూ మనకొస్తున్న జబ్బులకూ సంబంధం ఏమైనా ఉందా? ఇలాంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నానికి ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టెడ్–ఎక్స్ కార్యక్రమం వేదికగా నిలిచింది.
కొత్త ఆలోచనలను పంచుకునే వేదికగా దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన ‘‘టెడ్ టాక్స్’’అనుబంధ కార్యక్రమమే ఈ టెడ్–ఎక్స్! హైదరాబాద్‌లోనూ చాలా ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా ఆదివారం 14 మంది వక్తలతో ఇది సందడిగా జరిగింది. ‘రైజింగ్’అన్న ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సవాళ్లను అధిగమించి.. విజయం సాధించిన వారు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.
ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన హైదరాబాదీ ఆర్.శ్రీధర్, ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ.. ఒక చెయ్యి కోల్పోయినా స్థైర్యం కోల్పోకుండా ఫిట్‌నెస్ ట్రెయినర్‌గా ఎదిగిన టింకేశ్ కౌశిక్ వంటి వారు ఈ కార్యక్రమంలో తాము పడ్డ కష్టాలు.. వాటిని ఎదుర్కొన్న తీరును వివరించారు. అంతేకాదు.. కుక్కలతో కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు నేర్పించే శిరీన్ మర్చంట్, కేదార్‌నాథ్ ఆలయం వద్ద ప్లాస్టిక్ చెత్త సమస్యను పరిహరించేందుకు వినూత్నమైన ఆలోచనతో ఓ ప్రయోగం చేసి సత్ఫలితం సాధించిన ‘రీసైకిల్’వ్యవస్థాపకుడు అభయ్ దేశ్‌పాండే, చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై స్క్వాడ్రన్ లీడర్ అభయ్ ప్రతాప్ సింగ్‌లు కూడా ప్రసంగించి ఆయా అంశాల్లో తాము చేసిన పనులను వివరించారు. చౌక పామాయిల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి కలుగుతున్న హాని.. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వంటి అంశాలపై మాట్లాడిన న్యూయార్క్ జర్నలిస్ట్ జోసిలీన్ సి జుకర్మాన్ ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment