
ఫిబ్రవరిలో 5,900 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్
అంతకు ముందు నెలతో పోలిస్తే 10 శాతం ఎక్కువ
రిజిస్ట్రేషన్ ప్రాపర్టీల విలువ రూ.3,925 కోట్లు
నైట్‌ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడి
కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేవైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరపడిన ధరలు తదితర కారణాలతో జనవరి నుంచి నగర స్థిరాస్తి రంగం కోలుకుంటోంది. –సాక్షి, సిటీబ్యూరో
గత నెలలో గ్రేటర్‌లో రూ.3,925 కోట్లు విలువ చేసే 5,900 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. జనవరిలో రూ.3,293 కోట్ల విలువైన 5,464 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెల రోజుల్లో విలువల్లో 13 శాతం, యూనిట్ల రిజిస్ట్రేషన్లలో 10 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది.
నగరవాసులు లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. విశాలమైన ఇళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షలలోపు ధర ఉన్న గృహాలు 59 శాతం విక్రయించగా.. గత నెలకొచ్చేసరికి వీటి వాటా 56 శాతానికి తగ్గింది.
ఇదీ చదవండి: చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..
వీటి స్థానంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీల వాటా గతేడాది ఫ్రిబవరిలో 15 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 18 శాతానికి పెరిగింది. అలాగే 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 2024 ఫిబ్రవరిలో 13 శాతంగా ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 1,000–2,000 చ.అ. మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది.

Comments
Please login to add a commentAdd a comment