మ్యూచువల్‌ ఫండ్‌లకు అపార అవకాశాలు | Business: Huge Opportunity For Mutual Funds | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్‌లకు అపార అవకాశాలు

Published Wed, Aug 11 2021 12:43 AM | Last Updated on Wed, Aug 11 2021 12:43 AM

Business: Huge Opportunity For Mutual Funds - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా మ్యుచువల్‌ ఫండ్‌లు ఇంకా సామాన్య ప్రజానీకానికి పూర్తిస్థాయిలో చేరలేదని, ఈ నేపథ్యంలో ఫండ్స్‌ విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఎండీ, సీఈవో నిమేష్‌ షా తెలిపారు. పెట్టుబడి సాధనంగా ఫండ్స్‌పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. సిప్‌ (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా 2018–19 జూన్‌లో రూ. 7,554 కోట్ల పెట్టుబడులు రాగా, 2020–21 జూన్‌లో రూ. 9,156 కోట్లు రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ప్రతి బుల్‌ మార్కెట్‌ తరహాలోనే ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు నేరుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ధోరణులు కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్‌ బ్యురోకి ఇచ్చిన ఇంటర్వూ్యలో తెలిపారు. అయితే, మార్కెట్లు బులిష్‌గా ఉన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండని ఇన్వెస్టర్లు ఆ తర్వాత రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని చరిత్ర చెబుతోందన్నారు. సరైన పెట్టుబడి సాధనాలకు తగు పాళ్ళలో నిధులను కేటాయించడం ముఖ్యమని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సలహాదారు సహాయాన్ని తీసుకోవాలని షా సూచించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్రస్తుత మార్కెట్లు.. 
అంతర్జాతీయ సెంట్రల్‌ బ్యాంకులు విడుదల చేసిన నిధుల ఊతంతో ప్రపంచవ్యాప్తంగాను, దేశీయంగాను స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్టాలకు పరుగులు తీస్తున్నాయి. భారీ వేల్యుయేషన్లతో ట్రేడవుతున్నాయి. నిధుల లభ్యతతో పాటు దాదాపు సున్నా స్థాయి వడ్డీపై రుణాలు మొదలైన అంశాలన్నీ ఈక్విటీ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. వ్యాపార పరిస్థితుల వలయాన్ని బట్టి చూస్తే భారత బిజినెస్‌ సైకిల్‌ ఆకర్షణీయంగానే ఉంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆర్థిక వృద్ధి రికవరీ కాస్త మందగించినట్లుగా ఉన్నప్పటికీ దేశీయంగా సానుకూల ఆర్థికాంశాలు, ప్రభుత్వ విధానాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఉదారవాద చర్యలు తదితర అంశాలు వల్ల సరైన దిశలోనే సాగుతోందని చెప్పవచ్చు. వచ్చే రెండేళ్లలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచే అవకాశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.

ఫండ్స్‌ విషయంలో ఇన్వెస్టర్లు పాటించాల్సిన వ్యూహం.. 
అంతర్జాతీయంగా ఈక్విటీలు, కమోడిటీలు సహా రిస్కులతో కూడుకున్న అన్ని పెట్టుబడి సాధనాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో వ్యాపారాలు కోలుకునే క్రమంలో కార్పొరేట్ల ఆదాయాలు, లాభదాయకత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల బిజినెస్‌ సైకిల్‌ ఆధారిత ఫండ్‌ను ప్రవేశపెట్టాం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈక్విటీల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం శ్రేయస్కరం. మహమ్మారి పరిణామాలు, అంతర్జాతీయంగా వృద్ధి రికవరీ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు తోసిపుచ్చలేము. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ లేదా డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ కేటగిరీకి చెందిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం శ్రేయస్కరం.

ఇలాంటి ఫండ్స్‌ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ఈక్విటీల్లో పెట్టుబడుల వ్యూహాలను సరిచేసుకుంటూ ఉంటాయి. అటు మార్కెట్‌ క్యాప్‌లపరంగా వివిధ కేటగిరీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఫ్లెక్సిక్యాప్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. వేల్యూ ఇన్వెస్టింగ్‌ ద్వారా సైతం మంచి రాబడులను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పలు రంగాల్లో సంస్థలు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో లభిస్తున్నాయి. వీటిలో చాలా మటుకు విభాగాలు 2008 తర్వాత పెద్దగా రాణించలేకపోయాయి. ఈక్విటీలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు .. వేల్యూ ఇన్వెస్టింగ్‌ విధానం పాటించవచ్చు. అయితే, రికార్డు స్థాయిలో నిధులు వస్తుండటంతో ప్రస్తుతం ధరలు.. వాస్తవిక స్థాయిలో లేవు. సెంట్రల్‌ బ్యాంకుల చర్యల ప్రభావాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి ప్రతీ పెట్టుబడి సాధనానికి ఎంతో కొంత రిస్కు ఉంటుందన్న సంగతి ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

గత సంవత్సరం.. డెట్‌ సంక్షోభం.. 
గతేడాది తొలినాళ్లలో డెట్‌ మార్కెట్‌లో సంక్షోభమనేది ఒక కంపెనీకి మాత్రమే పరిమితమైన సంఘటన తప్ప వ్యవస్థాగతంగా ఎలాంటి రిస్కులూ తలెత్తలేదు. మా విషయానికొస్తే గత 23 ఏళ్లలో ఎన్నడూ ఏ స్కీములోనూ డిఫాల్ట్‌ గానీ చెల్లింపుల్లో జాప్యం గానీ జరగలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement